స్వీట్లు, జంక్‌ఫుడ్, ఇతర కొన్ని ఆహార పదార్థాల కారణంగా దంతాల మధ్య కావిటీలు వచ్చి దంతాలు పుచ్చిపోతాయి. దంతాలకు రంధ్రాలు పడతాయి. దీంతోపాటు చిగుళ్ల సమస్యలు కూడా బాధిస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీంతోపాటు కొందరికి పలు కారణాల వల్ల దంతాలపై గార పట్టడమో, పాచి ఎక్కువగా పేరుకోవడమో జరుగుతుంది. అయితే దంతాలకు చెందిన ఇలాంటి సమస్యలు ఏవి ఉన్నా వాటిని మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే దూరం చేసుకోవచ్చు. దీంతో ఆ సమస్యలు పోవడమే కాదు, దంతాలు కూడా తెల్లగా తళతళ మెరుస్తాయి. ఈ క్రమంలో దంతాలను తెల్లగా చేసే అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రా బెర్రీలు...
స్ట్రా బెర్రీల్లో మాలియిక్ యాసిడ్ అనే ఓ ఎంజైమ్ ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ పండ్లలో ఉండే విటమిన్ సి వల్ల కూడా దంతాలు తెల్లగా మారుతాయి. దంతాల మధ్య పేరుకుపోయే వ్యర్థాలు తొలగిపోతాయి. స్ట్రా బెర్రీలను తరచూ తింటుంటే దంత సమస్యలు బాధించవు.
యాపిల్స్...
చిగుళ్లను దృఢంగా చేసి దంతాలను తెల్లగా మార్చే ఔషధ గుణాలు యాపిల్స్‌లో ఉన్నాయి. అంతే కాదు, యాపిల్స్ వల్ల నోట్లో ఉమ్మి కూడా బాగా తయారవుతుంది. ఇది నోట్లో ఉండే చెడు బాక్టీరియాను నాశనం చేస్తుంది.
బ్రకోలి...
బ్రకోలిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది దంతాలను తెల్లగా మార్చేందుకు, దంతాలను దృఢంగా చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
క్యారెట్స్...
క్యారెట్లలో దంతాలను తెల్లగా చేసే గుణాలు ఉన్నాయి. వీటిని తరచూ తింటుంటే చాలు దంత సమస్యలు పోతాయి. చిగుళ్లు దృఢంగా మారుతాయి.
చీజ్...
చీజ్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది దంతాలను దృఢంగా చేయడమే కాదు, దంతాలను తెల్లగా మారుస్తుంది. దంతాల పైన ఉండే ఎనామిల్ పొర పోకుండా చూస్తుంది.
నట్స్...
బాదం పప్పు, జీడి పప్పు, వాల్‌నట్స్‌లలో దంతాలను తెల్లగా చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. పాచి పళ్లు ఉన్నవారు నట్స్‌ను తరచూ తింటుంటే మంచిది. దీంతో దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు.
ఉల్లిపాయలు...
ఉల్లిపాయలతో ఒకటే సమస్య. అది నోటి దుర్వాసన. ఉల్లిపాయలను తింటే నోరంతా వాసన వస్తుంది. కానీ నిజానికి ఉల్లిపాయల వల్ల మన దంతాలకు మేలే జరుగుతుంది. వాటిని పచ్చిగా తింటుంటే వాటిలో ఉండే సల్ఫర్ నోటి సమస్యలను పోగొడుతుంది. దంతాలను తెల్లగా మారుస్తుంది.
నారింజలు...
నారింజలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది దంతాలను దృఢంగా చేయడమే కాదు, తెల్లగా మార్చేందుకు కూడా ఉపయోగపడుతుంది.
పైనాపిల్స్...
బ్రొమిలీన్ అనే రసాయనం పైనాపిల్స్‌లో పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలకు పట్టిన పాచి, గార వంటి వాటిని తొలగించి దంతాలను తెల్లగా, దృఢంగా మారుస్తుంది. దంతాల మధ్య పేరుకుపోయిన వ్యర్థాలు, బాక్టీరియాను తొలగిస్తుంది.