న్యూయార్క్‌లో కాల్పులు

Sun,October 13, 2019 03:21 AM

నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు
న్యూయార్క్, అక్టోబర్ 12: కాల్పుల మోతతో అమెరికా మరోమారు దద్దరిల్లింది. న్యూయార్క్ నగరంలోని బ్రూక్లి న్ ప్రాంతంలో ఓ క్లబ్బులో శనివారం ఉదయం జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతులంతా పురుషులు కాగా, గాయపడిన వాళ్లలో ఒక మహిళ కూడా ఉన్నారు. క్షతగాత్రులను అధికారులు సమీప దవాఖానకు తరలించి చికిత్స అందించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. బాధితుల వయసు 32 నుంచి 49 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. బ్రూక్లిన్‌లోని వీక్స్‌విల్లే పరిసరాల్లోని 74 యుటికా అవెన్యూలో ఈ ఘటన జరిగింది. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనకు సంబంధించి ఇప్పటివరకైతే ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదని న్యూయార్క్ పోలీసులు తెలిపారు.


కాల్పులు చోటుచేసుకున్న క్లబ్బు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నదని చెప్పారు. క్లబ్బులో జూదం తదితర ఆటలు ఆడుతారని.. ఆట మధ్యలో గొడవ జరుగడం లేదా దోపిడీ దొంగల వల్ల ఈ కాల్పులు జరుగొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. క్లబ్బులోకి ప్రవేశించిన దుండగుడు(లు) కనీసం 15 రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనాస్థలిలో రెండు తుపాకులను కనుగొన్నామని, మరికొన్ని దొరికే అవకాశం ఉన్నదని ఓ పోలీసు అధికారి తెలిపారు.

262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles