బ్రెగ్జిట్‌లో ఓడా.. రాజీనామా చేస్తా!

Sat,May 25, 2019 01:51 AM

British PM May resigns paving way for Brexit confrontation with EU

-బ్రిటన్ ప్రధాని థెరెసా మే వెల్లడి
-జూన్ 7న పదవి నుంచి వైదొలుగుతానని ప్రకటన
-బ్రెగ్జిట్‌పై ఏకాభిప్రాయ సాధనలో విఫలమయ్యానంటూ భావోద్వేగం

లండన్, మే 24: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలిగేందుకు ప్రతిపాదించిన బ్రెగ్జిట్ ఒప్పందానికి పార్లమెంట్‌లో ఆమోదం కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో బ్రిటన్ ప్రధాని థెరెసా మే తన పదవి నుంచి వైదొలుగనున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల ఏడో తేదీన రాజీనామా చేస్తానని శుక్రవారం లండన్‌లో మీడియాతో చెప్పారు. తదుపరి ప్రధాని వచ్చే నెల 10 నుంచి బ్రెగ్జిట్ ఒప్పందం ఆమోదానికి చర్యలు తీసుకుంటారన్నారు. దేశ ప్రయోజనాల రీత్యా పదవి నుంచి వైదొలుగుతున్నట్లు థెరెసా మే తెలిపారు. దేశానికి నేను రెండో మహిళా ప్రధానిని. అయితే, నేనే చివరి వ్యక్తిని కాదు. దేశానికి సేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు దేశ ప్రజలకు ధన్యవాదాలు అని తెలిపారు. బ్రెగ్జిట్ ఒప్పందానికి పార్లమెంట్ ఆమోద ముద్ర వేయించడంలో తాను విఫలమయ్యానని థెరెసా మే అంగీకరిస్తూ.. భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.

దీనిపై విపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బైన్ స్పందిస్తూ.. ఇప్పటికి థెరెసా మే సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు. 28 సభ్య దేశాల ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు గత మార్చి 29 తుది గడువు. కానీ దాన్ని వచ్చే అక్టోబర్ 31 వరకు పొడిగించారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా రిఫరెండం ఫలితం వచ్చిన తర్వాత 2016లో ప్రధానిగా థెరెసా మే బాధ్యతలు చేపట్టారు. అయితే బ్రెగ్జిట్ బిల్లుపై విపక్ష లేబర్ పార్టీ ఎంపీల మద్దతు కూడగట్టి ఏకాభిప్రాయాన్ని సాధించడంలో ఆమె విఫలమయ్యారు. బ్రెగ్జిట్ విషయంలోనే ఆమెపై గతేడాది డిసెంబర్‌లో లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. నాటి నుంచి రాజీనామా చేయాలని థెరెసా మేపై ఒత్తిడి పెరిగింది.

501
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles