మళ్లీ వేలానికి పింక్‌స్టార్ వజ్రం

Tue,March 21, 2017 02:44 AM

diamond హాంగ్‌కాంగ్: మూడేండ్ల క్రితం వేలానికి పెట్టిన ప్రఖ్యాత వజ్రం పింక్‌స్టార్ మరోసారి అమ్మకానికొచ్చింది. ఈ నెలలో హాంగ్‌కాంగ్ నగరంలో దీనిని సోత్‌బి సంస్థ వేలం వేయనుంది. కోడిగుడ్డు ఆకారంలో ఉండే 59.60 క్యారెట్ల నికరమైన ఈ గులాబీరంగు వజ్రం 60 మిలియన్ డాలర్లకు (రూ.399 కోట్లు)పైనే పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇంత భారీ మొత్తానికి అమ్ముడయిన గులాబీరంగు వజ్రాల్లో రికార్డు సృష్టిస్తుందని సోత్‌బి జువెలరీ డివిజన్ చైర్మన్ డేవిడ్ బెన్నెట్ చెప్పారు. దీనిని జెమాలజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా గ్రేడింగ్ చేసింది. ప్రస్తుతం గులాబీరంగు వజ్రాల్లో రికార్డు ధరకు అమ్ముడు పోయిన వజ్రం 24.78 క్యారెట్ల గ్రాఫ్ పింక్. దీనిని 2010లో వేలానికి ఉంచగా, 46.2 మిలియన్ డాలర్లకు (రూ.302 కోట్లు) అమ్ముడు పోయింది. దీని రికార్డును పింక్‌స్టార్ 2013లో బద్దలు కొడుతూ 83.2 మిలియన్‌డాలర్లకు (రూ.544 కోట్లు) అమ్ముడు పోయింది. అయితే దీనిని వేలంలో కొనుగోలు చేసిన సంస్థ సదరు మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో వేలం రద్దు చేశారు. దీంతో తాజాగా దీనిని వేలానికి ఉంచారు. హాంగ్‌కాంగ్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మార్చి 29 నుంచి ఏప్రిల్ 3 వరకు దీనిని ప్రదర్శనకు ఉంచనున్నారు.

1037

More News

మరిన్ని వార్తలు...