శరీరంలో హిమోగ్లోబిన్, రక్తాన్ని పెంచే అద్భుతమైన ఆహారాలు..!


Sun,June 10, 2018 02:55 PM

మన శరీరంలో ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను ఇతర శరీర కణాలకు రవాణా చేయడంలో ఎర్ర రక్త కణాలు కీలకపాత్ర పోషిస్తాయి. వాటిల్లో ఉండే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఆక్సిజన్ రవాణాకు పనికొస్తుంది. దీంతో శరీర కణాలు సరైన రీతిలో పనిచేస్తాయి. అయితే శరీరంలో ఈ హిమోగ్లోబిన్ తక్కువైతే అప్పుడు సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అలసట, నీరసం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎవరికైనా ఈ సమస్యలు తరచూ వస్తుంటే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి. హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే డాక్టర్ సూచన మేరకు మందులు వాడాలి. వాటితోపాటు కింద సూచించిన విధంగా పలు ఆహారాలను రోజూ తీసుకుంటుంటే దాంతో శరీరంలో రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. తద్వారా పైన చెప్పిన అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. మరి హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే అందుకు రోజూ తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!


1. విటమిన్ సి

విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, నిమ్మ, క్యాప్సికం, టమాటాలు, గ్రేప్ ఫ్రూట్స్, బెర్రీలు, కివీలు తదితర పండ్లను రోజూ తింటుంటే శరీరం మనం తిన్న ఆహారం నుంచి ఐరన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

2. ఐరన్

ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, లివర్, పన్నీర్, కోడిగుడ్లు, తృణ ధాన్యాలు, పప్పు దినుసులు, బీన్స్, మాంసం, చేపలు, డ్రై ఫ్రూట్స్ తింటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.

3. ఫోలిక్ యాసిడ్

మన శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారవ్వాలంటే అందుకు విటమిన్ బి అవసరం. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఆకుపచ్చని కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు, పల్లీలు, అరటిపండ్లు, లివర్ తదితర ఆహారాల్లో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది.

4. దానిమ్మ

దానిమ్మ పండ్లలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి. శరీరానికి పోషణను అందిస్తాయి.

5. ఖర్జూర పండ్లు

ఖర్జూర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే రక్తం, తద్వారా హిమోగ్లోబిన్ కూడా పెరుగుతాయి. అయితే మధుమేహం ఉన్న వారు వీటిని తినరాదు.

6. బీట్‌రూట్

బీట్‌రూట్‌లోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతోపాటు పొటాషియం, ఫైబర్ కూడా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో రక్తం, హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. రోజువారీ ఆహారంలో బీట్‌రూట్‌ను భాగం చేసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

7. గుమ్మడికాయ విత్తనాలు

వీటిలో క్యాల్షియం, మెగ్నిషియం, మాంగనీస్, ఐరన్‌లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తింటుంటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

8. పుచ్చకాయలు

పుచ్చకాయల్లో ఉండే ఐరన్, విటమిన్ సిలు మన శరీరం ఎక్కువగా ఐరన్‌ను శోషించుకునేలా చేస్తాయి. ఇలా చేయడం వల్ల మన శరీరంలో హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.

6743

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles