చలికాలంలో వెచ్చగా ఉండాలా..? వీటిని తీసుకోండి..!


Tue,December 5, 2017 02:13 PM

చలి పులి విజృంభిస్తున్నది. ఇంకా డిసెంబర్ చివరి వారం కూడా రాలేదు. అయినప్పటికీ చలి ఎముకలు కొరికేస్తున్నది. ఇలాంటి చలిలో వెచ్చగా ఉండేందుకు జనాలు నానా అవస్థలు పడుతున్నారు. ఉదయం 11 గంటలు అవుతున్నప్పటికీ చలి తీవ్రత తగ్గడం లేదు. దీంతో శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రజలు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా కింద ఇచ్చిన పదార్థాలను రోజూ తీసుకుంటే చాలు, దాంతో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. మరి ఆ పదార్థాలు ఏమిటంటే...

1. పసుపు


రోజూ ఉదయం, సాయంత్రం ఒక గ్లాస్ పాలలో 1/4 టీస్పూన్ పసుపును కలిపి తాగాలి. దీంతో శరీర మెటబాలిజం ప్రక్రియ పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో వెచ్చదనం పెరుగుతుంది. ఇది చలి నుంచి రక్షణనిస్తుంది. అంతేకాదు ఇలా చేయడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు.

2. అల్లం


ఉదయం, రాత్రి భోజనం చేసేముందు ఒక టీస్పూన్ అల్లం రసం సేవిస్తే చాలు. దాంతో శరీరంలో వేడి పెరుగుతుంది. దీని వల్ల చలి బారి నుంచి తప్పించుకోవచ్చు. అల్లం రసం తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా ఈ కాలంలో వచ్చే శ్వాస కోశ సమస్యల నుంచి బయట పడవచ్చు.

3. తేనె


ఉదయాన్నే ఒక గ్లాస్ వేడి నీటిలో 1 టీస్పూన్ తేనె కలుపుకుని తాగితే శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. ఫలితంగా ఒంట్లో వేడి పెరుగుతుంది. చలి నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అధిక బరువు తగ్గుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

4. దాల్చినచెక్క


ఒక గ్లాస్ వేడి నీటిలో 1/4 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగితే శరీరంలో వెచ్చదనం పెరుగుతుంది. చలి నుంచి తప్పించుకోవచ్చు. దీంతో శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
winter-foods

5. నువ్వులు


శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో నువ్వులు కూడా బాగానే పనిచేస్తాయి. రెండు రోజులకు ఒకసారి నువ్వుల నూనెతో శరీరాన్ని బాగా మర్దనా చేసుకుని వేడి నీటితో స్నానం చేయాలి. దీంతో శరీరంలో వేడి పెరుగుతుంది. చలి నుంచి రక్షణ లభిస్తుంది. అధిక బరువు తగ్గుతారు. నువ్వుల నూనెను వాడలేకపోతే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తిన్నా చాలు, ఇదే ఫలితాలు కలుగుతాయి.

6. డ్రై ఫ్రూట్స్


కిస్‌మిస్, ఆప్రికాట్స్, అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్‌తోపాటు బాదంపప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి గింజలను తిన్నా శరీరంలో వేడిని పెంచుకోవచ్చు. చలి నుంచి రక్షణ లభిస్తుంది.

7. కుంకుమ పువ్వు


ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు కుంకుమ పువ్వు వేసి ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగితే శరీరంలో వెచ్చదనం పెరుగుతుంది.

8. కోడిగుడ్లు


కోడిగుడ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకున్నా చాలు. శరీరానికి శక్తి అందుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. ఒళ్లు వెచ్చగా ఉంటుంది. చలి నుంచి రక్షణ లభిస్తుంది.

9. నల్ల మిరియాలు


నల్ల మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వెచ్చదనాన్ని పెంచుతాయి. రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో 1/2 టీస్పూన్ నల్ల మిరియాల పొడిని కలుపుకుని తాగితే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు.

10. వేడి సూప్స్


ఈ కాలంలో వేడి వేడిగా ఉండే వెజిటబుల్ సూప్స్ తాగినా చలి బారి నుంచి తప్పించుకోవచ్చు.

9441

More News

VIRAL NEWS