అమెరికాలో ప్రారంభమైన పోలింగ్

Wed,November 7, 2018 02:12 AM

Americans start voting in midterm election

-ట్రంప్ విధానాలపై తీర్పు ఇవ్వనున్న పౌరులు
-రానున్న రెండేండ్ల పాలన తీరును నిర్దేశించనున్న మధ్యంతర ఎన్నికలు

వాషింగ్టన్, నవంబర్ 6: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలపై రిఫరెండంగా భావిస్తున్న మధ్యంతర ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే రెండేండ్లలో ట్రంప్ పాలనా తీరును తీవ్రంగా ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదట తూర్పు రాష్ర్టాలైన మెయిన్, న్యూ హ్యాంప్‌షైర్, న్యూ జెర్సీ, న్యూయార్క్, వర్జీనియాల్లో పోలింగ్ మొదలైంది. ప్రతినిధుల సభలో ఎలాగైనా మెజార్టీ సాధించాలని కృతనిశ్చయంతో ఉన్న ట్రంప్ చివరి నిమిషం వరకు ప్రచారాన్ని కొనసాగించారు. భారత్‌లోని లోక్‌సభను పోలి ఉండే ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు, రాజ్యసభను పోలి ఉండే సెనేట్‌లోని 100 స్థానాల్లో 35 స్థానాలకు, 36 రాష్ర్టాల గవర్నర్ పదవులకు, పలు రాష్ర్టాల అసెంబ్లీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఉభయ సభల్లోనూ మెజార్టీ కలిగి ఉన్నది. అయితే ఎన్నికల తర్వాత ప్రతినిధుల సభలో మెజార్టీ సాధించడానికి డెమోక్రాట్ పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయని, సెనేట్‌ను మళ్లీ రిపబ్లికన్లే నిలబెట్టుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రతినిధుల సభలో 435 సీట్లకు గాను రిపబ్లికన్లు 235, డెమోక్రాట్లు 193 సీట్లు కలిగి ఉన్నారు. ప్రతి రెండేండ్లకోసారి ప్రతినిధుల సభకు ఎన్నికలు జరుగుతాయి. కాగా సెనేట్‌లో బొటాబొటి మెజార్టీ ఉన్న రిపబ్లికన్లు ఈ ఎన్నికల తర్వాత మరింత పట్టుసాధించే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

వెల్లువలా తరలిరండి!: మధ్యంతర ఎన్నికల్లో ఓటు వేయడానికి వెల్లువలా తరలిరావాలని అధ్యక్షుడు ట్రంప్ దేశవ్యాప్తంగా ఉన్న తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ప్రతినిధుల సభలో మెజార్టీ స్థానాలు వచ్చేలా రిపబ్లికన్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS