ముఖ్యమైన విటమిన్ బి12 తగ్గితే..


Mon,May 14, 2018 11:00 PM


మన శరీరానికి కావల్సిన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ బి కాంప్లెక్స్ చాలా ముఖ్యమైనవి. అందులో బి12 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే దీని ప్రభావం శరీరంలోని దాదాపు అన్ని ముఖ్యమైన అవయవాల మీద ఉంటుంది.

* గుండె - విటమిన్ బి12, బి6, ఫోలిక్ ఆసిడ్ మూడు కలిసి హోమోసెస్టిన్ అనే ప్రొటీన్‌ను ఏర్పడకుండా నివారించందుకు అవసరమవుతాయి. ఈ ప్రొటీన్ రక్తంలో ఏర్పడి రక్తనాళాలకు నష్టం చేస్తుంది. ఆ విధంగా గుండె ఆరోగ్యానికి ఈ విటమిన్లు దోహదం చేస్తాయి.
* నాడీ వ్యవస్థ - నాడీ వ్యవస్థ సమర్థ వంతంగా పనిచేయ్యడానికి విటమిన్ బి12 అవసరమవుతుంది. ఈ విటమిన్ తగ్గితే శరీరంలో అక్కడక్కడ సూదులు గుచ్చుకుంటున్నట్టు నొప్పి వస్తుంది. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్ల వంటి లక్షణాలు కనిపిస్తాయి. నాడీ కణాల చుట్టూ ఉండే మైలిన్ పొరను ఏర్పరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ లోపం ఏర్పడితే నాడీ వ్యవస్థ పనితీరు సరిగ్గా ఉండదు. తిమ్మిర్లు రావడం అనేది నాడీ కణాలకు జరిగిన నష్టానికి ప్రతీకగా భావించవచ్చు. దీన్ని ఇలాగ వదిలేస్తే మీ కదలికల తీరులో మార్పు వస్తుంది. నడక మీద అదుపు లేనందువల్ల పడిపోయే ప్రమాదం ఉంటుంది.
* నోటి ఆరోగ్యం - మీ నోటి ఆరోగ్యం మీ పూర్తి ఆరోగ్యం గురించిన చాలా విషయాలు తెలియజేస్తుంది. బి12 కొద్ది మొత్తంలో తగ్గినపుడు నాలుక మీద పుండు పడి నొప్పి రావచ్చు. నాలుక ఎర్రగా కంది పోయినట్టుగా మారి కొద్దిగా వాపు కూడా వస్తుంది. ఇది మాట్లాడే తీరు, ఆహారం తీసుకునే తీరు మీద ప్రభావం చూపుతుంది.
* కంటి ఆరోగ్యం - కంటి చూపుకు కూడా బి12 అత్యవసరమైన పోషకం. బి12 లోపం ఏర్పడితే కంటికి సంబంధించిన నాడుల మీద కూడా ప్రభావం పడుతుంది. అందువల్ల కంటి చూపు కూడా తగ్గిపోవచ్చు.
* జ్ఞాపకశక్తి - బి12 తగ్గినపుడు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే సప్లిమెంట్ల వాడకం వల్ల ఈ విషయంలో లాభం ఉంటుందో లేదో ఇప్పటి వరకు నిర్ధారణ జరగలేదు.
* జీర్ణ వ్యవవస్థ - ఆరోగ్యవంతమైన జీర్ణ వ్యవస్థ కోసం తగినన్ని నీళ్లు తాగడం, తగినంత పీచుపదార్థం కలిగిన ఆహారం తీసుకోవడం అవసరం. కానీ బి12 లోపం వల్ల కూడా మలబద్దకం లేదా విరేచనాలు లేదా ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
* చర్మం - బి12 తగ్గడం వల్ల చర్మం కూడా కాస్త పాలిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే బి12 తగ్గడం వల్ల ఎర్రరక్త కణాల పరిమాణం తగ్గిపోతుంది. అందువల్ల వాటి శక్తి తగ్గడం వల్ల అన్నీ శరీర భాగాలకు ప్రసరించడానికి సరిపడినంత శక్తి వాటికి ఉండదు. అందువల్ల త్వరగా మరణిస్తాయి. మరణించిన ఎర్రరక్త కణాల నుంచి వెలువడిన బైలురుబిన్ వల్ల చర్మం పచ్చగా లేదా కాస్త ఎరుపు రంగులో కనిపిస్తుంది.

6111

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles