మేం నిర్దోషులం

Wed,February 6, 2019 01:22 AM

-పేటు స్టే కుంభకోణంలో కోర్టుకు తెలిపిన 8 మంది భారతీయులు..
-బెయిల్‌పై ఒకరు విడుదల
వాషింగ్టన్, ఫిబ్రవరి 5: పే టు స్టే కుంభకోణంలో అరెస్టయిన ఎనిమిది మంది భారతీయులు తాము నిర్దోషులమని అమెరికా కోర్టుకు తెలిపారు. అమెరికాలో అక్రమంగా ఉండేందుకు వందల మంది విద్యార్థులను నకిలీ విశ్వవిద్యాలయంలో చేర్పించారనే ఆరోపణలపై వీరిని ఇటీవల అమెరికా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మిషిగాన్‌లోని ఫెడరల్ కోర్టు ముందు వీరిని హాజరుపరచగా, తాము నిర్దోషులమంటూ వాదించారు. వీరిలో ఫణిదీప్ కర్నాటీకి 10 వేల డాలర్ల పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన ఏడుగురు-భరత్ కాకిరెడ్డి, సురేశ్ కందాల, ప్రేమ్ రామ్‌పీసా, సంతోష్ సామా, అవినాశ్ తక్కలపల్లి, అశ్వంత్ నూనె, నవీన్ ప్రత్తిపాటి తమ డిటెన్షన్ కొనసాగింపునకు సమ్మతించారు. అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పన్నిన వలలో పడి ఫార్మింగ్‌టన్ అనే నకిలీ విశ్వవిద్యాలయంలో చేరిన 130 మంది విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరందరూ కూడా నిర్దోషులమని పేర్కొన్నారని ఫణిదీప్ కర్నాటీ న్యాయవాది జాన్ డబ్ల్యూ బ్రస్టర్ తెలిపారు. ట్రాప్ చేసి విద్యార్థులను పట్టుకోవడంపై అమెరికా ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఇంజనీర్ అయిన ఫణిదీప్ కర్నాటీ హెచ్1బీ వీసాపై పదేండ్ల కిందట అమెరికాకు వచ్చారు.


కర్నాటీతో పాటు మరో ఏడుగురిపై మోపిన అభియోగాలు రుజువైతే ఐదేండ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చట్టవిరుద్ధంగా అమెరికాలోనే ఉండేందుకు ఆశ్రయం కల్పించేలా వీరు వందలాది మంది విద్యార్థులను ఫార్మింగ్‌టన్ నకిలీ విశ్వవిద్యాలయంలో చేర్పించారని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు ఆరోపించారు. ఈ ప్రక్రియలో ఇమ్మిగ్రేషన్ అధికారులను మోసగించేలా విద్యార్థులతో తప్పుడు ధ్రువపత్రాలు కూడా సమర్పించారని పేర్కొన్నారు. ఈ నకిలీ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు లేరని, తరగతులు జరుగవని ఈ కుట్రలో భాగస్వాములైన అందరికీ ముందే తెలుసునని వివరించారు. నిందితులు ఉద్దేశపూర్వకంగా, లాభాపేక్షతోనే విదేశీ విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని ఆశ్రయం కల్పించారని ఆరోపించారు.

671
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles