కాట‌న్ బ‌డ్స్‌తో చెవుల‌ను క్లీన్ చేయ‌కూడ‌దా..?


Sun,June 18, 2017 03:38 PM

చెవుల్లో పేరుకుపోయే గులిమి తీసేందుకు చాలా మంది కాట‌న్ బ‌డ్స్ వాడుతారు. అయితే ఇవి వాడ‌డం హానిక‌ర‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. ఇంగ్లండ్‌లోనైతే కాట‌న్ బ‌డ్స్ వాడ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్‌కు గురై ఏటా 7వేల మంది చెవి సంబంధిత అనారోగ్యాల బారిన ప‌డుతున్నార‌ని అధ్య‌య‌నాలు కూడా చెబుతున్నాయి. మరి కాట‌న్ బ‌డ్స్ వాడ‌క‌పోతే చెవుల‌ను శుభ్రం చేసుకునేది ఎలా..? అంటే.. అందుకు ప‌రిష్కారం ఇదిగో..!

చెవుల్లో గులిమి ఏర్పడడం అనేది ఓ సహజసిద్ధమైన ప్రక్రియ. చెవిలో అంతర్గతంగా ఉండే కొన్ని గ్రంథులు గులిమిని స్రవిస్తాయి. ఇది సాధారణ స్థాయిలో ఉంటే మనకు దాంతో కలిగే అనారోగ్యం ఏమీ ఉండదు. గులిమిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థకు సహకరిస్తాయి. దీంతోపాటు చెవులను శుభ్రంగా ఉంచడం కోసం కూడా గులిమి తయారవుతుంది. చెవిలో తయారయ్యే గులిమి సహజంగా కొన్ని రోజులకు దానంతట అదే పోతుంది. అంతేకానీ దాన్ని తీయడం కోసం కాటన్ బడ్స్‌ను వాడకూడదని చెబుతున్నారు వైద్యులు. అయితే త‌ప్ప‌కుండా చెవుల‌ను క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటే అందుకు కింద చెప్పిన ప‌ద్ధ‌తిని పాటించాలి.
cotton-buds
1 టీస్పూన్ ఉప్పును తీసుకుని 1/2 కప్ గోరు వెచ్చని నీటిలో కలపాలి. చెవుల్లో పెట్టుకునే దూదిని కొద్దిగా తీసుకుని ఆ మిశ్రమంలో నానబెట్టాలి. అనంతరం ఆ దూదిని తీసి సమస్య ఉన్న చెవిని పై వైపుకు వచ్చేలా తలను ఓ వైపుకు వంచి ఆ చెవిలో దూదిని పిండాలి. అందులో నుంచి కొంత ద్రవం చుక్కలు చుక్కలుగా చెవిలో పడుతుంది. తరువాత చెవిని 3 నుంచి 5 నిమిషాల పాటు అలాగే వంచి ఉంచాలి. సమయం గడిచాక తలను మరో వైపుకు వంచితే ఆ ద్రవం చుక్కలు చెవి గుండా బయటకు వస్తాయి. అనంతరం చెవులను నీటితో శుభ్ర పరుచుకోవాలి. ఇలా చేస్తే అధికంగా ఉన్న గులిమి పోతుంది. అయితే పైన చెప్పిన విధంగా ఉప్పు ద్రవమే కాకుండా దాని స్థానంలో బేబీ ఆయిల్‌, మినరల్ ఆయిల్ వంటివి వాడుకోవచ్చు. కానీ వాటి వలన ఎలాంటి అలర్జీలు లేకపోతేనే వాటిని ట్రై చేయాలి. లేదంటే ఉప్పు నీటినే వాడాల్సి ఉంటుంది.

3571

More News

VIRAL NEWS