వచ్చేసింది.. ఐఫోన్ X !

Wed,September 13, 2017 12:07 PM

Apple s iPhone 8 and iPhone X See the specs, new features and prices

- ఒకేసారి మూడు ఐఫోన్లు - X, 8, 8ప్లస్
- 4కె యాపిల్ టీవీ, వాచ్3, ఎయిర్‌పాడ్లు కూడా..

ఐఫోన్ ప్రియులంతా ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నూతన మోడల్ ఐఫోన్ X మంగళవారం అర్ధరాత్రి విడుదలైంది. యాపిల్ కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించిన వేడుకలో ఐఫోన్ ఎక్స్‌ను ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ లాంఛనంగా ఆవిష్కరించారు. గతంలో వచ్చిన ఎన్నో మోడల్స్‌కు భిన్నంగా, అనేక మార్పులు చేర్పులతో విప్లవాత్మకంగా యాపిల్ తన నూతన ఐఫోన్ Xను తీర్చిదిద్దింది. ఐఫోన్ పుట్టి పది సంవత్సరాలయిన సందర్భంగా రోమన్ అంకె పదిని సూచించే Xను ఈ హైఎండ్ ఫోన్‌కు జతచేశారు. దీంతోపాటు ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, సరికొత్త 4కే యాపిల్ టీవీ, ఎయిర్‌పాడ్లను కూడా యాపిల్ విడుదల చేసింది. ఈ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా 25వ తేదీనుండి మార్కెట్లో అందుబాటులోనికి రానున్నాయి.
కాలిఫోర్నియా, సెప్టెంబర్ 13: ఐఫోన్ జన్మ దశాబ్ది కానుకగా ఐఫోన్ X విచ్చేసింది. యాపిల్ తన సరికొత్త కార్యాలయం స్పేస్‌షిప్ క్యాంపస్ - యాపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో కిక్కిరిసిన అభిమానులు, డెవలపర్ల మధ్య సీఈవో టిమ్‌కుక్ ఐఫోన్ ఎక్స్‌ను విడుదలచేశారు. స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఇదే మొట్టమొదటి ఈవెంట్. ఇప్పటివరకు ఐఫోన్ 8గా భావిస్తున్న ఈ కొత్త ఫోన్‌ను ఊహించనివిధంగా ఎక్స్ గా పరిచయంచేసి, విడిగా మళ్లీ ఐఫోన్8, 8ప్లస్‌లను కూడా యాపిల్ ప్రవేశపెట్టింది. విప్లవాత్మకమైన మార్పులతో, ముందుభాగం పూర్తిగా తెరతో, సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో, అద్భుతమైన ఫీచర్లతో కుక్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రూపొందించిన ఐఫోన్ ఎక్స్.. ఆనవాయితీ ప్రకారం సెప్టెంబర్‌లోనే విడుదలైంది. సామ్‌సంగ్ తన ప్రధాన ఆయుధమైన గెలాక్సీ ఎస్8ను దీన్ని తట్టుకోవడానికే తయారుచేసి ముందుగా విడుదలచేయగలిగింది. కొత్త ఐఫోన్‌ల ప్రత్యేకతలు క్లుప్తంగా..


iPhone8plus

- డిస్‌ప్లే

కొత్త ఐఫోన్ X లో బెజెల్ లెస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే ఉంది. 5.8 అంగుళాల డిస్‌ప్లేతో, 1125 x 2436 రిజొల్యూషన్‌తో, మొదటిసారిగా సూపర్ రెటీనాగా పిలువబడే ట్రూటోన్ ఓలెడ్ తెరను నిక్షిప్తంచేశారు. ఐఫోన్ 8లో 4.7, ఐఫోన్ 8 ప్లస్‌లో 5.5 ఇంచ్ ఇంతకుముందులాగే రెటీనా ఎల్‌సీడీ డిస్‌ప్లే ఏర్పాటుచేశారు. మూడిట్లోనూ గతంలో వచ్చిన ఐఫోన్ 7 మోడల్స్‌లా 3డీ టచ్ డిస్‌ప్లే ఫీచర్ ఏర్పాటుచేశారు. ముందు, వెనుక గ్లాస్ కవర్ ఉంది.

- డిజైన్

స్థూలంగా ఐఫోన్ ఎక్స్ ఆకారం 7నే పోలిఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకతల కారణంగా ముందు, వెనుక కొంత విభిన్నంగా ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో పైన ఫ్రంట్ కెమెరా, స్పీకర్, మైక్ ఉంటాయి. కింది భాగంలో హోమ్ బటన్ తీసేశారు. వెనుక భాగంలో యథావిధిగా కెమెరా, దాంతోపాటు ఫ్లాష్, మైక్ ఏర్పాటుచేశారు. ఐఫోన్ 7 ప్లస్ కు భిన్నంగా ఐఫోన్ ఎక్స్ వెనుక భాగంలో రెండు కెమెరాలను ఒకదాని కింద ఒకటి ఏర్పాటు చేశారు.
- ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్


ఐఫోన్ X, ఐఫోన్ 8, 8 ప్లస్‌లలో మెరుపువేగంతో పనిచేసే అధునాతన 6కోర్ యాపిల్ ఏ11బయోనిక్ ప్రాసెసర్ ఏర్పాటుచేశారు. ఐఫోన్ ఎక్స్‌లో 3 జీబీ ర్యామ్ ఉండగా, 64, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో యూజర్లకు అందిస్తున్నారు. ఇక ఐఫోన్ 8, 8 ప్లస్‌లో వరుసగా 3జిబి, 4జీబీ ర్యామ్ ఉంది. 64, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్‌ను అందిస్తున్నారు.
iphone

- కెమెరాలు


ఐఫోన్ X వెనుక భాగంలో 12 మెగాపిక్సల్‌తో రెండు కెమెరాలు నిలువుగా ఏర్పాటుచేశారు. 4కే అల్ట్రాహెచ్‌డీ వీడియో రికార్డింగ్‌ను ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది. ఇక ముందు భాగంలో 7 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఐఫోన్ 8 వెనుక భాగంలో 12ఎంపీ సామర్థ్యంతో ఒకటి, 8 ప్లస్‌లో రెండు కెమెరాలను ఏర్పాటుచేశారు.

- ఐవోఎస్ 11


ఐఫోన్ X , ఐఫోన్ 8, 8 ప్లస్‌లలో యాపిల్ సరికొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్-11 అందిస్తున్నది. ఇది యాపిల్ ఈ ఏడాది జూన్ 5న జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో డెవలపర్‌ల కోసం విడుదలచేసింది. ఇప్పుడు అధికారిక ఐవోఎస్ 11ను ఐఫోన్ ఎక్స్, 8, 8 ప్లస్‌లలో అందిస్తున్నారు. దీంట్లో గతంలో వచ్చిన ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల కన్నా అనేక భిన్నమైన ఫీచర్లను ఇచ్చారు. డివైస్ సాఫ్ట్‌వేర్‌లో ఐకాన్లు, థీమ్స్, యాప్‌లను కొత్తగా డిజైన్‌చేసి అందిస్తున్నారు.

- వాటర్-డస్ట్ నిరోధం


ఐఫోన్ 8, 8 ప్లస్ ఫోన్లలో ఐపీ 68 వాటర్-డస్ట్ రెసిస్టెన్స్ ఇచ్చారు. 1.5 మీటర్ల లోతులో సుమారు 30 నిమిషాలపాటు ఫోన్లను ఉంచినా వాటిలోకి నీరు చేరదు. వర్షం పడుతున్నా నిరభ్యంతరంగా ఫోన్లను వాడుకోవచ్చు.

- ఫేస్ ఐడీ


గత ఫోన్లలోని ఫింగర్‌ప్రింట్ ఐడీ స్థానంలో ఐఫోన్ Xలో నూతనంగా ఫేస్ ఐడీ ఫీచర్ ఏర్పాటుచేశారు. దీనివల్ల ఫ్రంట్ కెమెరా యూజర్ ముఖాన్ని స్కాన్ చేసి డివైస్‌ను లాక్, అన్‌లాక్ చేస్తుంది. అలాగే యాపిల్ పే ద్వారా పేమెంట్లకు, యాప్ స్టోర్‌లో యాప్ కొనుగోళ్లకు, యాప్ లాక్, అన్‌లాక్‌కు కూడా ఫేస్ ఐడీ సపోర్ట్ చేస్తుంది. ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థను నైపుణ్యంగా, అత్యంత కచ్చితత్వంతో తయారుచేశారు. ఆశ్చర్యకరంగా రాత్రి చీకట్లోనూ ఫేస్ ఐడీ పనిచేస్తుంది. అత్యంత పటిష్టమైన భద్రతావ్యవస్థను ఈ ఫేస్‌ఐడీలో నెలకొల్పారు. ఇతర ఫోన్లలోనూ ఈ ఫీచర్ ఉన్నా ఇంత గొప్పగా ఎందులోనూ లేదు.

iphonex

- యానిమోజీలు


డిఫాల్ట్ ఎమోజీలకుతోడు ఈ ఫోన్లలో కొత్తగా 3డీ యానిమేషన్లను ఎమోజీలుగా వాడుకోవచ్చు. వినియోగదారుడి ముఖాన్ని ప్రత్యేకమైన యాప్‌తో స్కాన్ చేసుకున్న తరువాత ఆ యాప్ ముఖకవళికల ఆధారంగా వివిధ ఆకారాలతో 3డీ యానిమేషన్స్‌ను ఫోన్ ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుంది. వాటిని యూజర్లు ఎమోజీలుగా వాడుకోవచ్చు. వీటినే యానిమోజీలుగా పిలుస్తున్నారు. ఈ ఫీచర్‌కు విపరీతమైన ఆదరణ లభించే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

- బ్యాటరీ


ఐఫోన్ 8 లో 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ 8 ప్లస్‌లో 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటుచేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాపిల్ తన ఐఫోన్ X, 8, 8 ప్లస్ ఫోన్లలో కొత్తగా వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నది.

- కలర్స్, ధర


ఐఫోన్ X, ఐఫోన్ 8, 8 ప్లస్ ఫోన్లు స్పేస్‌గ్రే, సిల్వర్, గోల్డ్డ్ రంగుల్లో యూజర్లకు లభిస్తున్నాయి. ఐఫోన్ ఎక్స్ ప్రారంభ ధర 999 అమెరికన్ డాలర్లు (సుమారుగా రూ.67వేలు) ఉండగా, ఐఫోన్8 ధర 699, ఐఫోన్ 8 ప్లస్ ధర 799 డాలర్లుగా ఉంది. భారత్‌లో మాత్రం ఐఫోన్ ఎక్స్ ధర లక్ష రూపాయలు దాటే అవకాశముంది. ఐఫోన్ X అక్టోబర్ 27నుండి ప్రీబుకింగ్, నవంబర్ 3నుండి మార్కెట్లో ఉంటుంది. కాగా, ఐఫోన్ 8, 8 ప్లస్ ఫోన్లకు ఈనెల 15నుండి ప్రీబుకింగ్ ప్రారంభిస్తూ, మార్కెట్లోకి మాత్రం 19వ తేదీన విడుదల చేయనున్నారు.
వీటితోపాటుగా 4కే వీడియోలను స్ట్రీమ్ చేయగలిగే కొత్త యాపిల్ టీవీని, 4జి-ఎల్‌టిఈ వాచ్3ని కూడా విడుదలచేశారు.

2653

More News

VIRAL NEWS