నాలుగేండ్ల నివాసం తప్పనిసరి

Fri,April 21, 2017 01:35 AM

australian
మెల్‌బోర్న్, ఏప్రిల్ 20:ఆస్ట్రేలియా ప్రభుత్వం పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేసింది. ఇంగ్లిష్ ధారాళంగా రావడం, ఆస్ట్రేలియాలో ఎక్కువ రోజులు నివాసముండటం వంటి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఆస్ట్రేలియా విలువలను గౌరవించడం అనేది మరో షరతు. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ గురువారం నూతన పౌరసత్వ నిబంధనలను ప్రకటించారు. కొత్తగా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేవారు కనీసం నాలుగేండ్లు ఆస్ట్రేలియాలో నివసించినవారై ఉండాలి. ఇప్పటివరకు ఏడాది నివాసముంటే పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పౌరసత్వం నిమిత్తం నిర్వహించే పరీక్షలకు పరిమితులు విధించారు. ఇప్పటివరకు అపరిమిత అవకాశాలు ఇచ్చేవారు. కొత్త నిబంధనల ప్రకారం మూడుసార్లు పరీక్ష తప్పితే రెండేండ్ల దాకా ఆగాల్సిందే. చీటింగ్‌కు పాల్పడితే ఫెయిల్ చేస్తారు. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేవారు ప్రత్యేక ఇంగ్లిష్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.

-ఆస్ట్రేలియా పౌరసత్వ నిబంధనలు కఠినతరం
-స్థానిక విలువలకు కట్టుబడాలి l కొత్త విధానం ప్రకటించిన ప్రధాని టర్న్‌బుల్

అందులో మహిళల పట్ల గౌరవం, పిల్లల పట్ల ఆదరణ వంటి అంశాలు విశేషించి ఉంటాయి. ఆస్ట్రేలియా విలువలు, పౌరులుగా బాధ్యతల గురించి దరఖాస్తుదారు అవగాహన, అంకితభావాన్ని అంచనా వేసే దృష్టితో ప్రశ్నలు రూపొందిస్తారు. ఆస్ట్రేలియా పౌరసత్వం ఎంతో విలువైందని, దాన్ని అపురూపంగా చూసుకోవాలని ప్రధాని టర్న్‌బుల్ అన్నారు. దేశ విలువలను, చట్టాలను గౌరవించి, దేశ అభ్యున్నతికి కృషి చేయాలనే తపన ఉన్నవారికే పౌరసత్వం దక్కాలని నొక్కిచెప్పారు. కుటుంబ హింస, సంఘటిత నేరాలతో సహా అన్ని నేరపూరిత కార్యకలాపాలు ఆస్ట్రేలియా విలువలకు ఏమాత్రం సరిపడవని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా సమాజంతో మమేకం కావడానికి ఇంగ్లిష్ భాష ఎంతో ముఖ్యమని టర్న్‌బుల్ చెప్పారు.

పోలీసు పరిశీలనలు, తనిఖీలు ఇకనుంచి ముమ్మరం చేస్తామని వలసల శాఖమంత్రి పీటర్ డట్టన్ అన్నారు. వలసలను కట్టుదిట్టం చేసి పౌరసత్వ నిబంధనలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. పౌరసత్వం కోరుకునేవారు అన్ని నిబంధనలు పాటిస్తూ పన్నులను సరిగా కట్టి ఉండాలని కూడా స్పష్టం చేశారు. కనీస నివాస గడువు నాలుగేండ్ల కాలంలో 12 మాసాలకు మించి దేశం బయట ఉండరాదని డట్టన్ తెలిపారు. భారతీయులు అధికంగా ఉపయోగించుకునే 457 వీసాను ఆస్ట్రేలియా ఇటీవలే రద్దు చేసింది.

న్యూజీలాండ్ వీసాలూ కష్టమే
వీసాలు, పౌరసత్వ నిబంధనలు కఠినతరం చేయడం ఇప్పుడు సంపన్న దేశాలలో ఒక ధోరణిలా మారినట్టు కనిపిస్తున్నది. అమెరికా హెచ్1బీని, ఆస్ట్రేలియా 457 వీసాల జారీకి అదనపు షరతులు విధించిన నేపథ్యంలో న్యూజీలాండ్ కూడా కివీస్‌కే ప్రాధాన్యం అనే విధానం కింద వీసాలపై బిగింపులు ప్రకటించింది. వీసాలకు అధిక వేతన పరిమితి విధించింది. జీవిత భాగస్వాములు న్యూజీల్యాండ్‌కు రావడం ఇకనుంచి అంత సులభం కాదు. ఉద్యోగాల్లో కివీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మార్పులు తెచ్చినట్టు న్యూజీల్యాండ్ సర్కారు పేర్కొన్నది.

1117

More News

మరిన్ని వార్తలు...