గాజా సరిహద్దుల్లో రక్తపుటేరులు

Tue,May 15, 2018 07:00 AM

52 Palestinians Killed by Israeli Gunfire at Border

-జెరూసలేంలో అమెరికా ఎంబసీ ప్రారంభానికి పాలస్తీనియన్ల నిరసన
-బుల్లెట్ల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ సైన్యం
-52 మంది మృతి, 2400 మందికి గాయాలు

Palasthina
జెరూసలేం, మే 14:పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన కాల్పులతో గాజా స్ట్రిప్ నెత్తురోడింది. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్ నుంచి జెరూసలేంకు అమెరికా రాయబార కార్యాలయాన్ని మార్చడాన్ని నిరసిస్తూ పాలస్తీనియన్లు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో 52మంది మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళ, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. 2400 మందికి పైగా గాయపడ్డారు. 200 మంది పిల్లలు, 11 మంది జర్నలిస్టులు కూడా క్షతగాత్రులయ్యారు. 2014లో గాజా సరిహద్దుల్లో హింస తర్వాత అధిక సంఖ్యలో పాలస్తీనియన్లు మృతి చెందడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్ 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జెరూసలేంలో అమెరికా రాయబార కార్యాలయం ప్రారంభించడాన్ని నిరసిస్తూ గాజా స్ట్రిప్ వద్ద సరిహద్దుల్లో వేల మంది పాలస్తీనియన్లు గుమిగూడారు. సరిహద్దు కంచెను తొలిగించేందుకు ప్రయత్నించారు. కొద్దిమంది రాళ్లు రువ్వారు. దీంతో ఇజ్రాయెల్ భద్రతాదళాలు వారిపై కాల్పులు జరిపాయి. గతేడాది డిసెంబర్ ఆరో తేదీన జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్తించడం.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల పెరుగుదలకు దారి తీసింది. సుమారు 10వేల మంది ఆందోళనకారులు గాజా సరిహద్దుల్లో తిష్ట వేశారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

మరోవైపు అమెరికాకు వ్యతిరేకంగా జిహాదీ చర్యలకు పాల్పడాలని అల్‌ఖాయిదా నాయకుడు ఆయ్‌మన్ అల్ జవహరి పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ సేనలు పాలస్తీనియన్ల ఊచకోతకు పాల్పడుతున్నాయని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఆరోపించారు. అమెరికా చర్య అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని పాలస్తీనా ప్రధాని రామీహమ్దల్లా, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి సాయెబ్ ఎరెకట్ ఆరోపించారు. సోమవారం సాయంత్రం జరిగిన అమెరికా రాయబార కార్యాలయ ప్రారంభోత్సవానికి సుమారు 800మంది అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కార్యాలయ పరిసరాల్లో సుమారు 1000 మంది భద్రతాసిబ్బందిని నియమించారు. ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని పాలస్తీనియన్లను హెచ్చరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. 2025లో గాజా? నిర్ణయం మీదే అన్న శీర్షికతో ఆ కరపత్రాలు ముద్రించారు. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఆవింగ్డర్ లైబర్మన్ ఒక సందేశంలో తమ పౌరులను కాపాడుకుంటామని తెలిపారు. హమాస్ నాయకుడు యెహ్యా అల్‌ను గుడ్డిగా నమ్మి, తమ పిల్లల భవిష్యత్‌ను పణంగా పెట్టొద్దని పాలస్తీనియన్లకు లైబర్మన్ సూచించారు. జెరూసలేంలో అమెరికా రాయబార కార్యాలయం ప్రారంభించడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతాయని రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా నిర్ణయాన్ని మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్ కూడా వ్యతిరేకించాయి.

israel

అమెరికా ప్రతినిధులకు నెతన్యాహు స్వాగతం

జెరూసలేంలో రాయబార కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ, సలహాదారు ఇవాంక ట్రంప్, అల్లుడు జారెష్ కుష్నర్, విదేశాంగశాఖ సహాయ మంత్రి జేమ్స్ సల్లివాన్, ఆర్థిక మంత్రి స్టీవ్ మ్యుచిన్‌లతో కూడిన ప్రతినిధి బృందానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘన స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జెరూసలేంలో తమ ఎంబసీని ప్రారంభించడం ఇజ్రాయెలీలకు గొప్ప రోజని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

2405
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles