లిచి పండ్లు తెలుసా..? వాటిని తింటే కలిగే అద్భుతమైన లాభాలివే..!


Mon,June 11, 2018 03:07 PM

ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే లిచి పండ్లు ప్రస్తుతం మనకు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. రహదారులపై వీటిని పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. అయితే ఈ పండ్ల గురించి చాలా మందికి తెలియదు. వీటిని చైనాలో ఎక్కువగా పండిస్తారు. కానీ ఇప్పుడీ పండ్లు మన దగ్గర కూడా లభిస్తున్నాయి. ఈ క్రమంలో లిచి పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. లిచి పండ్లను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. తెల్ల రక్త కణాల పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో శరీరంలోకి బాక్టీరియాలు, వైరస్‌లు ప్రవేశించినా వెంటనే నాశనం అవుతాయి.

2. జీర్ణసమస్యలతో సతమతమయ్యే వారు లిచి పండ్లను తమ ఆహారంలో భాగం చేసుకుంటే ఫలితం ఉంటుంది. పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్దకం పోతుంది. అలాగే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం ఎక్కువగా గ్రహించేలా చేస్తుంది.

3. హైబీపీ సమస్య ఉన్నవారు లిచి పండ్లను తింటే గుణం కనిపిస్తుంది. ఈ పండ్లలో సమృద్ధిగా ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. శరీరంలో ద్రవాలను సమతుల్యంలో ఉంచుతుంది. దీంతో మెటబాలిజం క్రమబద్దీకరించబడుతుంది. అలాగే రక్తనాళాల్లో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో గుండె పనితీరు సక్రమంగా ఉంటుంది.

litchi

4. లిచి పండ్లలో ఉండే కాపర్, ఐరన్‌లు శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. ఫలితంగా రక్తం పెరుగుతుంది. అలాగే శరీరంలో కణాలకు ఆక్సిజన్ ఎక్కువగా లభిస్తుంది. దీంతో రక్తసరఫరా మెరుగుపడుతుంది.

5. వయస్సు మీద పడడం కారణంగా చర్మంపై ముడతలు రావడం సహజమే. అయితే ఇలా ముడతలు రావడం తగ్గాలంటే అందుకు లిచి పండ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. లిచి పండ్లను తినడం వల్ల వాటిల్లో ఉండే విటమిన్ సి చర్మంపై ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా చర్మం ఎప్పుడూ యవ్వనంగా ఉంటుంది. ముడతలు రాకుండా ఉంటాయి.

6. అధిక బరువును తగ్గించడంలోనూ లిచి పండు అమోఘంగా పనిచేస్తుంది. లిచి పండ్లలో ఉండే ఫైబర్ కొవ్వును కరిగించేందుకు దోహదపడుతుంది.

7. మెగ్నిషియం, కాపర్, పాస్ఫరస్, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు లిచి పండ్లలో ఉన్నందున ఈ పండ్లు ఎముకలకు దృఢత్వాన్నిస్తాయి. ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి.

5498

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles