ఒక్క టీస్పూన్ వాముతో.. అనారోగ్యాలు దూరం..!


Sat,June 17, 2017 02:34 PM

వాము. దీన్నే ఓమ అని సంస్కృతంలో, హిందీలో అజ్వైన్ అని అంటారు. దీన్ని మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. దీంతో వంటకాలకు చక్కని రుచి, సువాసన వస్తుంది. అయితే కేవలం వంటలకే కాదు, అనారోగ్యాలను తరిమి కొట్టడంలోనూ వాము ఉపయోగపడుతుంది. వాము వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఈ కాలంలో జలుబు అందరికీ కామన్‌గా వస్తుంది. వాతావరణం మారినప్పుడు జలుబు రావడం సహజమే. దీన్ని వాముతో తగ్గించుకోవచ్చు. వామును ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని బాగా నలపాలి. అనంతరం ఆ పొడిని శుభ్రమైన వస్త్రంలో కట్టి దాన్ని వాసన పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తే జలుబు వెంటనే తగ్గుతుంది.

2. ఒక టీస్పూన్ వాము, ధనియాలు, జీలకర్రలను తీసుకుని మూడింటినీ కలిపి పెనంపై దోరగా వేయించాలి. అనంతరం ఆ మిశ్రమంతో కషాయం తయారు చేసుకోవాలి. దీన్ని తాగుతుంటే జ్వరం తగ్గుతుంది.

3. ఒక టీస్పూన్ వామును ఒక గ్లాస్ నీటిలో కొంత సేపు నానబెట్టాలి. తరువాత ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగాలి. దీంతో వాంతులు, వికారం తగ్గుతాయి.

4. మిరియాలు, ఉప్పు, వాములను ఒక టీస్పూన్ మోతాదులో సమ పాళ్లలో తీసుకుని మూడింటినీ కలిపి చూర్ణం చేయాలి. దీన్ని ప్రతి రోజూ 3 పూటలా భోజనానికి ముందు తినాలి. దీంతో అజీర్ణం, కడుపునొప్పి తగ్గుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

5. త్రిఫల చూర్ణం ఒక టీస్పూన్, వాము ఒక టీస్పూన్ తీసుకుని రెండింటినీ నీటితో కలిపి ముద్దగా చేయాలి. ఆ ముద్దను దంతాల మూలల్లో పెట్టాలి. దీంతో దంతాల నొప్పి తగ్గిపోతుంది.

6. వామును ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని బుగ్గన పెట్టుకుని నములుతూ వచ్చే రసాన్ని కొద్ది కొద్దిగా మింగాలి. దీంతో గొంతు నొప్పి తగ్గుతుంది.

7. ఒక టీస్పూన్ వామును ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని రోజూ తాగుతూ ఉంటే కిడ్నీలో రాళ్ల కరుగుతాయి. మూత్రాశయ సమస్యలు పోయి మూత్రం ధారాళంగా వస్తుంది.
vamu-seeds
8. ఒక టీస్పూన్ మోతాదులో వామును తీసుకుని దానికి కొద్దిగా బెల్లం కలపాలి. ఆ మిశ్రమాన్ని సేవిస్తే ఆస్తమా తగ్గుతుంది.

9. వామును నిత్యం ఒక టీస్పూన్ మోతాదులో ఏదో ఒక రూపంలో తింటున్నా గుండె వ్యాధులు రాకుండా ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

10. కడుపులో అసౌకర్యంగా ఉంటే కొద్దిగా వామును తినాలి. దీంతో జీర్ణాశయం సరిగ్గా పనిచేస్తుంది. ఆకలి బాగా పెరుగుతుంది.

11. ఒక గ్లాస్ వేడి పాలలో ఒక టీస్పూన్ వేయించిన వామును వేసి బాగా కలిపి తాగితే స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి.

12. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ వాము, కొద్దిగా జీలకర్ర కలిపి బాగా మరిగించి ఆ నీటిని తాగితే అసిడిటీ సమస్య ఉండదు. అజీర్ణం సమస్య తొలగిపోతుంది.

13. గ్లాస్ వేడి నీరు తీసుకుని దాన్ని తాగుతూ ఒక టీస్పూన్ వామును తినాలి. దీంతో జలుబు, దగ్గు తగ్గిపోతాయి.

14. గర్భంతో ఉన్న మహిళలు వామును రోజూ తీసుకుంటే రక్తాన్ని శుభ్రం చేస్తుంది. కడుపులో ఉండే బిడ్డకు రక్త సరఫరా మెరుగ్గా అంది పోషణ కలుగుతుంది.

7669

More News

VIRAL NEWS