థాయ్‌లో బాలల కథ సుఖాంతం

Wed,July 11, 2018 07:40 AM

All boys from Thailand soccer team safely rescued

-ఓడిన మృత్యువు గెలిచిన ఫుట్‌బాల్ టీం
-గుహలో నుంచి బాలలందరి తరలింపు
-చివరిగా కోచ్ సహా నలుగురు పిల్లలను రక్షించిన అధికారులు
-థాయ్‌లాండ్‌లో బాలల కథ సుఖాంతం
-ముగిసిన రెస్క్యూ ఆపరేషన్.. ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకం
-ప్రాణాలకు తెగించి సాయపడిన బ్రిటన్ డైవర్లపై ప్రశంసలు
ప్రపంచమంతా రెండువారాలుగా ఊపిరిబిగబట్టి ఉత్కంఠతో ఎదురుచూసిన థాయ్‌లాండ్ బాలల కథ సుఖాంతమైంది. కొండ గుహలో మిగిలి ఉన్న నలుగురు పిల్లలు, వారి కోచ్‌ను అధికారులు మంగళవారం సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. సోమవారం రాత్రి వర్షం కురిసి, గుహలోపలికి భారీగా వరద నీరు చేరినప్పటికీ సహాయ చర్యలకు ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. ఎంతో ప్రమాదకరమైన ఇరుకు గుహ నుంచి చివరిగా ముగ్గురు థాయ్ నౌకాదళ సిబ్బంది, వారితోపాటు ఆస్ట్రేలియా డాక్టర్ కూడా బయటకు రాగానే థాయ్‌లాండ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. బాలలందరూ ఆరోగ్యంగా ఉన్నారని, వారం రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇండ్లకు పంపిస్తామని అధికారులు చెప్పారు.

మాయిసాయి, జూలై 10: థాయ్‌లాండ్ బాలలు మృత్యువును గెలిచారు. గత 18 రోజులుగా కొండగుహలో చిమ్మచీకటిలో దారితెన్నూ తెలియక దిక్కుతోచని స్థితిలో ఆశలు చాలించుకొని బిక్కుబిక్కుమంటూ గడిపిన బాలలు ఎట్టకేలకు మళ్లీ వెలుగును చూశారు. తమ ఫుట్‌బాల్ కోచ్‌తోపాటు గుహలో చిక్కుకుపోయిన 12 మంది బాలలను అధికారులు వెలుపలికి తీసుకొచ్చారు. నిపుణులైన విదేశీ డైవర్లు, థాయ్‌నౌకా దళ సిబ్బంది మంగళవారం గుహ లోపలికి వెళ్లి అక్కడ మిగిలి ఉన్న నలుగురు బాలలు, 25 ఏండ్ల వయస్సున్న వారి కోచ్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బాలలందరూ సురక్షితంగా బయటపడ్డారన్న వార్త తెలియగానే సామాజిక మాధ్యమాలు హర్షాతిరేకాలతో హోరెత్తాయి. గుహ నుంచి బాలలను వెలికితీసే రెస్క్యూ ఆపరేషన్‌ను ఆదివారం ప్రారంభించిన అధికారులు మొదటి రోజు నలుగురిని, మరుసటి రోజు మరో నలుగురిని తీసుకొచ్చారు. గత రెండురోజుల అనుభవం మూడోరోజు పనిని మరింత సునాయాసం చేసిందని ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహిస్తున్న అధికారి నరోంగ్‌సక్ ఒసొట్టనకార్న్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా గుహలోకి వరద నీరు భారీగా ప్రవహించిందని, అయినప్పటికీ తమ ఆపరేషన్‌ను రెండు గంటలు ముందుగానే ముగించామని చెప్పారు. గుహ నుంచి నలుగురు బాలలను స్ట్రెచర్లపై అంబులెన్స్‌ల వద్దకు తరలించడం చూశామని థాయ్ మీడియా తెలిపింది. అందరికన్నా చివరిగా ముగ్గురు థాయ్ నౌకా దళ సిబ్బంది, బాలలకు గత మూడు రోజులుగా వైద్యం అందించిన ఆస్ట్రేలియా డాక్టర్ రిచర్డ్ బయటకు వచ్చారు.

వైల్డ్‌బోర్స్ అనే ఫుట్‌బాల్ జట్టుకు చెందిన 12 మంది బాలలు, వారి కోచ్ గత నెల 23న థాయ్‌లాండ్, మయన్మార్ సరిహద్దులోని తామ్ లువాంగ్ గుహలోపలికి వెళ్లి చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. 11 నుంచి 16 ఏండ్ల మధ్యనున్న బాలలు ఫుట్‌బాల్ ప్రాక్టీసు అనంతరం గుహను అన్వేషించేందుకు వెళ్లారు. ఇంతలో భారీ వర్షం రావడంతో గుహలోపలికి వరదనీరు వచ్చి చేరింది. దీంతో వారు అక్కడే ఉండిపోయారు. తొమ్మిది రోజుల అనంతరం వారిని వెతుకుతూ వెళ్లిన బ్రిటన్ డైవర్లకు నాలుగు కిలోమీటర్ల లోపల ఓ మట్టి దిబ్బపై వారు కనిపించారు.

thailand3

రష్యా వెళ్లే చాన్స్ మిస్ అయింది!

బయటకు వచ్చిన బాలలందరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఉదయం అల్పాహారంగా తమకు చాకొలేట్ బ్రెడ్ కావాలని అడిగారని అధికారులు చెప్పారు. మొదటిరోజు బయటకు వచ్చిన నలుగురు బాలల్లో ఇద్దరికి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ అయినట్టు తెలుస్తున్నదని అన్నారు. ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున తల్లిదండ్రులకు అద్దాల కిటికీ ద్వారా పిల్లలను చూసే అవకాశం కల్పించారు. బాలలు కోరుతున్న ఆహారాన్ని వారికి అందించలేక పోతున్నామని, మరో రెండు రోజులు తేలికపాటి పదార్థాలనే వారు తినాల్సి ఉంటుందని అన్నారు. ఇంకో వారం రోజులపాటు దవాఖానలోనే ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత వారిని ఇండ్లకు పంపుతామని చెప్పారు. దీంతో వారు ఆదివారం రష్యా వెళ్లి ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌ను చూసే అవకాశం కోల్పోయారు. గుహలో చిక్కుకున్న బాలలందరినీ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రావాలని ఫిఫా సంస్థ ఇంతకుముందు ఆహ్వానించింది. బాలలందరూ సురక్షితంగా బయటపడ్డారన్న వార్త వెలువడగానే థాయ్‌లాండ్‌వాసులు సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు సామాజిక మాధ్యమాలలో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

పలువురు ప్రముఖుల హర్షం

బాలలందరూ సురక్షితంగా గుహ నుంచి బయటకు వచ్చారని తెలియగానే ప్రపంచ నేతలు హర్షం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధాని థెరెసా మే డైవర్ల సేవలను కొనియాడుతూ వారిని అభినందించారు. బాలలను రక్షించిన డైవర్లలో అత్యధికులు బ్రిటన్‌కు చెందిన వారేనన్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయనెల్ మెస్సీ, టెక్ గురు ఎలాన్ మస్క్ హర్షం వ్యక్తంచేశారు.

ఐక్యమత్యంతో సాధించలేనిది ఏమీ లేదు: మంత్రి కేటీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఐక్యమత్యంతో ప్రపంచంలో సాధించలేనిది ఏమీ లేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. థాయ్‌లాండ్‌కు చెందిన బాలలు సురక్షితంగా గుహ నుంచి బయటపడటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన సంతోషాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. గుహ నుంచి బాలలు బయట పడటం సంతోషంగా ఉన్నది. మనమంతా కలిసి నడిస్తే, ఐక్యంగా ముందుకు సాగితే గొప్ప లక్ష్యాలైనా సాధించవచ్చన్న విషయం మరోమారు రుజువైంది అని మంత్రి పేర్కొన్నారు.

thailand2

బుల్లి జలాంతర్గామిని తెచ్చిన మస్క్

అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ థాయ్ బాలలను రక్షించేందుకు ఒక బుల్లి జలాంతర్గామిని తీసుకొచ్చారు. రాకెట్ విడిభాగాలతో ఆగమేఘాల మీద ఆయన ఈ బుల్లి జలాంతర్గామిని తయారు చేయించారు. స్విమ్మింగ్‌పూల్‌లో దాని పనితీరును పరీక్షించిన తరువాత బాలలను గుహనుంచి తరలించడానికి అది సురక్షితమైన సాధనమని నిర్ధారించారు. థాయ్ గుహ వద్ద సహాయ చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందికి ఆయన స్వయంగా దానిని అందించారు. తమ ఆపరేషన్‌కు అది పనికిరాదని థాయ్ అధికారి నరోంగ్‌సక్ చెప్పారు.

ఆ బాలలు అసాధ్యులు

గుహలో చిక్కుకున్న బాలలందరూ అసాధ్యులని వారిని కాపాడేందుకు వెళ్లిన ఓ విదేశీ డైవర్ వ్యాఖ్యానించారు. ఎంతో ప్రమాదకరమైన ఆ మార్గం గుండా వారు ప్రాణాలతో బయటపడటం అసాధారణమని పేర్కొన్నారు. పదకొండేండ్ల వయస్సులో సాధారణ బాలలెవరూ ఇటువంటి సాహసం చేయడానికి ధైర్యం చేయరని డైవర్ ఇవాన్ కరాడ్‌జిక్ అన్నారు. చిమ్మచీకటి.. మురికి నీళ్లు..టార్చిలైట్ వేసినా రెండుమూడడుగుల కంటే ఎక్కువ దూరం కనిపించదు. ఇటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో వారు మాతోపాటు నీళ్లలోపలికి దూకి ఈదుకుంటూ బయటకు వచ్చారు. వారెవరికీ ఇంతకుముందు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని నీటి అడుగున ఈదిన అనుభవం లేదు. కొంతమందికి అసలు ఈతనే రాదు అని ఇవాన్ వివరించారు.

1901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles