వినాశన దినాన్ని వాయిదా వేయొచ్చా?

Sun,January 13, 2019 02:56 AM

Antarctica the surface of the frozen surface is slowly changing into liquid

అంటార్కిటికా నుంచి ఆశాకిరణం
భూతాపం కారణంగా తీర ప్రాంతాలలోని నగరాలకు, కొన్ని ద్వీపదేశాలకు పొంచి ఉన్న ముప్పును కొంతకాలం వాయిదా వేయవచ్చని అంటున్నారు అంటార్కిటికా ఖండంలో పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలు. కర్బన ఉద్గారాలను కొంతమేరకైనా తగ్గించగలిగితే అది సాధ్యమేనంటున్నారు.
వాతావరణ మార్పులు లేదా భూతాపం ప్రపంచాన్ని వినాశనం వైపు నడిపిస్తున్నాయన్నది నేడు జగమెరిగిన సత్యం. భూమి ఉత్తర దిశగా వెళ్లినా లేక దక్షిణం వైపు వెళ్లినా ఈ వాస్తవం మనకు కండ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో గడ్డకట్టుకుపోయి ఉన్న మంచు ఇటీవలి కాలంలో అసాధారణమైన రీతిలో కరిగిపోతున్నది. కొన్ని కోట్ల సంవత్సరాలుగా గడ్డకట్టుకుపోయి ఉన్న అక్కడి ఉపరితలం సైతం నెమ్మదిగా ద్రవరూపంలోకి మారుతున్నది. మానవుల కార్యకలాపాల కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగి.. వాతావరణంలో అసమతుల్యత ఏర్పడటం వల్లనే ఈ మంచుగడ్డలు కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివాసయోగ్యం కాని ఆ మంచుగడ్డలు కరిగితే మానవులకేంటి నష్టం అని అనుకోవద్దు.

ధ్రువాల వద్ద కొండలు.. గుట్టలుగా పేరుకుపోయిన ఆ మంచు కరిగిపోవడం వల్ల సముద్ర మట్టం పెరుగుతున్నది. అంటార్కిటికా ఖండంలోని భారీ హిమనీనదాలు సైతం నెమ్మదిగా కుప్పకూలడం ప్రారంభమైంది. ఈ మంచు అంతా ద్రవంగా మారి జలాల్లో కలిస్తే సముద్ర మట్టం పెరుగుతుంది. ఫలితంగా తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు, పలు ద్వీపదేశాలు నీటిలో మునిగిపోతాయి. మరికొన్ని దశాబ్దాలలో మాల్దీవులు, తువాలు వంటి ద్వీపాలు నీటి కింద కనుమరుగవుతాయి. దీంతో లక్షల సంఖ్యలో కుటుంబాలు నిరాశ్రయమై, దేశం లేనివిగా మారిపోతాయి.

Maldives3
ఈ వినాశనం సంభవించడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో.. ఆ ముప్పును ఎంతకాలంపాటు నివారించవచ్చో కనుగొనేందుకు శాస్త్రవేత్తలు రాత్రింబగళ్లు కృషి చేస్తున్నారు. భూమిపైనున్న ఎన్ని భాగాలు నీటిలో మునిగిపోనున్నాయి.. ఎన్ని నగరాలు లేదా దేశాలు మునుగుతాయి.. ఎంతమంది ప్రాణాలతో బయటపడగలరు అన్న అంశాలపై వారు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ పరిశోధనల సందర్భంగానే వారు గత నెలలో ఒక శుభవార్తను కనుగొన్నారు.

అదేమిటంటే.. మానవులు తమ ఉద్గారాల స్థాయిని కొంతవరకు తగ్గించుకోగలిగితే.. హిమనీనదాలు కరిగిపోకుండా నిలువరించే అవకాశాలు ఈ శతాబ్దంలో పది శాతం వరకు పెరుగుతాయి. లక్షల కోట్ల టన్నుల ఐస్ బద్దలవడానికి సిద్ధమవుతుండగా.. తీర ప్రాంతాలలోని మానవజాతికి ముప్పు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఇస్తున్న సలహా చిన్న ఆశాకిరణంగా కనిపిస్తున్నది.
Maldives2

2813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles