పెరుగుతున్న హఠాత్తు గుండెపోట్లు


Fri,May 19, 2017 06:50 AM

ఢిల్లీ: కేంద్రమంత్రి అనిల్‌దవే(60), బాలీవుడ్ నటి రీమాలాగూ(59) హఠాత్తుగా గుండెపోట్లతో మరణించడంతో చాపకింద నీరులా వ్యాపిస్తున్న గుండె జబ్బులపై మరోసారి చర్చ మొదలైంది. బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రధానితో సమావేశాల్లో పాల్గొన్న దవే మరణిస్తారని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఆయనలో గుండెజబ్బు లక్షణాలేవీ కనిపించలేదు. రీమాలాగూ సంగతీ అంతే. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు అంటున్నారు. భారతీయుల ఆయుర్దాయం క్రమంగా పెరుగుతున్నప్పటికీ హఠాత్తుగా గుండెపోట్లు వచ్చి చిన్నవయసులో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య కూడా పెరుగుతున్నదని ఢిల్లీ వైద్య నిపుణులు అంటున్నారు. జీవన విధాన సమస్యలే ఇందుకు కారణమని చెప్తున్నారు. దీనిపై ఎవరికివారు ఆత్మపరిశీలన చేసుకుని అనుగుణంగా అలవాట్లు మార్చుకోవాలని ఎయిమ్స్‌కు చెందిన హృద్రోగ నిపుణుడు డాక్టర్ సందీప్ మిశ్రా అన్నారు. చాలాసార్లు గుండెజబ్బుల లక్షణాలు బయటికి కనిపించవు. కనిపించినా గుర్తుపట్టలేరు. ఏ ఎసిడిటీ లేక అజీర్తి అనుకుని నిర్లక్ష్యం చేస్తారని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు చెంది ఓ వైద్యుడు అన్నారు. భారత్‌లో హృద్రోగం బారినపడినవారు లేదా గుండెపోట్లు వచ్చినవారి వయసు పశ్చిమదేశాలతో పోలిస్తే 8-10 ఏండ్లు తక్కువగా ఉంటుందని శ్రీగంగారాం హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ జేపీఎస్ సానీ అన్నారు.

1858

More News

VIRAL NEWS