అమెరికాలో రికార్డు షట్‌డౌన్

Sun,January 13, 2019 02:02 AM

8 Things to Know About the US Government Shutdown

-22 రోజులుగా తొలగని ఆర్థిక ప్రతిష్ఠంభన
-ఇంతకాలంపాటు ప్రభుత్వ సేవలు మూతపడటం ఆ దేశ చరిత్రలో మొదటిసారి

వాషింగ్టన్, జనవరి 12: మెక్సికో సరిహద్దులో గోడ కట్టే విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రతిపక్ష డెమోక్రాట్ల మధ్య మొదలైన వివాదంతో దేశంలో ఆర్థిక ప్రతిష్ఠంభన నెలకొని 22 రోజులు దాటింది. ఇరు పక్షాల పట్టుదల కారణంగా దేశంలోని సుమారు ఎనిమిది లక్షల మంది ప్రభుత్వోద్యోగులకు వేతనాలు అందకుండా పోతున్నాయి. ట్రంప్ డిమాండ్ చేస్తున్నట్టుగా సరిహద్దు గోడకు 570 కోట్ల డాలర్లను మంజూరు చేసేందుకు డెమోక్రాట్లు నిరాకరిస్తుండటంతో ప్రభుత్వ సేవలు కుంటుపడ్డాయి. డెమోక్రాట్ల చర్యలకు ప్రతీకారంగా ఇతర విభాగాల బడ్జెట్‌పై సంతకం చేసేందుకు ట్రంప్ నిరాకరించడంతో ఒకరకంగా దేశరాజధాని నగరం వాషింగ్టన్ స్తంభించిపోయింది. దీంతో ఎఫ్‌బీఐ ఏజెంట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, మ్యూజియం సిబ్బంది శుక్రవారం వేతనం లేని విధులు నిర్వహించాల్సి వచ్చింది. అమెరికాలో ప్రభుత్వ సేవలు ఇంత సుదీర్ఘకాలం మూతపడటం ఇదే మొదటిసారి. ఇంతకుముందు 1995-96లో బిల్ క్లింటన్ హయాంలో 21 రోజులు ఇలాగే ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. ఇంతకుముందు లాగానే ట్రంప్ మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధిస్తానని డెమోక్రాట్లను బెదిరించారు. చట్ట సభ అనుమతి లేకుండానే నిధులు పొందేందుకు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తానని, తనకు ఆ హక్కు ఉందని శుక్రవారం ఆయన హెచ్చరించారు.

రష్యాతో ట్రంప్ సంబంధాలపై ఎఫ్‌బీఐ దర్యాప్తు

అమెరికా దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ జేమ్స్ కామీని 2017లో అధ్యక్షుడు ట్రంప్ పదవి నుంచి తొలిగించిన అనంతరమే దేశాధినేతకు రష్యాతో సంబంధాలపై ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రారంభించిందని ఓ వార్తా కథనం పేర్కొంది. కానీ తనకు వ్యతిరేకంగా కుట్ర చేసి దర్యాప్తు ప్రారంభించినందునే ఎఫ్‌బీఐ అధికారులను విధుల నుంచి తొలిగించానని ట్రంప్ తెలిపారు. 2016లో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రజలను ప్రభావితం చేసేందుకు ట్రంప్ రష్యాతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తును పర్యవేక్షిస్తున్న జేమ్స్ కామీకి ట్రంప్ ఆకస్మికంగా ఉద్వాసన పలికారు. అయితే ఎఫ్‌బీఐ దర్యాప్తులో ట్రంప్‌కు వ్యతిరేకంగా అనేక సంచలన విషయాలు వెల్లడైనట్టు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే రష్యాతో కలిసి పనిచేశారా లేక తనకు తెలియకుండానే ఆ దేశ ప్రభావానికి గురయ్యారా అన్న అంశాన్ని ఎఫ్‌బీఐ తేల్చేందుకు సిద్ధమైందని తెలిపింది. ట్రంప్ చర్యలు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయా అన్న అంశాన్ని దర్యాప్తు అధికారులు ఇంకా తేల్చాల్సి ఉందని ఆ పత్రిక పేర్కొంది. మరోవైపు భారత్‌తో అమెరికా సంబంధాలకు ట్రంప్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని ఆ దేశానికి కొత్తగా నియమితులైన భారత రాయబారి హర్షవర్ధన్ శృంగాల పేర్కొన్నారు. తన అర్హత పత్రాలను శృంగాల అమెరికా అధ్యక్ష భవనంలో శుక్రవారం సమర్పించారు. నవతేజ్ సర్ణా స్థానంలో శృంగాల నియమితులయ్యారు.

1399
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles