62 మందిని బలిగొన్న కార్చిచ్చు!


Mon,June 19, 2017 01:56 AM

-పోర్చుగల్‌లో తీవ్ర విషాదం
-కార్లలోనే ప్రజలు సజీవ దహనం
-మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం

పెనెల, జూన్ 18: సెంట్రల్ పోర్చుగల్ అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు 62 మందిని బలితీసుకుంది. 59 మంది ప్రజలు గాయాలపాలయ్యారు. చనిపోయినవారిలో ఎక్కువ మంది మంటల నుంచి తప్పించుకునే క్రమంలో కార్లలోనే సజీవ దహనం కావడం తీవ్ర విషాదం నింపింది. శనివారం సాయంత్రం పెడ్రొగావ్ గ్రాండె మున్సిపాల్టీ సమీపంలో చెలరేగిన మంటలు భారీగా విస్తరించాయి. ఈ మంటలను ఆర్పేందుకు 160 వాహనాలను మోహరించారు. వివిధ ప్రాంతాల్లో మంటలను అదుపు చేసేందుకు 1700 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అడవుల్లో మంటలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఇదే అతిపెద్ద విషాదకర సంఘటన. పొడి తుఫాను వాతావరణం కారణంగానే మంటలు చెలరేగాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రమాదంలో ఉన్న వారిని రక్షించడమే మా ప్రథమ ప్రాధాన్యం అని పోర్చుగల్ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టా పేర్కొన్నారు.
portugal
మరోవైపు పోర్చుగల్‌లో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యూరోపియన్ యూనియన్ అగ్నిమాపక విమానాలను సమకూర్చింది. యూరోపియన్ సివిల్ ప్రొటెక్షన్ విధానంలో భాగంగా ఫ్రాన్స్ మూడు విమానాలను, స్పెయిన్ రెండు విమానాలను పంపుతున్నట్లు ఈయూ సంక్షోభ నిర్వహణ కమిషనర్ క్రిస్టోస్ స్టిలియానిడెస్ పేర్కొన్నారు. పోర్చుగల్‌లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో వడగాడ్పులు విజృంభించాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో దేశవ్యాప్తంగా 60 అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. నాలుగు ప్రాంతాల్లో ఇప్పటికీ మంటలను అదుపు చేయలేని పరిస్థితి ఉన్నదని అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి జార్జ్ గోమ్స్ పేర్కొన్నారు. అగ్నిప్రమాద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పెద్దఎత్తున ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. కాగా మృతులకు యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడే జంకర్ సంతాపం ప్రకటించారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న అగ్నిమాపక సిబ్బందిని ఆయన అభినందించారు. పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెల్లో లియారా ప్రాంతంలో బాధితులను పరామర్శించారు.
portugal2

ప్రధాని మోదీ సంతాపం


పోర్చుగల్ అడవుల్లో మంటలు చెలరేగి మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు. ఈ నెల 24వ తేదీన ప్రధాని మోదీ పోర్చుగల్‌లో పర్యటించాల్సి ఉన్నది.

235
Tags

More News

VIRAL NEWS