అబుధాబీ కోర్టుల్లో మూడో అధికార భాష హిందీ

Mon,February 11, 2019 01:00 AM

Abu Dhabi includes Hindi as third official court language

దుబాయ్, ఫిబ్రవరి 10: తమ దేశంలో నివసిస్తున్న భారతీయుల సౌకర్యార్థం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానాల్లో హిందీని మూడో అధికారిక భాషగా గుర్తిస్తున్నట్లు యూఏఈ రాజధాని అబుధాబికి చెందిన న్యాయ విభాగం(ఏడీజేడీ) శనివారం వెల్లడించింది. కార్మికులకు సంబంధించిన కేసుల్లో అరబిక్, ఆంగ్ల భాషలతో పాటు హిందీని కూడా ఇకపై అధికారిక భాషగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. న్యాయ ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు, వారి హక్కులను, విధులను తెలుసుకునేందుకు భాష అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు వీలుగా ఏడీజేడీ వెబ్‌సైట్‌లో ఏకీకృత ఫారాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. అధికారిక గణాంకాల ప్రకారం యూఏఈ జనాభా 90 లక్షలు కాగా, అందులో మూడింట రెండు వంతులు వలసదారులే.

మొత్తం జనాభాలో 26 లక్షల మంది భారత్‌కు చెందిన వారే కావడం విశేషం. న్యాయ ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించడానికి రూపొందించిన టుమారో 2021 ప్రణాళికలో భాగంగా క్లెయిమ్ షీట్స్, ఫిర్యాదులు, విజ్ఞప్తులు, ఇతర న్యాయసేవలను విభిన్న భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు ఏడీజేడీ అధికారి యూసుఫ్ సయీద్ అల్ అబ్రి వెల్లడించారు. ఏడీఏజీ చైర్మన్, ఉప ప్రధాని, షేక్ మన్సూర్‌బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సివిల్, కమర్షియల్ కేసుల్లో ప్రతివాది విదేశీయుడైతే సంబంధిత కేసు పత్రాలను ఆంగ్లంలోకి అనువదించి ఇచ్చేలా 2018 నవంబర్‌లో ద్విభాషా వ్యవస్థను ప్రారంభించారు. దీనికి కొనసాగింపుగా తాజాగా హిందీని కూడా మూడో అధికారిక భాషగా చేర్చారు.

1074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles