ఎప్ప‌టికీ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే.. వీటిని తీసుకోవాలి..!


Tue,February 13, 2018 03:09 PM

ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలోనే కాదు, నేటి తరుణంలో ప్రతి ఒక్కరు తమ అందం పట్ల కూడా శ్రద్ధ వహిస్తున్నారు. పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా ఇప్పుడందరూ తమ సౌందర్యాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో అందంగా కనిపించడం కోసం వివిధ రకాల పద్ధతులను కూడా అవలంబిస్తున్నారు. అయితే మనకు అందుబాటులో ఉన్న పలు ఆహార పదార్థాలను ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు మీద పడకుండా, ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేసుకోవచ్చు. అలాంటి ఆహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. వైన్


వైన్‌ను మితంగా తీసుకుంటే అది గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. దీంతోపాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా వృద్ధాప్యం కారణంగా చర్మంపై వచ్చే ముడతలు కూడా తగ్గిపోతాయి.

2. పుచ్చకాయలు


శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు పుచ్చకాయల్లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి యవ్వనంగా కనిపించేందుకు కూడా దోహదం చేస్తాయి. అదేవిధంగా ఈ కాయల్లోని విటమిన్ ఎ, బి, సి, ఇ, జింక్‌లు శరీరానికి కావల్సిన పోషకాలను అందిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. పుచ్చకాయలను నిత్యం తీసుకుంటే శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

3. బ్లూబెర్రీలు


యాంటీ ఏజింగ్ గుణాలు బ్లూబెర్రీల్లో పుష్కలంగా ఉన్నాయి. వయస్సు మళ్లడం వల్ల వచ్చే ముడతలను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో అధికంగానే ఉన్నాయి. నొప్పులు, వాపులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు బ్లూబెర్రీల్లో ఉన్నాయి.

4. అవకాడోలు


అవకాడోలలో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలోని పీహెచ్ విలువలను ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉండేలా చూస్తుంది. యవ్వనంగా కనిపించేందుకు ఉపయోగపడుతుంది.

5. నిమ్మకాయలు


వృద్ధాప్య ఛాయలు, ముడతలకు కారణమయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు నిమ్మకాయల్లో పుష్కలంగా ఉన్నాయి. వీటిలోని సి విటమిన్ చర్మాన్ని సంరక్షించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాదు ముడతలను కూడా తగ్గిస్తుంది.

6. ఆలివ్ ఆయిల్


చర్మానికి ప్రకాశాన్ని, మెరుపును అందించడంలో ఆలివ్ ఆయిల్ ఎంతగానో దోహదపడుతుంది. యాంటీ ఏజింగ్ గుణాలు దీంట్లో ఉన్నాయి. వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయని యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఆలివ్ ఆయిల్‌లో ఉన్నాయి.

7. గ్రీన్ టీ


చర్మంపై ఏర్పడే ముడతలను తగ్గించడంతోపాటు ఎండ కారణంగా నాశనమైన చర్మ కణాలకు పునరుజ్జీవం కలిగించే గుణాలు గ్రీన్ టీలో ఉన్నాయి. అంతేకాకుండా గ్రీన్ టీలోని ఔషధ కారకాలు వృద్ధాప్య ఛాయలను కనిపించకుండా చేస్తాయి.

8. ఆకుపచ్చని కూరగాయలు


ఆకుపచ్చని కూరగాయల్లో చర్మాన్ని సంరక్షించే బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ కె తదితర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో ఉన్నాయి. ఇవన్నీ చర్మానికి మెరుపును, ప్రకాశాన్ని కూడా ఇస్తాయి.

9. వెల్లుల్లి


వెల్లుల్లిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగానే ఉన్నాయి. దీంతోపాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలు కూడా వీటిలో ఉన్నాయి. చర్మాన్ని సంరక్షించుకునేందుకు వెల్లుల్లి ఎంతగానో దోహదపడుతుంది.

10. చేపలు


శరీరానికి యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని కలిగించేందుకు చేపలు ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని సంరక్షించడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. చర్మ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.

పైన పేర్కొన్నవే కాకుండా చిలగడదుంపలు, గుమ్మడికాయలు, క్యారెట్లు, టమాటాలు, కొబ్బరినూనె తదితరాల్లోనూ యాంటీ ఏజింగ్ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే చర్మాన్ని సులభంగా సంరక్షించుకోవచ్చు.

6255

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles