నిత్యం ఏసీలో గడిపేవారికి వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్యలు ఇవి..!


Mon,December 4, 2017 01:25 PM

ఎండాకాలంలో ఏసీల్లో ఉంటే ఎవరికైనా బయటి వాతావరణం, అందులో వేడి, అధికంగా ఉండే ఉష్ణోగ్రతల గురించి తెలియదు. చల్లగా వీచే ఏసీ గాలిలో సేదదీరుతారు. ఇక ఆఫీస్, షాపింగ్ మాల్స్ ఇతర ప్రాంతాల్లో అయితే కాలాలతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ కొందరు ఏసీల్లో గడుపుతుంటారు. దీంతో సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. అయితే నిజానికి ఏ కాలంలో అయినా ఏసీలు అందరికీ పడవు. దీంతో వారు అనారోగ్య సమస్యలకు గురి కావల్సి వస్తుంది. ముఖ్యంగా ఏసీలు పడని వారిలో కింద చెప్పిన అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఉంటే గనక కచ్చితంగా ఏసీల్లో ఉండకూడదు. మరి ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దామా..!

1. డీహైడ్రేషన్


నిత్యం ఏసీల కింద ఉండే వారిలో డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఏసీలు వాతావరణంలో ఉండే తేమను గ్రహించి రూమ్‌ను చల్లగా, పొడిగా ఉంచుతాయి. దీంతో కొందరు ఈ వాతావరణాన్ని తట్టుకోలేరు. అలాంటి వారిలో డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. వీరు చీటికీ మాటికీ నీరు తాగుతుంటారు. కనుక ఇలాంటి సమస్య ఇబ్బందులు పెడుతుంటే ఏసీల్లో ఉండకూడదు.

2. తలనొప్పి


ఏసీల వల్ల గదుల్లో తేమ పోతుందని చెప్పాం కదా. దీంతో డీ హైడ్రేషన్ సమస్య వచ్చి ఫలితంగా అది తలనొప్పికి దారి తీస్తుంది. కనుక ఏసీల కింద ఉండేవారు తలనొప్పి వస్తుంటే అది ఏసీ వల్లో కాదో తెలుసుకోవాలి. అది ఏసీ వల్లే అయితే ఏసీలకు దూరంగా ఉండాలి.

3. పొడిచర్మం


గాలిలో ఉన్న తేమను ఏసీలు తగ్గిస్తే దాంతో మన చర్మం కూడా పొడి బారుతుంది. మృదుత్వం లోపిస్తుంది. దీంతో స్కిన్ ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలు వస్తాయి. కొందరికి చర్మంపై దురదలు, దద్దుర్లు కూడా వస్తాయి. ఈ సమస్యలు ఉంటే ఏసీల్లో గడపకూడదు.

4. అలర్జీ


ఏసీలను సరిగ్గా క్లీన్ చేయకపోతే వాటి విండోల్లో బాక్టీరియా పేరుకుపోతుంది. అనంతరం అది ఆ రూమ్‌లోనే తిరుగుతుంది. దీంతో కొందరికి అలర్జీలు వస్తాయి. శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు ఉంటే ఏసీల్లో ఉండరాదు.

5. కళ్లు


తేమదనం తగ్గడం వల్ల కళ్లు కూడా పొడి బారతాయి. దీంతో కళ్లలో దురదలు వచ్చి ఎరుపెక్కుతాయి. అలాంటప్పుడు ఏసీ రూమ్ నుంచి బయటికి వచ్చి కొంత సేపు గడపాలి.

6. అలసట


నిత్యం ఏసీల్లో పనిచేసేవారు త్వరగా అలసిపోతారని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతోపాటు శరీరంలో మ్యూకస్ ఎక్కువగా పేరుకుపోతుంది. ఇది జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరాలు, శ్వాస కోశ సమస్యలకు దారి తీస్తుంది. కనుక ఈ సమస్యలు తరచూ ఇబ్బందులు పెడుతుంటే అలాంటి వారు ఏసీల్లో ఉండరాదు.

4866

More News

VIRAL NEWS

Featured Articles