చంద్రుడి వెనుక భాగంపై చాంగే-4

Fri,January 4, 2019 02:30 AM

China lunar rover touches down on far side of the moon state media announce

-విజయవంతంగా దిగిన రోవర్
-ఇప్పటివరకూ ఏ దేశమూ సాధించని అరుదైన ఘనతను సాధించిన చైనా

బీజింగ్, జనవరి 3: అంతరిక్ష రంగంలో చైనా మరో అరుదైన ఘనతను సాధించింది. డిసెంబర్ 8న ఆ దేశం ప్రయోగించిన చాంగే-4 ల్యూనార్ రోవర్ చంద్రుడి వెనుక భాగంపై విజయవంతంగా దిగింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 10:26 గంటలకు చాంగే-4 చంద్రుడి ఆవలి భాగంపై దిగినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్‌ఎస్‌ఏ) వెల్లడించింది. అలాగే అక్కడి నుంచి ఫొటోలను కూడా భూమికి పంపినట్లు తెలిపింది. భూమికి ఎదురుగా ఉండే చంద్రుడి భూభాగంపైకి ఇప్పటికే పలుదేశాలు వ్యోమనౌకలు పంపినప్పటికీ... భూమికి కనిపించని చంద్రుడి వెనుక భాగంపైకి ఇప్పటివరకు ఏ దేశం కూడా వ్యోమనౌకలు పంపలేదు. తాజాగా ఆ ఘనతను చైనా సాధించింది. దీంతో చంద్రుడి ఆవలి వైపు రహస్యాలను ఛేదించాలన్న శాస్త్రవేత్తల దశాబ్దాల కల నెరవేరనుందని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. సిచుయాన్ ప్రావిన్సులోని జీచాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి డిసెంబర్ 8న లాంగ్‌మార్చ్-3బీ రాకెట్ ద్వారా ల్యాండర్, రోవర్‌తో కూడిన చాంగే-4ను చైనా ప్రయోగించింది. ప్రయోగం విజయవంతం కావడంతో చైనా శాస్త్రవేత్తలకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శుభాకాంక్షలు తెలిపింది. సాధారణంగా భూమికి ఎదురుగా ఉండే చంద్రుడి భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది.

ఆవలి వైపు ఎప్పటికీ కనిపించదు. చంద్రుడి రెవల్యూషన్ సైకిల్, రొటేషన్ సైకిల్ సమానం కావడమే ఇందుకు కారణం. చంద్రుడి వెనుక భాగం నుంచి నేరుగా సమాచారం సేకరించడం సాధ్యపడదు. దీంతో చాంగే-4ను భూమితో అనుసంధానించడానికి గతేడాది మే నెలలోనే చైనా క్వెకియావో అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. చాంగే-4లో 1088 కిలోల బరువైన ల్యాండర్, 136 కిలోల రోవర్ ఉన్నాయి. చంద్రుడిపై పరిశోధనలకు 2004లో ల్యూనార్ మిషన్‌ను చైనా ప్రారంభించింది. ఇప్పటివరకు నాలుగు ప్రయోగాలు చేపట్టింది. చాంగే-4 నాలుగోది. వచ్చే దశాబ్దకాలంలో చంద్రుడిపైకి మానవ సహిత వ్యోమనౌకను పంపాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకున్నది.

1993
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles