ఇండోనేషియా చర్చిల్లో బాంబు పేలుళ్లు


Mon,May 14, 2018 03:03 AM

దద్దరిల్లిన సురబాయా నగరం, 11 మంది దుర్మరణం
ఆత్మాహుతిదళ సభ్యులంతా ఒకే కుటుంబం వారు

Motor-cycles
సురబాయా, మే 13: ఇండోనేషియాలోని అతిపెద్ద నగరమైన సురబాయా ఆదివారం ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లిపోయింది. మూడు చర్చిలలో జరిగిన పేలుళ్లలో 11 మంది పౌరులు దుర్మరణం చెందారు. నిమిషాల వ్యవధిలో ఒకదాని వెంట మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆదివారం చర్చిల వద్దకు వచ్చే క్రిస్టియన్ మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులు జరిగాయి. శాంటా మారియా రోమన్ క్యాథలిక్ చర్చికి ఉదయం ప్రార్థనల కోసం ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. నిమిషాల వ్యవధిలో మరో చర్చి వద్ద ఇంకో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. మూడో ఆత్మాహుతి దాడి పెంతకోస్త్ చర్చి వద్ద జరిగింది. మొత్తం మూడు ఘటనల్లో 11 మంది చనిపోగా 40 మందికి పైగా గాయపడ్డారు అని పోలీసు అధికార ప్రతినిధి ఫ్రాన్స్ బరుంగ్ మంగేరా తెలిపారు. ఈ దాడుల్లో కనీసం ఐదుగురు ఆత్మాహుతి దళ సభ్యులు పాల్గొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మాహుతికి పాల్పడిన వారిలో.. తల పూర్తిగా కప్పుకుని ఇద్దరు చిన్నారులతో వచ్చిన మహిళ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆత్మాహుతి దాడులకు పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆత్మాహుతికి దిగిన ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని, వారిలో తల్లిదండ్రులతోపాటు 9 నుంచి 12 ఏండ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు, 16 నుంచి 18 ఏండ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారని నేషనల్ పోలీస్ చీఫ్ టిటో కర్ణావియన్ ప్రకటించారు. ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్న జెమాహ్ అన్హరుత్ దౌలాహ్ (జేఏడీ) అనే మిలిటెంట్ గ్రూప్‌తో కలిసి వీరు పనిచేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడుల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను పెంచారు.

425

More News

VIRAL NEWS