రోజూ యోగా చేస్తే వీర్యం నాణ్యత పెరుగుతుంది.. ఎయిమ్స్ పరిశోధనలో వెల్లడి..!


Sun,June 10, 2018 08:11 PM

నిత్యం యోగా చేసే పురుషుల్లో వీర్యం నాణ్యత పెరుగుతుందని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) పరిశోధనలో వెల్లడైంది. ఎయిమ్స్‌లోని అనాటమీ, యూరాలజీ, ఆబ్‌స్టెట్రిక్స్, గైనకాలజీ విభాగాలకు చెందిన నిపుణులు ఈ పరిశోధన చేశారు. వారు నిత్యం యోగా చేసే 200 మంది పురుషులను తమ పరిశోధనకు ఎంచుకుని వారిని 6 నెలల పాటు పరిశీలించారు. వారిలో వీర్యం నాణ్యత, వీర్య కణాల సంఖ్య తదితర అంశాలను పరీక్షించారు. దీంతో అసలు విషయాలను సైంటిస్టులు వెల్లడించారు. నిత్యం యోగా చేసే పురుషుల్లో వీర్యం నాణ్యత పెరుగుతుందని, వీర్య కణాలకు ఎదురయ్యే ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. ఎయిమ్స్ సైంటిస్టులు చేసిన ఈ పరిశోధన సారాంశాన్ని నేచ్ రివ్యూ యూరాలజీ అనే అంతర్జాతీయ మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురించారు.

సాధారణంగా పురుషుల్లో సంతాన లోపానికి కారణం వీర్యం నాణ్యంగా లేకపోవడమేనని ఎయిమ్స్ అనాటమీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రీమా దాదా తెలిపారు. డీఎన్‌ఏకు కలిగే నష్టం, అందులో ఉండే లోపం వల్ల వీర్యంలో నాణ్యత లోపిస్తుందని తెలిపారు. అలాగే వాతావరణ కాలుష్యం, క్రిమి సంహారకాలు, కీటక నాశనిల ప్రభావం బారిన పడడం, విద్యుదయస్కాంత తరంగాలు, ఇన్‌ఫెక్షన్లు, పొగ తాగడం, మద్యం సేవించడం, స్థూలకాయం, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల డీఎన్‌ఏకు నష్టం కలుగుతుందని, తద్వారా వీర్యంలో నాణ్యత లోపిస్తుందని అన్నారు. కానీ నిత్యం యోగా చేస్తే వీటన్నింటి బారి నుంచి తప్పించుకుని, ప్రశాంతమైన జీవనం గడపవచ్చని, దీంతో డీఎన్‌ఏ నాణ్యత కొంత వరకు పెరిగి తద్వారా వీర్యం నాణ్యతలోనూ మార్పు వస్తుందని అన్నారు. కనుక రోజూ యోగా చేస్తే వీర్యం నాణ్యతను పెంచుకోవచ్చని, తద్వారా సంతానం కలిగే అవకాశాలు మెరుగవుతాయని డాక్టర్ దాదా చెప్పారు.

7489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles