భారత్‌పై మరో ఉగ్రదాడి జరిగితే మీకు మూడిందే..!

Fri,March 22, 2019 03:40 AM

-పాకిస్థాన్‌కు అమెరికా హెచ్చరిక
-ఉగ్రమూకలపై స్థిరమైన చర్యలు చేపట్టాలని హితవు
లష్కరే తదితర ఉగ్రవాద గ్రూపులపై స్థిరమైన, తిరుగులేని చర్యలు చేపట్టాలని పాక్‌కు అమెరికా స్పష్టంచేసింది. భారత్‌పై మరోసారి ఉగ్రదాడి జరిగితే పాకిస్థాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని, ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తితే విపత్కర పరిస్థితులకు దారితీసే అవకాశమున్నదని హెచ్చరించింది.

వాషింగ్టన్, మార్చి 21: జైషే మహమ్మద్ (జేఈఎం), లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ) సహా ఇతర ఉగ్రవాద గ్రూపులపై స్థిరమైన, అర్థవంతమైన చర్యలు చేపట్టాలని పాకిస్థాన్‌కు అమెరికా స్పష్టం చేసింది. భారత్‌పై మరోసారి ఉగ్రదాడి జరిగితే పాకిస్థాన్‌కు తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని, ఇరు దేశాల మధ్య పరిస్థితులు విపత్కర పరిణామాలకు దారితీస్తాయని అమెరికా హెచ్చరించింది. జేఈఎం ఆత్మాహుతి దళ సభ్యుడు గత నెల 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఉగ్రదాడికి తెగబడి 40 మంది జవాన్లను హత్య చేయడంతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరిక చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా సీనియర్ అధికారి ఒకరు బుధవారం వైట్ హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. దక్షిణాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగకుండా నిరోధించాలంటే ఉగ్రవాద గ్రూపులపై, ముఖ్యంగా జైషే మహమ్మద్, లష్కరే తాయిబా సంస్థలపై పాక్ స్థిరమైన, అర్థవంతమైన చర్యలు చేపట్టేలా చూడాల్సిన అవసరమున్నదన్నారు.

ఈ గ్రూపులపై పాక్ స్థిరమైన చర్యలు చేపట్టకుండా మరో ఉగ్రదాడి జరిగితే పాకిస్థాన్ తీవ్రమైన చిక్కుల్లో పడుతుందని, మళ్లీ ఉద్రిక్తతలు పెరిగి విపత్కర పరిస్థితులకు దారితీసే అవకాశమున్నదని, ఇది రెండు దేశాలకు ప్రమాదకరమని పేర్కొన్నారు. బాలాకోట్‌లో భారత్ వైమానిక దాడులు నిర్వహించిన తర్వాత పాక్ చేపడుతున్న చర్యల గురించి ప్రశ్నించగా.. ఉగ్రవాద గ్రూపులపై స్థిరమైన చర్యలు చేపట్టేలా పాకిస్థాన్‌ను అమెరికా, అంతర్జాతీయ సమాజం ఒప్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఉగ్రవాదుల పట్ల పాక్ వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడే పూర్తిస్థాయి అంచనా వేయడం తొందరపాటు అవుతుందన్నారు. ఉగ్రవాద గ్రూపులపై ఇటీవల పాక్ కొన్ని చర్యలు చేపట్టిందని, కొన్ని గ్రూపుల ఆస్తులను స్తంభింపజేయడంతోపాటు కొన్ని అరెస్టులు కూడా చేసిందని, జేఈఎంకు చెందిన కొన్ని కేంద్రాలను పాక్ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నదని తెలిపారు.

Pakistan1
అయితే గతంలో పాక్ ఇదేవిధంగా కొంతమంది ఉగ్రవాదులను అరెస్టుచేసి కొద్ది నెలల తర్వాత వారిని విడుదల చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నందున ప్రస్తుతం మరికొంత కాలం వేచి చూడాల్సిన అవసరమున్నదని ఆ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదులపై స్థిరమైన చర్యల కోసం అమెరికా ఎదురుచూస్తున్నదని, ఈ విషయమై అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పాక్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నదని తెలిపారు. బాధ్యతాయుతమైన అంతర్జాతీయ భాగస్వామిగా పేరు తెచ్చుకుని ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను కలిగి ఉండాలో లేక ఉగ్రవాదులపై చర్యలు చేపట్టకుండా మరింత ఏకాకిగా మారాలో నిర్ణయించుకోవాల్సిన అవసరం పాకిస్థాన్‌కు ఉన్నదని ఆయన తేల్చిచెప్పారు.

పాక్‌కు చైనా కొమ్ము కాయొద్దు

జైషే మహమ్మద్ అధిపతి మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఐక్యరాజ్య సమితి చేస్తున్న ప్రయత్నాలను చైనా పదేపదే అడ్డుకోవడం పట్ల అమెరికా సీనియర్ అధికారి ఒకరు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పాకిస్థాన్‌కు చైనా కొమ్ము కాయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఉగ్రవాదులపై చర్యలు చేపట్టాల్సిందిగా పాక్‌కు విజ్ఞప్తి చేయాలని ఆయన అన్నారు. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఐక్యరాజ్య సమితిలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సాంకేతిక కారణాలను సాకుగా చూపి చైనా నాలుగోసారి అడ్డుకున్న విషయం తెలిసిందే. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో భద్రతా మండలి విఫలమైతే దక్షిణాసియాలో శాంతికి మరింత విఘాతం కలుగుతుందని ఆ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు.

2326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles