ఏయే మొల‌కెత్తిన గింజ‌లను తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?


Thu,March 8, 2018 08:37 AM

ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్ వంటి పోషక విలువలు అధికంగా ఉండే ఆహారం మొలకెత్తిన గింజలు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బయట నుంచి కొనుక్కోవడమే కాకుండా వీటిని మన ఇండ్లలోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. విడి విడిగా కేవలం ఒకే రకానికి చెందిన మొలకలు తీసుకోవడం కంటే రెండు, మూడు రకాల గింజలను రోజూ మొల‌కెత్తించి తీసుకుంటే కావల్సినన్ని పోషకాలు లభిస్తాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. మ‌రి ఏయే మొల‌కెత్తిన గింజ‌ల‌తో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. పెసలు


మొలకెత్తిన పెసలలో విటమిన్ ఎ, సిలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల పెసర్లతో 105 కిలోక్యాలరీల శక్తి, 0.38 కొవ్వు పదార్థాలు, 7.02 ప్రోటీన్లు, 7.7 గ్రాముల పీచు పదార్థాలు లభిస్తాయి. ప్రోటీన్లు అధికంగా ఉండడంతో చురుకుదనం, మానసిక శక్తి పెరుగుతుంది. పాస్ఫరస్ తగినంత ల‌భించ‌డం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పీచు పుష్కలంగా ఉండడంతో రక్తంలోని కొవ్వు క‌రిగిపోతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి.

2. శనగలు


వంద గ్రాముల శనగల్లో 115 క్యాలరీల శక్తి, 7.2 గ్రాముల ప్రోటీన్లు, 16.1 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 2.9 గ్రాముల కొవ్వు పదార్థాలు, ఫైబర్ ఉంటాయి. ఫైబర్ వల్ల రక్తంలో హానికరమైన కొవ్వు తగ్గుతుంది. అధిక మోతాదులో ప్రోటీన్లు లభిస్తాయి. దీంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. వీటిలోని ప్రత్యేక పదార్థాలు నిద్ర రావడానికి తోడ్పడుతాయి. ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి రోజూ ఒక కప్పు మొలకెత్తిన శనగలు తీసుకోవచ్చు.

3. రాగులు


రాగుల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్‌లు సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల రాగి మొలకల్లో 7.3 గ్రాముల ప్రోటీన్లు, 1.3 గ్రాముల కొవ్వు పదార్థాలు, 3.44 గ్రాముల కాల్షియం, 3.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటితో 328 కిలోక్యాలరీల శక్తి లభిస్తుంది. ఎముకలకు బలాన్నిస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్న వారికి బాగా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధి ఉన్నవారికి ఇవి మంచి ఆహారం. రక్తహీనతను తొలగిస్తాయి. చిన్నారుల నుంచి 6,7 నెలల వయస్సున్న పిల్లల వరకు కూడా రాగి మాల్ట్ ఇవ్వచ్చు. క్రమం తప్పకుండా తీసుకుంటే వారి పెరుగుదలకు మొల‌కెత్తిన రాగులు ఎంతగానో ఉపయోగపడతాయి.

4. బఠానీలు


మొలకెత్తిన బఠానీల్లో అత్యంత బలవర్ధకమైన పోషక విలువలు ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, శక్తి, ప్రోటీన్లు ఎక్కువ. తక్కువ క్యాలరీలు, కొవ్వు పదార్థాలు ఉంటాయి. కార్బొహైడ్రేట్లు 14.5 గ్రాములు, పీచు పదార్థాలు 5.7, ప్రోటీన్లు 5.4, ఐరన్ 1.5 మిల్లీగ్రాములు, జింక్ 1.2 మిల్లీ గ్రాములు, శక్తి 80 కిలోక్యాలరీలు, విటమిన్ సి 40 మిల్లీ గ్రాములు ఉంటాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. మలబద్దకం ఉన్న వారికి మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వయస్సుతో వచ్చే కండరాల సమస్యలను తగ్గిస్తాయి. దృష్టి సమస్యలను నివారిస్తాయి.

5. గోధుమలు


వంద గ్రాముల గోధుమల్లో ప్రోటీన్లు 8.1 గ్రాములు, 214 కిలోక్యాలరీల శ‌క్తి, ఫైబర్ 1.2 గ్రాములు, కార్బొహైడ్రేట్లు 45.9 గ్రాములు ఉంటాయి. మధుమేహం, జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. చర్మ సౌందర్యానికి, జుట్టు పెరగడానికి, నాడీ మండలానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

6. సోయాబీన్స్


వంద గ్రాముల సోయాబీన్స్‌లో ఫైబర్ 9.3 గ్రాములు, ప్రోటీన్లు 36.49, జింక్ 4.89, విటమిన్ సి 60 మిల్లీ గ్రాములు, ఐరన్ 15.7 గ్రాములు ఉంటాయి. ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. క్యాన్సర్ కారకాలను తొలగించడానికి ఉపయోగపడతాయి. రోజూ 25 గ్రాముల సోయాబీన్స్ తీసుకుంటే గుండె జబ్బులు తొలగిపోతాయి. వీటిలో ఉండే అధిక ఫైబర్ బ్లడ్ షుగర్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

7. మెంతులు


ఐరన్ 33.53 మిల్లీగ్రాములు, ఫైబర్ 25 గ్రాములు, ప్రోటీన్లు 23 గ్రాములు, అమైనో యాసిడ్స్ 300 గ్రాములు ఉంటాయి. జలుబు, ఆస్తమా, గొంతు సమస్యలు దూరమవుతాయి. పాలిచ్చే తల్లులకు కూడా మెంతుల మొలకల్ని ఇవ్వచ్చు. గ్యాస్ట్రిక్, మధుమేహం రుగ్మతలు ఉన్నవారికి ఇవి మేలైన ఔషధంగా పనిచేస్తాయి. మొలకలొచ్చిన మెంతుల చూర్ణపు ముద్దను స్నానానికి ముందు తలకు పట్టించడం వల్ల తెల్ల వెంట్రుకల సమస్యలు తగ్గుతాయి.

8. పల్లీలు


కార్బొహైడ్రేట్లు 21 గ్రాములు, ఫైబర్ 9 గ్రాములు, ప్రోటీన్లు 25 గ్రాములు, శక్తి 570 కిలోక్యాలరీలు, ఐరన్ 2 మిల్లీ గ్రాములు, జింక్ 3.3 మిల్లీగ్రాములు మొల‌కెత్తిన ప‌ల్లీల్లో ఉంటాయి. ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల బరువు తక్కువగా ఉన్నవారికి మేలైన ఆహారం. శరీరానికి పనికివచ్చే కొవ్వు పదార్థాలు ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మేలైనవి. నియాసిన్ ఎక్కువగా ఉండడం వల్ల మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

మొల‌కెత్తిన గింజ‌ల తయారీ విధానం...


ముందుగా గింజల్ని 8 నుంచి 12 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడగాలి. దీంతో వాటికి ఉన్న మట్టి పోతుంది. అనంతరం నీరు లేకుండా వడకట్టాలి. తర్వాత టిష్యూ పేపర్ లేదా పొడిగుడ్డలో గట్టిగా చుట్టి ఉంచాలి. ఒక రోజు తర్వాత గుడ్డలో మొలకలొచ్చిన వాటిని వేరు చేయాలి. మొలకలు రాని వాటిని మళ్లీ అదే వస్త్రంలో చుట్టి ఉంచాలి. తరువాత మొలకెత్తిన గింజలను చల్లని చీకటి ప్రాంతంలో నిల్వ చేయాలి. ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచి ఫ్రిజ్‌లో వారం రోజుల పాటు నిల్వ ఉంచవచ్చు. అయితే ప్రతి 3 రోజులకోసారి వాటిని నీటితో తడపాల్సి ఉంటుంది.

మొలకలు తయారు చేసే సమయంలో నాణ్యమైన, శుభ్రమైన గింజల్ని ఎంపిక చేసుకోవాలి. మొలకలు వచ్చిన తరువాత ఫంగస్, బ్యాక్టీరియా సోకకుండా జాగ్రత్తలు పాటించాలి. మొలకల్ని తినేముందు వాటిని శుభ్రంగా కడిగి ఆరగించాలి. ముదురు రంగులోకి మారిన వాటిని, చిన్నవిగా, మురికిగా ఉన్నవాటిని తీసుకోవద్దు. సాధ్యమైనంత వరకు ఇంట్లో తయారు చేసిన మొలకల్ని తినడం ఉత్తమం. ఫ్రిజ్‌లో పెట్టకపోతే తడిగుడ్డలో కూడా చుట్టి ఉంచొచ్చు. అయితే ప్రతి 12 గంటలకు ఒకసారి వాటిని నీటితో తడపాలి. మొలకల్ని పచ్చివి తిన్నా, కాస్త వేయించి తిన్నా ప్రయోజనమే కలుగుతుంది. పెసలు, మెంతులు, రాగులు లేదా శనగలు, రాగులు, సోయాబీన్స్ ఇలా కాంబినేష‌న్‌లో గింజ‌ల‌ను త‌యారుచేసుకుని తీసుకుంటే చ‌క్క‌ని ఆరోగ్యం సొంత‌మ‌వుతుంది.

8002

More News

VIRAL NEWS

Featured Articles