రోజూ మొల‌కెత్తిన పెస‌ల‌ను తింటే క‌లిగే లాభాలివే తెలుసా..!


Sun,February 11, 2018 12:57 PM

మన శరీరానికి పోషకాలను అందించే ముఖ్య ఆహార పదార్థాల్లో పెసలు కూడా ఒకటి. పప్పు ధాన్యాల జాతికి చెందిన పెసలలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. దీంతోపాటు ఫైబర్ వీటిలో అధికంగా ఉంటుంది. పెసలను మొలకెత్తిన గింజల రూపంలో నిత్యం తీసుకుంటే అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు. ఈ క్రమంలో మొలకెత్తిన పెసలను రోజూ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. మొలకెత్తిన పెసలలో అధికంగా ఉండే డైటరీ ఫైబర్ బరువు తగ్గించేందుకు, కొవ్వును కరిగించేందుకు, చెడు కొలెస్ట్రాల్‌ను నిర్మూలించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిని కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతోపాటు ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా మలబద్దకం కూడా తొలగిపోతుంది.

2. వాపులు, నొప్పులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు వీటిలో అధికంగా ఉన్నాయి. అదేవిధంగా విటమిన్ ఎ, బి, సి, డి, ఇ, కెలు, థయామిన్, రైబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, విటమిన్ బి6, ఫాంటోథెనిక్ యాసిడ్‌లు వీటిలో ఎక్కువగానే ఉన్నాయి. ఇవి శరీర పెరుగుదలకు, కణజాలాల నిర్మాణానికి ఉపయోగపడతాయి. దృష్టి సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. గుండె జబ్బులు రాకుండా నిరోధించబడతాయి. రక్తహీనత తొలగిపోవడంతోపాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

3. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణం మొలకెత్తిన పెసలకు ఉంది. అంతేకాదు యాంటీ ఏజింగ్ గుణాలు కూడా వీటిలో ఉన్నాయి. ఇవి వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలను తగ్గిస్తాయి.

4. శరీరంలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పెసలలో ఉన్నాయి. ఇవి కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి.

5. పలు రకాల క్యాన్సర్లను అడ్డుకునే గుణాలు పెసలలో ఉన్నాయి.

6. గ్యాస్, అజీర్ణం వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మొలకెత్తిన పెసలను నిత్యం తీసుకుంటే శరీరానికి కావల్సిన కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నిషియం, పాస్ఫరస్, జింక్, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలు సమృద్ధిగా అందుతాయి.

10019

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles