సీజనల్ వ్యాధులకు వంటింటి ఔషధాలు..!


Mon,August 6, 2018 04:03 PM

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. సీజనల్ వ్యాధులు ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అన్నట్లు చూస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో అధికశాతం మందికి జలుబు, ఫ్లూ, దగ్గు, ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. వాతావరణం చల్లగా ఉండడం వల్ల బాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెంది మనకు అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి. అయితే వాటికి చెక్ పెట్టాలంటే ముందుగానే మనం జాగ్రత్త తీసుకోవాలి. మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అల్లం
మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో అల్లం బాగా పనికొస్తుంది. జలుబుకు మన పెద్దలు ఎప్పటి నుంచో అల్లంను వాడుతూ వస్తున్నారు. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఫ్లూ, రుతు సమస్యలు, తలనొప్పి, కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి. కనుక ఈ సీజన్‌లో అల్లంను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలను రాకుండా చూసుకోవచ్చు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

2. పెరుగు
కేవలం వర్షాకాలంలోనే కాదు, ఇతర కాలాల్లోనూ పెరుగును తీసుకోవాల్సిందే. ప్రొబయోటిక్, ప్రిబయోటిక్ ఆహారాలను ఏడాది మొత్తం తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఈ ఆహారాలు జీర్ణాశయంలో ఉండే మంచి బాక్టీరియాను పెంచుతాయి. దీని వల్ల శరీర సహజ సిద్ధమైన రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

3. పసుపు
రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో చిటికెడు పసుపు కలుపుకుని రోజూ తాగాలి. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. పసుపులో సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగాలను రాకుండా అడ్డుకుంటాయి.

4. నిమ్మకాయలు
నిమ్మకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది బాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను అడ్డుకుంటుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో టీస్పూన్ నిమ్మరసం, తేనె కలిపి రోజూ తాగుతుంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

5. మిరియాలు
నల్ల మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగాలు రాకుండా చూస్తాయి. ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. నిత్యం నల్ల మిరియాలను ఏదో ఒక విధంగా ఆహారంలో చేర్చుకుంటే ఫలితం ఉంటుంది.

1437

More News

VIRAL NEWS