ఉదాసీనతతోనే అమెరికాకు ముప్పు

Sun,September 9, 2018 02:10 AM

Barack Obama gives scathing critique of Donald Trump and US

-ప్రజల్లో విభజనకు ట్రంప్ సంకేతం మాత్రమే.. కారణం కాదు
-రాజకీయాల పట్ల ద్వేషాన్ని వీడి ఓటింగ్‌లో పాల్గొనాలి
-మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపు

షికాగో, సెప్టెంబర్ 8: అమెరికాలో ప్రజాస్వామ్యం ఉదాసీనత, ద్వేషం అనే పెద్ద ముప్పును ఎదుర్కొంటున్నదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ పునరాభివృద్ధి తన హయాంలోనే ప్రారంభమైందని ఇప్పుడు కాదని గుర్తు చేశారు. ట్రంప్ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఒబామా మరో రెండు నెలల్లో జరుగనున్న రాష్ర్టాల ఎన్నికల్లో భారీగా వచ్చి పోలింగ్‌లో పాల్గొనాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇల్లినాయిస్ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒబామా ప్రసంగించారు. అమెరికాలో ప్రజాస్వామ్యానికి ముప్పు డొనాల్డ్ ట్రంప్, కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లు, డెమోక్రాట్ల రాజీ విధానం వల్ల లేదా రష్యన్లు హ్యాకింగ్ చేయడం వల్ల వాటిల్లడం లేదు. మన ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు ఉదాసీనత, ద్వేష భావం వల్ల ఎదురవుతున్నది. రాజకీయాల పట్ల ద్వేషం చూపుతూ ఎన్నికల రోజున ఇండ్లకే పరిమితం కావడం వల్ల ముప్పు వాటిల్లుతున్నది. అమెరికా ప్రస్తుతమున్న స్థితి నుంచి బయటపడాలనుకుంటే భారీ సంఖ్యలో ఉన్న యువత ఓటు వేయడానికి ముందుకు రావాలి అని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజల్లో కొన్నేండ్లుగా పెరుగుతున్న ఆగ్రహాన్ని రాజకీయ నాయకులు మరింత రెచ్చగొట్టారని, దాన్ని ట్రంప్ సొమ్ము చేసుకున్నాడని అన్నారు. ప్రజల మధ్య విభజనకు ట్రంప్ కేవలం ఒక సంకేతం మాత్రమేనని, కారణం కాదని చెప్పారు. ట్రంప్ సైన్స్‌ను వ్యతిరేకిస్తున్నాడని, వాతావరణ మార్పుల అంశాన్ని తిరస్కరిస్తున్నాడని, సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయడం లేదని చెప్పారు. తన ఎనిమిదేండ్ల పాలనలో అమెరికాను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేశానని తెలిపారు. కానీ నేడు మధ్యతరగతి ప్రజలు ఆర్థిక అభద్రతా భావంలో ఉన్నారని అన్నారు. బిన్ లాడెన్‌ను ఏరివేశాం. ఇరాక్‌లో యుద్ధాలను, ఆఫ్ఘనిస్థాన్‌లో మన పాత్రను ముగించాం. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నిలువరించాం. అయినప్పటికీ ప్రపంచంలో ఇంకా గందరగోళం నెలకొని ఉంది, ప్రమాదాలు పొంచి ఉన్నాయి అని ఒబామా పేర్కొన్నారు. ఈ సవాళ్లు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయని చెప్పారు. అంతా ఓ పథకం ప్రకారమే జరుగుతున్న కుట్రగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

492
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles