చాబహార్ పోర్ట్ ఆదివారం ప్రారంభం

Mon,December 4, 2017 03:29 AM

Chabahar Port, hassan rouhani, afghanistan, iran, india

- పాకిస్థాన్‌కు చెక్ పెట్టిన ఇండియా
- ఆఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియా దేశాలకు సరుకు రవాణాకు సొంత మార్గం
- తొలి దశ ఓడరేవును ప్రారంభించిన ఇరాన్ అధ్యక్షుడు
Chabahar
న్యూఢిల్లీ/టెహ్రాన్: తొలి దశ నిర్మాణం పూర్తిచేసుకున్న చాబహార్ పోర్ట్ ఆదివారం ప్రారంభమైంది. హహీద్ బహెష్తీ పేరు పెట్టిన తొలిదశ ఓడరేవును ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని లాంఛనంగా ప్రారంభించారు. ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్‌లతో వ్యూహాత్మక వాణిజ్య రవాణాకు ఉపయోగపడేలా భారత్ నిర్మించిన తొలి ఓడరేవు ఇదే. భారత్-ఇరాన్-ఆఫ్ఘనిస్థాన్ త్రైపాక్షిక సంబంధాల్ని మరింత బలోపేతం చేసే దిశగా దీన్ని నిర్మించారు. తన ప్రాదేశిక జలాల గుండా సరుకురవాణా ఓడల్ని అనుమతించబోనని పాకిస్థాన్ స్పష్టంచేయడంతో గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో భారత్ ఈ పోర్ట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఆగ్నేయ ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్థాన్ రాష్ర్టాల మధ్య చాబహార్ పోర్ట్‌ను నిర్మించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని ప్రసంగిస్తూ... ఇరుగుపొరుగు దేశాల మధ్య ప్రాంతీయంగా సత్సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఆశావహ పో టీ అందరికీ మంచిది. మేం మరిన్ని ఓడరేవులు రా వాలని కోరుకుంటున్నాం. గ్వదర్ ఓడరేవు అభివృద్ధినీ స్వాగతిస్తున్నాం అని చెప్పారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి భారత్, ఖతర్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సహా 17 దేశాల 60మంది ప్రతినిధులు హాజరయ్యారని ఇరాన్ ప్రభుత్వ టీవీ చానెల్ తెలిపింది. అంతకు ముందు భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ తెహ్రాన్‌లో శనివారం భేటీ అయ్యారు. చాబహార్ పోర్ట్ ప్రాజెక్టు అమలు తీరుపై వారు సమీక్షించారు.

భారత్‌కు వ్యూహాత్మక వాణిజ్యకేంద్రం చాబహార్

పాకిస్థాన్‌లో చైనా పెట్టుబడి పెట్టి నిర్మిస్తున్న గ్వదర్ పోర్ట్‌కు దీటుగా దానికి 80 కిమీ దూరంలోనే ఇరాన్‌తో కలిసి చాబహార్ పోర్ట్‌ను నిర్మించడం భారత్ వ్యూహాత్మకంగా తీసుకున్న చర్య. దీనివల్ల మిత్రదేశం ఇరాన్‌తో సఖ్యత నెరుపుతూనే పాక్, చైనా ప్రమేయం లేకుండానే ఆఫ్ఘనిస్థాన్, మధ్యాసియా దేశాలకు సరుకుల్ని మోసుకెళ్లగలగడంతోపాటు దీన్ని అత్యవసర సందర్భాల్లో సైనిక అవసరాలకు వాడుకోవడం ఈ వ్యూహాంలోని కీలకాంశాలు. గత ఏడాది మేలో సం యుక్త భాగస్వామ్యంతో చాబహార్ ఓడరేవును నిర్మించాలని భారత్-ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొలిదశ పోర్టు నిర్మాణానికి భారత్ 85మిలియన్ డాలర్లు (రూ.548కోట్లు) ఖర్చు చేసింది. ఇక పూరిస్థాయి పోర్టు నిర్మాణానికి 340 మిలియన్ డాలర్లు, నౌకాశ్రయానికి, రోడ్ల అనుసంధానానికి, రైలుమార్గాల నిర్మాణానికి మరో 160 మిలియన్ డాలర్లు (రూ.1032 కోట్లు) ఖర్చుచేస్తున్నది. ఈ రేవుపై పదేండ్లపాటు భారత్‌కు లీజ్ హక్కులు కూడా దక్కుతాయి.

ఓడరేవుతోపాటు లింక్‌రోడ్లు, రైల్వేమార్గాల నిర్మాణానికి కూడా భారత్ ఆర్థికసాయం చేయనున్నది. ఐదు వారధి స్తంభాలను తొలిదశలో నిర్మించారు. లక్ష టన్నుల సామర్థ్యమున్న సరుకు రవాణా నౌకలు, కం టైనర్లు డాక్‌లోకి ప్రవేశించేందుకు వీలుగా రెండు వారధిస్తంభాల్ని రూపొందించారు. నెలరోజుల క్రితం ఒక నౌకలో లక్షా10వేల టన్నుల గోధుమల్ని చాబహార్ రేవు ద్వారా ఆఫ్ఘన్‌కు పంపిన భారత్ సరుకులు సకాలంలో గమ్యస్థానానికి చేరడంతో ఓడరేవు తొలిదశ ప్రారంభానికి సిద్ధమైనట్లు నిర్ధారణకు వచ్చింది. జనవరి చివరిలో మరో ఏడు నౌకల్లో గోధుమల్ని ఆప్ఘన్‌కు పంపాలని భారత్ నిర్ణయించింది. చాబహార్‌కు నౌకల ద్వారా, అక్కడి నుంచి ట్రక్కుల ద్వారా పశ్చిమ ఆఫ్ఘన్‌కు సరుకుల్ని చేరవేస్తారు. వచ్చే ఏడాదినాటికి పూర్తిస్థాయిలో చాబహార్ ఓడరేవు పూర్తికానున్న నేపథ్యం లో ప్రస్తుతానికి తొలి దశలోనే ఈ రూట్ ఏమేరకు ఉపయోగపడుతుందో సరిపోల్చుకోవడానికే ట్రయల్‌గా ఈ సరుకు రవాణా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS