మధ్యధరాలో కడతేరుతున్న బతుకులు

Tue,January 22, 2019 02:47 AM

170 migrants feared dead after two shipwrecks in Mediterranean

-గల్ఫ్, ఆఫ్రికా దేశాల నుంచి ఆగని వలసలు.. తలుపులు మూసేసిన ఐరోపా
-ఈ నెలలో ఇప్పటికే 250 మందికిపైగా జలసమాధి
-తాజా ఘటనల్లో 170 మంది మృతి

బతుకుదెరువు కోసమో లేక ప్రాణాలను కాపాడుకోవడం కోసమో సంపన్న దేశాలకు బయలుదేరుతున్న వలస బతుకులు సముద్రంలోనే కడతేరుతున్నాయి. ఏడాది కాలంగా ఐరోపా దేశాల్లో వచ్చిన కొన్ని కొత్త ప్రభుత్వాలు సరిహద్దులను మూసేయడంతో వలసలను నమ్ముకున్న వారు దిక్కుతోచని స్థితిలో సముద్రంలోనే తనువులు చాలిస్తున్నారు. తమ ముందు వెళ్లిన వారు గమ్యం చేరారో లేదో తెలుసుకోకుండానే మరికొందరు ఆశాజీవులు మెరుగైన జీవనంపై ఆశతో బయలుదేరుతున్నారు. ఈ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న దళారులు వారి నుంచి అందిన కాడికి దండుకొని తుప్పు పట్టిన పడవల్లో సామర్థ్యానికి మించి జనాన్ని ఎక్కించుకొని.. ప్రతికూల వాతావరణంలో సముద్రాన్ని దాటేందుకు ప్రయత్నిస్తూ.. మధ్యలోనే వారిని నీట ముంచుతున్నారు.

ఈ ఏడాది మొదటి 20 రోజుల్లోనే జరిగిన మూడు పడవ ప్రమాదాల్లో 250 మందికి పైగా వలసజీవులు మధ్యధరా సముద్రంలో జలసమాధి అయ్యారు. తాజాగా (ఆదివారం) జరిగిన రెండు పడవ ప్రమాదాల్లో 170 మంది మరణించారు. యుద్ధం, ఆకలి, అస్థిరమైన పరిస్థితులు, అభద్రత కారణంగా సూడాన్, సిరియా, యెమన్, మొరాకో, లిబియా, టర్కీ తదితర 20కి పైగా దేశాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు ఐరోపా దేశాల దిశగా పయనమవుతున్నారు. 2015 వరకు ఇలా వలస వచ్చిన వారిని అక్కున చేర్చుకున్న కొన్ని దేశాలు.. ఆ తరువాత వారిని అడ్డుకొనే చర్యలు ప్రారంభించాయి. అంతర్జాతీయ ఒప్పందాలకు తిలోదకాలిస్తూ మానవ సంక్షోభాలకు తెరతీస్తున్నాయి.

ప్రాణాంతకమైన మధ్యధరా సముద్రం నుంచి ఐరోపా దేశాలకు వలస వచ్చే వారి సంఖ్య గత ఏడాది తగ్గినప్పటికీ సముద్ర జలాల్లో మరణిస్తున్న వలసదారుల సంఖ్య మాత్రం పెరిగింది. 2015లో ఐరోపా దేశాలకు వచ్చేందుకు ప్రయత్నించిన ప్రతి 270 మందిలో ఒకరు మరణించారు. ఆ ఏడాది మొత్తంగా 10 లక్షల మందికి పైగా సముద్రాన్ని దాటగా, 3,770 మంది మధ్యధరాలోనే జల సమాధి అయ్యారు. ఇక 2018లో 1,12,000 మంది సముద్ర మార్గంలో యూరోప్‌ను చేరుకోగా, 2,241 మంది మరణించారు లేదా గల్లంతైనట్టు ఐక్యరాజ్యసమితి తెలిపింది. గత ఏడాది జనవరి నుంచి జూన్ నెల మధ్య వలస వచ్చేందుకు ప్రయత్నించిన ప్రతి 18 మందిలో ఒకరు మరణించారని పేర్కొంది.

ఐరోపాలోని కొన్ని దేశాల్లో గత రెండు మూడేండ్లలో జరిగిన ఎన్నికల్లో.. వలసలను అరికడతామని వాగ్దానం చేసిన పార్టీలు అధికారానికి వచ్చాయి. దీంతో చాలా దేశాలు తమ విదేశాంగ విధానాలను మార్చుకొన్నాయి. వలసలను అడ్డుకోవడం, ఇప్పటికే శరణార్థులుగా వచ్చిన వారిని ఉంచిన శిబిరాల్లో సౌకర్యాలను కుదించడం వంటి చర్యలకు అవి పాల్పడుతున్నాయి. వలసలను అడ్డుకొనేందుకు సరిహద్దు నియంత్రణపై 2021-27 మధ్య 349 కోట్ల యూరోలను ఖర్చు చేయాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) నిర్ణయించింది. కొత్తగా పదివేల మంది సరిహద్దు గార్డులను మోహరిస్తామని ఈయూ కమిషన్ అధ్యక్షుడు జీన్‌క్లాడ్ జంకర్ పేర్కొన్నారు. గత డిసెంబర్‌లో ఓ రెస్క్యూ బోట్ (నావ)లో వచ్చిన 32 మందికి కనీసం వైద్యం సాయం అందించేందుకు కూడా కొన్ని దేశాలు నిరాకరించాయి.

దీంతో రక్తం గడ్డకట్టే చలిలో రెండువారాల పాటు వారు సముద్రంలోనే గడపాల్సి వచ్చింది. వలస వచ్చే వారు మధ్యధరా సముద్రాన్ని దాటకుండా ఐరోపా దేశాలు లిబియాలో స్థానిక అధికారుల సాయంతో కొన్ని నిర్బంధ కేంద్రాలను ప్రారంభించాయి. వాటిలో ప్రస్తుతం ఆరువేల మందికి పైగా ఉన్నట్టు తెలిసింది. ఇటువంటి కేంద్రాలు కొన్ని గ్రీస్, జర్మనీ దేశాల్లో కూడా ఉన్నాయి. ఈ కేంద్రాల్లో సరైన ఆహారం, తాగునీరు లేకపోవడంతో వలసదారులు తమలోతామే ఘర్షణపడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇక వారిపై జరిగే అఘాయిత్యాలను పట్టించుకొనే నాథులే లేరని కొన్ని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు వాపోతున్నారు. నిర్బంధ కేంద్రాల్లోని మహిళలపై సామూహిక లైంగికదాడులు, సెక్స్ బానిసలుగా అక్రమ రవాణా, హింస యథేచ్ఛగా సాగుతున్నాయని ఐరాస ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. దీంతో కొందరు బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నారని తెలిపింది. ఐరోపా యూనియన్ అనుసరిస్తున్న క్రూరమైన విధానాల కారణంగా వలసదారులు ఇటు శరణార్థ శిబిరాల్లో లేదా సముద్ర జలాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉత్తర ఆఫ్రికా డైరెక్టర్ హెబా మొరాయెఫ్ ఆరోపించారు.

1637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles