1965 యుద్ధానికి పాకే కారణం

Fri,August 28, 2015 01:31 AM

Climbing to the cause of the war in 1965,

- భారత్‌పై నెపం నెట్టేందుకు ప్రయత్నం: అమెరికా
వాషింగ్టన్: భారత్- పాకిస్థాన్ మధ్య 1965లో జరిగిన యుద్ధానికి పాకిస్థానే కారణమని స్పష్టమైంది. కశ్మీర్‌పై దురాక్రమణకు పాల్పడటమే కాకుండా భారతే తమపై దాడి చేసిందని ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్థాన్ వేసిన ఎత్తులు బహిర్గతమయ్యాయి. 1965 యుద్ధం తీవ్రస్థాయికి చేరిన సమయంలో పాకిస్థాన్- అమెరికా, భారత్- అమెరికా మధ్య జరిగిన పలు దౌత్య పరిణామాలకు సంబంధించిన పత్రాలను అమెరికా విదేశాంగశాఖ తాజాగా బయటపెట్టింది. యుద్ధంలో పాక్ ఓటమి దశకు చేరిన సమయంలో నాటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్, విదేశాంగమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టోలను పాక్‌లో అమెరికా రాయబారి వాల్టర్ ప్యాట్రిక్ మెక్‌కోటే కలిసి యుద్ధ విరమణకోసం చర్చలు జరిపారు.

అప్పటికే భారత సేనలు పాక్ భూభాగంలోకి ప్రవేశించటంతో పాక్ పాలకులు తాము యుద్ధ బాధితులమని అమెరికాకు, ఐక్యరాజ్యసమితి కూడా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పాక్ వాదనను అమెరికా కొట్టిపారేసినట్లు దౌత్యపత్రాల ద్వారా వెల్లడైంది. కశ్మీర్‌లోకి దొంగచాటుగా సేనల్ని పంపి యుద్ధానికి కారణం కావటమే కాకుండా నెపాన్ని ఇతరులపై మోపుతున్నారంటూ అమెరికా రాయబారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అదీకాక తాము ఇచ్చిన ఆయుధాలతో భారత్‌పై యుద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. దాంతో ప్లేటు ఫిరాయించిన పాక్ 1948లో ఐరాస చేసిన తీర్మానాన్ని అనుసరించి జమ్ముకశ్మీర్‌లో ప్రజాభిప్రాయసేకరణ జరుపాలని అమెరికా, ఐరాసను కోరింది.

అదే సమయంలో నాటి భారత ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్‌కు లేఖ రాశారు. ఐరాస తీర్మానానికి ఏనాడో కాలం చెల్లిపోయిందని, కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశమేలేదని కరాఖండిగా చెప్పారు. బేషరతుగా కాల్పుల విరమణను పాటించేందుకు తాము సిద్ధమేనని తెలిపారు. దాంతో పాకిస్థాన్‌ను కాల్పుల విరమణ పాటించాలని అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు దౌత్యపత్రాల ద్వారా తెలిసింది.

793
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles