చితికిపోతున్న చిన్నారులు

Wed,July 11, 2018 02:23 AM

1 in 4 children live in country of conflict or disaster

-ప్రపంచవ్యాప్తంగా నాలుగోవంతు బాలలకు ఇక్కట్లు
-వెంటాడుతున్న ఘర్షణలు, విపత్తులు
-ఐరాస నివేదికపై భారత్ అసంతృప్తి

ఐక్యరాజ్యసమితి, జూలై 10: ప్రపంచంలోని బాలల్లో ప్రతి నలుగురిలో ఒకరు సాయుధ ఘర్షణలు, ప్రకృతి విపత్తుల మధ్య చిక్కుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 53.5 కోట్ల మంది బాలలు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రైట్ట ఫోర్ తెలిపారు. సోమవారం ఐరాస భద్రతామండలిలో రేపటి సాయుధ ఘర్షణ నుంచి బాలలను నేడే రక్షించాలి అన్న అంశంపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ యెమెన్, మాలి, దక్షిణ సుడాన్‌తోపాటు పలు దేశాల్లో సాయుధ ఘర్షణలతో బాలలు, యువకుల జీవితాలు దెబ్బ తింటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సాయుధ గ్రూపులు యువతను ఆత్మాహుతి దాడుల కోసం నియమించుకుంటున్నాయని ఆరోపించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన స్వీడన్ ప్రధాని స్టీఫన్ లోఫ్‌వెల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 35 కోట్ల మంది బాలలు సాయుధ ఘర్షణలతో సతమతం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ 25 ఏండ్లలోపు యువకుల్లో 60 శాతానికి పైగా సాయుధ ఘర్షణలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఒక తరానికి శాంతియుత వాతావరణమే తెలియదన్నారు. ఐరాసలో పిల్లల ప్రత్యేక ప్రతినిధి వర్జీనియా గంబా మాట్లాడుతూ 2017లో బాలల హక్కులపై 21 వేలకు పైగా ఉల్లంఘనలు జరిగాయన్నారు. సాయుధ గ్రూపులతోపాటు ప్రభుత్వ బలగాలు, గుర్తు తెలియని సాయుధులు ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని వర్జీనియా గంబా అన్నారు. పిల్లలపై సాయుధ ఘర్షణల ప్రభావంపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ నివేదిక పట్ల భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. గుటేరస్ తన నివేదికలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, జమ్ముకశ్మీర్ రాష్ర్టాల్లో సాయుధ గ్రూపులకు, ప్రభుత్వానికి మధ్య హింస పిల్లలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఈ నివేదికలో పేర్కొన్న పరిస్థితులు సాయుధ ఘర్షణ పరిధిలోకి రావని ఐరాసలో భారత్ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి తన్మయలాల్ చెప్పారు.

329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS