రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..!


Thu,January 11, 2018 12:23 PM

మానవ శరీరంలోకి సూక్ష్మ క్రిములు ప్రవేశించగానే వెంటనే వాటిని నిర్మూలించేందుకు రోగ నిరోధక వ్యవస్థ నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. అయితే మనలో కొంతమందికి వివిధ కారణాల వల్ల ఈ వ్యవస్థ సరిగా పనిచేయదు. దీంతో ఎల్లప్పుడూ అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే మన శరీరంలోని ఈ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆయుర్వేదం పలు పదార్థాలను ఔషధాలుగా సూచిస్తోంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉసిరి


ఇందులో విటమిన్ సితోపాటు కాల్షియం, ఐరన్, పాస్ఫరస్, ఫైబర్‌లు అధికంగా ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం ఉసిరి మన శరీరంలో ఏర్పడే అనారోగ్యాలకు కారణమైన మూడు రకాల దోషాలైన వాత, పిత్త, కఫాల హెచ్చు తగ్గులను నియంత్రిస్తుంది. మన దేహంలోని రోగ నిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. దీన్ని మన దగ్గర ఎక్కువగా పచ్చళ్లలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఎండబెట్టిన ఉసిరికాయలు, వాటి పొడి కూడా మనకు మార్కెట్‌లో లభ్యమవుతోంది. నిత్యం రెండు సార్లు దీన్ని తీసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పొడిగా, కాయగా లేదా ఇతర పండ్లతో కలిపి కూడా దీన్ని తీసుకోవచ్చు.

2. పసుపు


మన దేశంలో పసుపును ఎక్కువగా వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. అయితే ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. శరీరంలో ఏర్పడే 3 రకాల దోషాలను ఇది నియంత్రిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. సాధారణ జలుబు, పొడి చర్మం, కీళ్ల నొప్పులు, వాపులు వంటి అనారోగ్యాలకు ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుంది. నిత్యం దీన్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదులో వేడిపాలు లేదా నీటితో తీసుకోవాలి.

3. అల్లం


శరీరంలో ఏర్పడే వాత, కఫ దోషాలను అల్లం తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు ఇన్‌ఫెక్షన్లపై పోరాటం చేస్తుంది. ఆర్థరైటిస్, గౌట్, ఎడిమా, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడుతున్న వారు నిత్యం అల్లంను తీసుకుంటే మంచి ఆరోగ్యకర ఫలితాలు కలుగుతాయి. నువ్వుల నూనెలో ఎండబెట్టిన అల్లం పొడిని కలిపి కీళ్లపై మర్దనా చేస్తే నొప్పులు తగ్గుతాయి. పలు శ్వాసకోశ వ్యాధులను తగ్గించే గుణం అల్లంకు ఉంది. రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ అల్లం ర‌సం సేవిస్తే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను మెరుగ్గా ప‌నిచేసేలా చేయ‌వ‌చ్చు.

4. తులసి


యాంటీ ఆస్తమాటిక్, యాంటీ ఇన్‌ఫెక్టివ్ గుణాలు తులసిలో పుష్కలంగా ఉన్నాయి. శ్వాసకోశ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తులసి ఆకుల రసాన్ని నిత్యం తీసుకుంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ గాడిలో పడుతుంది. అల్లం, తేనె వంటి వాటితో దీన్ని కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.

5. అతి మధురం


అతి మధురం వేర్లు అనేక రకాల అనారోగ్యాలకు ఔషధాలుగా పనిచేస్తాయి. శరీరంలో ఏర్పడే వాతాన్ని ఇది తగ్గిస్తుంది. దీంతోపాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దగ్గు, గొంతు నొప్పి, బ్రాంకైటిస్, లైంగిక సామర్థ్యం, చర్మ సమస్యలు, పచ్చకామెర్లు తదితర ఎన్నో రకాల వ్యాధులకు ఇది మందుగా ఉపయోగపడుతుంది. గ్లాస్ గోరు వెచ్చని నీటిలో చిటికెడు అతి మధురం వేర్ల పొడిని కలిపి రోజుకు 4 నుంచి 5 సార్లు పుక్కిలిస్తే నోట్లో పొక్కులు, పుండ్లు తగ్గిపోతాయి. అతి మధురం వేర్ల పొడి, 5, 6 తులసి ఆకులు, తగినన్ని పుదీనా ఆకులను కలిపి తక్కువ మంటలపై 10 నిమిషాల పాటు ఉడికించి ఆ ద్రవాన్ని వడకట్టి తాగితే జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి. గాయాలపై అతి మధురం వేర్ల పొడిని రాస్తే వెంటనే తగ్గుతాయి.

6. అశ్వగంధ


శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో, కోల్పోయిన శక్తిని తిరిగి ఇవ్వడంలో అశ్వగంధ మెరుగ్గా పనిచేస్తుంది. యాంటీ ఏజింగ్ గుణాలు ఇందులో మెండుగా ఉన్నాయి. అశ్వగంధ మొక్క వేర్ల పొడిని నిత్యం 3 నుంచి 6 గ్రాముల మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని ఆవుపాలతో తీసుకుంటే చక్కని ఫలితాలు వస్తాయి.

5102

More News

VIRAL NEWS