వేసవిలో రోజూ 200 గ్రాముల పెరుగు తినాల్సిందే. ఎందుకో తెలుసా..?


Sun,March 11, 2018 05:39 PM

వేసవి వచ్చిందంటే చాలు.. చాలా మంది తమ శరీరాలను కూల్ చేసుకునే పద్ధతుల గురించి ఆలోచిస్తుంటారు. దంచి కొట్టే ఎండల నుంచి ఉపశమనం పొంది శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు యత్నిస్తారు. అందులో భాగంగానే అనేక రకాల మార్గాలను వారు ఫాలో అవుతారు. అయితే ముఖ్యంగా చాలా మంది వేసవిలో ఆసక్తిగా తీసుకునే ఆహారం పెరుగు. దీన్ని ఈ సీజన్‌లో రోజూ 200 గ్రాముల వరకు ప్రతి ఒక్కరు తినాలి. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వేసవిలో జీర్ణవ్యవస్థ పనితీరు అస్తవ్యస్తమవుతూ ఉంటుంది. తిన్న ఆహారం త్వర త్వరగా జీర్ణం కావడం లేదంటే అసలు జీర్ణం కాకపోవడం, మలబద్దకం ఏర్పడడం లేదంటే నీళ్ల విరేచనాలు అవడం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తుంటాయి. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే రోజూ పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో పలు ఆహార పదార్థాల ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్లు, శరీరంలో ఉత్పన్నమయ్యే వేడి తగ్గుతాయి. ఈ క్రమంలో జీర్ణ సమస్యలు కూడా పోతాయి.

2. పెరుగు వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. దీంతో ఈ సీజన్‌లో సహజంగా కలిగే ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు. జీర్ణాశయం, పేగుల్లో మంచి బాక్టీరియా పెరిగి చెడు బాక్టీరియా పోతుంది. ఇది వ్యాధులకు అడ్డుకట్ట వేస్తుంది.

3. వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే రోజూ పెరుగు తినాలి. ఇది శరీరంలో ద్రవాలను నియంత్రణలో ఉంచుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది. మన శరీరానికి అవసరం అయ్యే ముఖ్యమైన పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తుంది.

4. వేసవిలో చాలా మంది డయేరియా బారిన పడుతుంటారు. ఇందుకు చక్కని పరిష్కారం పెరుగు. పెరుగును తింటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

5. వేసవిలో ఎవరైనా ఎండలో కొంత సేపు తిరిగితే తీవ్రమైన అలసటకు గురవుతారు. నీరసంగా అనిపిస్తుంది. అలాంటి వారు పెరుగు తింటే తక్షణ శక్తి లభించి యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. శరీరంలో ఉండే వేడి పోయి చల్లదనం వస్తుంది.

10908

More News

VIRAL NEWS