భోజనం చేశాక తినాల్సిన పండ్లు ఇవే..!


Mon,August 6, 2018 01:48 PM

మనలో చాలా మందికి భోజనం చేశాక గ్యాస్ రావడం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే అందుకు మనకు అందుబాటులో ఉండే పలు పండ్లు చక్కని పరిష్కారాన్ని చూపుతాయి. భోజనానంతరం కొన్ని పండ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు కూడా పోతాయి. మరి భోజనం చేశాక మనం తినాల్సిన ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. యాపిల్
ఈ పండ్లలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలున్నవారు భోజనం చేశాక యాపిల్‌ను తినడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా ఆ సమస్యలన్నీ దూరమవుతాయి. భోజనం చేశాక కనీసం 15 నిమిషాల తరువాత ఈ పండును తినాలి. సన్నగా ముక్కలుగా కట్ చేసి తింటే మంచిది.

2. అరటి పండ్లు
ఆరోగ్యం బాగాలేనప్పుడు భోజనానంతరం తప్పనిసరిగా అరటి పండును తీసుకోవాలి. దీని వల్ల శక్తి లభిస్తుంది. తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది.

3. బొప్పాయి
కొందర్ని అజీర్తి సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. అలాంటి వారికి బొప్పాయి పరిష్కారం సూచిస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కావల్సిన శక్తి కూడా అందుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. అనారోగ్య సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు బొప్పాయిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

4. పైనాపిల్
ఉదర సంబంధిత సమస్యలున్నవారు పైనాపిల్ పండుని ఎక్కువగా తినాలి. దీన్ని తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దీంట్లో ఉండే బ్రొమెలిన్ అనే ఎంజైమ్ జీర్ణాశయ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.

5. అంజీర్
అంజీర్ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్ర పరిచి వ్యర్థాలను బయటకు పంపుతుంది. మిగతా సమయాల్లోనూ అంజీర్‌ను తీసుకోవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల తక్షణమే శక్తి కూడా లభిస్తుంది.

5941

More News

VIRAL NEWS