ఈ ఆహారాలను రోజూ తింటే.. కాలుష్యం మిమ్మల్ని ఏమీ చేయలేదు..!


Sat,December 2, 2017 04:27 PM

నేటి తరుణంలో కాలుష్యం అనేది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నదో అందరికీ తెలిసిందే. దీని కారణంగా అనేక విష పదార్థాలు నిత్యం గాలి ద్వారా మన శరీరంలోకి చేరుతున్నాయి. అవి మనకు తీవ్ర అనారోగ్య సమస్యలను కలిగిస్తున్నాయి. దీంతో మనలో చాలా మంది కొన్ని సార్లు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. కాలుష్యం వల్ల అనేక మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు కూడా. అయితే దీన్ని నివారించడం ఎలా అంటే..? అందుకు మనం, మన ప్రభుత్వాలు వివిధ ర‌కాలుగా కృషి చేయాలి. అంత వరకు ఓకే. కానీ నిత్యం మనం తినే పలు ఆహార పదార్థాలను మార్చి కింద సూచించిన విధంగా ఆయా ఆహారాలను తింటే దాంతో కూడా కాలుష్యం నుంచి తప్పించుకోవచ్చు. ఆయా ఆహారాలను తినడం వల్ల శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. దీంతో కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. మరి కాలుష్యం వల్ల అనారోగ్యాలకు గురి కాకుండా ఉండాలంటే ఏయే ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, పైనాపిల్, జామ, కివీ, ఉసిరి, టమాటోలు, బొప్పాయి, స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఎక్కువగా తినాలి. విటమిన్ సి పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీంతో శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.

2. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే వాల్ నట్స్, చియా సీడ్స్, అవిసె గింజలు, చేపలు వంటి ఆహారాలను తినాలి. ఇవి కాలుష్యం బారిన పడే మన శరీరాన్ని రక్షిస్తాయి. శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపేస్తాయి.

3. బాదం పప్పు, జీడిపప్పు, పాలకూర, గుమ్మడికాయ విత్తనాలు, పెరుగు వంటి ఆహారాల్లో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త వహించవచ్చు.

4. అల్లంలో జింజెరోల్ అనబడే రసాయనం ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. కనుక వ్యాధుల నుంచి మనకు రక్షణనిస్తుంది.

5. రాత్రిపూట ఒక గ్లాస్ పాలలో పసుపు కలుపుకుని తాగాలి. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది.

6. కొబ్బరినీళ్లు, లెమన్ వాటర్, గ్రీన్ టీ, వెజిటబుల్ సూప్స్ తీసుకున్నా కాలుష్యం బారి నుంచి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.

5539

More News

VIRAL NEWS