ఇర్మా బాధితులకు సహాయచర్యలు ప్రారంభం


Wed,September 13, 2017 02:27 AM

-పలు ప్రాంతాల్లో నీటి సరఫరా పునరుద్ధరణ
-అంధకారంలోనే ఫ్లోరిడా
irma
మియామి, సెప్టెంబర్ 12: హరికేన్ ఇర్మా విరుచుకుపడటంతో విధ్వంసానికి గురైన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో మంగళవారం సహాయ చర్యలు కొనసాగాయి. ద్వీపకల్పంలో విధ్వంసానికి గురైన ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు అధికారులు ఒక్కొక్కరుగా కలిసివస్తున్నారు. సమాచారవ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయ్యింది. ఇర్మా నష్టంపై అధికారులు ఒక స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు. ఇది వినాశకరమైనది అని ఫ్లోరిడా గవర్నర్ రిక్‌స్కాట్ పేర్కొన్నారు. సోమవారం ఆయన కీ దీవిలో వరద పరిస్థితులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. నేవీ విమానం ద్వారా అధికారులు కీ ద్వీపం పశ్చిమ ప్రాంతాల్లో బాధితుల అన్వేషణ, రక్షణ చర్యలను ప్రారంభించారు. మంచినీటి సదుపాయం నిలిచిపోయిన ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరించారు. చమురు సరఫరా నెమ్మదించింది.

ద్వీపంలోని మూడు ప్రధాన దవాఖానలను మూసివేశారు. పునరావాస శిబిరాల్లో బాధితులు కిక్కిరిసిపోయారు. 1.3 కోట్ల జనాభాలో మూడువంతులు వరద ప్రభావానికి గురయ్యారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో మగ్గుతున్నారు. ఫ్లోరిడాలోని దాదాపు అన్ని ప్రాంతాలు ఇర్మా ప్రభావానికి గురయ్యాయి. హరికేన్ ప్రభావంతో ఫ్లోరిడాలో ఆరుగురు, జార్జియాలో ముగ్గురు, దక్షిణ కాలిఫోర్నియాలో ఒకరు మృతి చెందారు. కరీబియన్‌లో దాదాపు 35మంది మరణించారు. ఫ్లోరిడాకు ముందు ఇర్మా వల్ల జార్జియాలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. ఫ్లోరిడాలో 1,80,000 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియడంలేదు అని గవర్నర్ పేర్కొన్నారు. ఫ్లోరిడా పశ్చిమ తీరంలో నివాసగృహాలు, వృక్షాలు, వీధులు, విద్యుత్ లైన్లు వరదల్లో కొట్టుకుపోయాయి.

446

More News

VIRAL NEWS