నేపాల్ సరిహద్దుల్లో చైనా రోడ్డు

Tue,September 19, 2017 01:58 AM

China Opens Highway To Nepal Via Tibet Ready For Military Use If Needed

- పౌర, సైనిక అవసరాలకోసం 40.4 కిలోమీటర్ల కీలక రహదారి
- దక్షిణాసియా దిశగా గురి
chinaroad
బీజింగ్: నేపాల్ సరిహద్దుతో కలిసే కీలకమైన రోడ్డు మార్గాన్ని చైనా ప్రారంభించిందని ఆ దేశ మీడియా వెల్లడించింది. టిబెట్‌లోని జిగాజే ఎయిర్‌పోర్టు, జిగాజే నగరం మధ్య 40.4 కిలోమీటర్ల ప్రధాన రహదారిని పౌర, సైనిక అవసరాలకు ఉపయోగించే అవకాశాలున్నాయని, ఈ మార్గంవల్ల దక్షిణాసియా చైనాకు అందుబాటులోకి వస్తుందని అధికారపత్రిక గ్లోబల్ టైమ్స్ రాసింది. చైనా ఆర్థిక రాజధాని షాంఘై నగరాన్ని నేపాల్ సరిహద్దుల్లోని జాంగ్‌మూను ఈ రోడ్డు కలుపుతుంది. అంతేకాకుండా టిబెట్‌లోని రైల్వేలైనుకు కూడా ఇది సమాంతరంగా సాగుతుంది. దీనివల్ల వాణిజ్యపరంగానే కాకుండా సైనిక విస్తరణపరంగా దక్షిణాసియా చైనాకు చేరువ అవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం.

జీ-318 రహదారి జిగాజేకు చేరుకుంటుంది. అటునుంచి ఓ పాయ నేపాల్‌కు వెళ్తుంది. మరోపాయ అరుణాచల్ సరిహద్దుల్లోని నింగ్చీకి వెళ్తుంది. చైనా నిర్మించే రహదారులన్నీ అధునాతనమైనవని, వాటిని పౌరరవాణాతోపాటుగా సైనిక అవసరాలకు ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. రోడ్లపై భారీసైనిక వాహనాలను తిప్పేందుకు, అవసర సమయాల్లో రక్షణ విమానాలను దింపేందుకు వీలుండడమే దీనికి కారణం. నేపాల్‌కు రోడ్డు సౌకర్యం మెరుగుపర్చేందుకు చైనా ఆగమేఘాల మీద కృషి చేస్తున్నది. మాధేసీ ఆందోళన సందర్భంగా చైనా అనుకూల నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ భారత్ మీద ఎక్కువగా ఆధారపడకూడదనే ఉద్దేశంతో చైనాతో సరిహద్దు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఓలీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత చైనా దూకుడు కొంత తగ్గింది.

295

More News

VIRAL NEWS

Featured Articles