ఈ లాభాలు తెలిస్తే జామ పండ్ల‌ను వ‌ద‌ల‌రు..!


Sat,November 11, 2017 04:21 PM

జామపండు తింటే ఇక ఆరోగ్యం మీచేతిలో ఉన్నట్టే. ఇది ఎవరో చెబుతున్నది కాదు, స్వయానా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఒక జామకాయ తింటే పది ఆపిల్స్ తిన్నదానితో సమానమంటున్నారు వారు. మన దగ్గర విరివిగా తక్కువ ధరలో అందుబాటులో ఉండే జామకాయ అంటే మనము చిన్నచూపు చూస్తుంటాం. తినడానికి అనాసక్తి చూపుతుంటాం. కానీ జామలో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని, ఎన్నో వ్యాధుల నివారణకు దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చేది జామకాయల సీజన్. విరివిగా మనకు అందుబాటులో ఉండనున్నాయి. ఇష్టంగా తిని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మరి.

ఇది జామకాయల సీజన్. మన ప్రాంతంలో ఇంటి ఆవరణలో, పంట చేనుల్లో , రోడ్ల వెంట ఎక్కువగా జామచెట్లు చూస్తుంటాం. జామ చెట్లు ఎక్కువగా అందు బాటులో ఉండడంతో సహజంగానే జామ కాయ అంటే మనం చిన్నచూపు చూస్తూ వాటిని తినేందుకు అనాసక్తి కనబరుస్తుం టాం. కానీ, జామ తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. విటమిన్-ఏ,సీ, ఈ పుష్కలంగా ఉన్న జామపండులో పోషక విలువలు మెండుగా ఉన్నాయి. ఒక జామకాయ తింటే పది ఆపిల్స్ తిన్నదానితో సమాన మని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. కొన్ని కాయల్లో లోపల గుజ్జు తెల్లగా ఉంటే, మరికొన్నింటిలో గుజ్జు లేత గులాబీ వర్ణంలో ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం చాలా ముఖ్యం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు జామపండును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

తలనొప్పికి, మైగ్రేన్ నివారణలో...


దోర జామపండును సానరాయి మీద గంధం చేసి నుదుటి మీద లేపనంలా రాస్తే తలనొప్పి తగ్గుతుంది. మైగ్రేన్(పార్శపు నొప్పి)తో బాధపడేవారు దీనిని సూర్యోదయానికి ముందే ప్రయోగిస్తే చక్కని ఫలితం ఉంటుంది. అలాగే జామపండ్లను చిన్న సైజు ముక్కలుగా కోసి తాగేనీటిలో మూడు గంటల పాటు నానబెట్టి, ఆ నీటిని తాగితే అధిక దప్పిక నుంచి ఉపశమనం లభిస్తుంది.

మలబద్ద‌కం నివారణకు...


ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మారిన జీవనశైలి, ఒత్తిడి ఇలా రకరకాల కారణాలతో ప్రస్తుతం చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకాన్ని వ్యాధుల కుప్ప గా చెప్పవచ్చు. మలబద్ధకాన్ని నివారించక పోతే శరీరం వ్యాధులమయంగా మారుతుంది. దీనికి పరిష్కారం జామ అని చెప్పుకోవచ్చు. ఒక జామకాయలో 688 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అంటే అరటి పండు కన్నా 63శాతం ఎక్కువ. బాగా పండిన జామ పండ్లను కోసి కొద్దిగా మిరియాల పొడిని చేర్చి, నిమ్మరసం కలుపుకొని తింటే తరుచూ వేధించే మలకబద్ధకం సమస్య దూరమవుతుంది. అతిసార, జిగట విరేచనాలు, గర్భిణుల్లో వాంతులు ఉన్నప్పుడు జామకాయ కషాయం గానీ, మజ్జిగలో కలుపుకుని తాగితే చక్కని ఫలితం ఉంటుంది.

దంత సంరక్షణలో...


ప్రతిరోజూ ఒక జామకాయ తింటే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి జామకాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. ఇందులో విటమిన్-సి అధిక మొత్తంలో ఉండడంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం (రక్తం కారడం) ఆగుతుంది. పచ్చి జామకాయ ముక్కలను కప్పెడు తీసుకొని, బాగా ఎండబెట్టి, దానికి అర చెంచా మిరియాలు, అర చెంచా సైందవ లవణాన్ని వేసి మెత్తగా పొడిచేసి సీసాలో నిల్వ చేసుకోవాలి. దానిని ప్రతిరోజూ పళ్లపొడిలా వాడితే దంతాలు గట్టి పడడమే కాకుండా చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.

జీర్ణశక్తికి దోహదం...


ఎన్నో పోషక విలువలు ఉన్న జామకాయ నిజంగా దివ్య ఔషధంగా చెప్పవచ్చు. ఆహారం తీసుకున్నాక జామకాయ లేక పండిన జామను తింటే తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. జామకాయలో అధికంగా ఫైబర్ ఉండడంతో జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి పేగుల కదలికను మెరుగుపస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. జామకాయను తీసుకోవడంతో గ్యాస్ట్రిక్ సమస్యలు, జలుబు దూరమవుతాయి. మధుమేహ(షుగర్) వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా జామను చెప్పవచ్చు.

జలుబు నుంచి ఉపశమనానికి...


జామపండులో విటమిన్-సి అధిక మొత్తంలో ఉండడంతో వైరస్ కారణంగా వ్యాపించిన జలుబు నివారణకు బాగా పనిచేస్తుంది. కానీ, జామలో ఉండే సహజమైన కవ ప్రకోవకర అంశాలతో కొంతమందికి జలుబు తగ్గాల్సింది పోయి పెరిగే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు జామను కొద్దిగా నిప్పుల మీద వేడిచేసి, సైందవ లవణం, మిరియాల పొడిని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

శారీరక బలానికి...


బాగా పండిన జామ పండ్ల గుజ్జులోంచి గింజలు తొలగించి పాలు తేనె కలిపి తీసుకుంటే విటమిన్-సి, కాల్షియం మెండుగా లభిస్తాయి. పెరిగే పిల్లలకు, గర్భిణులకు దీనిని టానిక్‌లా వాడవచ్చు. క్షయ, ఉబ్బసం, బ్రాంకెటైటీస్, గుండె బలహీనత, కామెర్లు, హైపటైటీస్, జీర్ణాశయ అల్సర్లు, మూత్రంలో మంటలాంటి అనేక రకాల సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జామపండులో విటమిన్- ఈ, ఒగరుతనం కలిగి ఉండడంతో చర్మానికి రక్షణ కల్పిస్తుంది. సి-విటమిన్ అధికంగా ఉండడంతో తొందరగా చర్మకణాలు అతుక్కొని త్వరిత ఉపశమనాన్ని కలిగించేలా చేస్తుంది. వీటితో పాటు జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. విటమిన్-ఏ అధికంగా ఉండే జామపండుతో కంటి సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఏ-విటమిన్ కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది.

7382

More News

VIRAL NEWS