రివ్యూ: గద్దలకొండ గణేష్‌

Fri,September 20, 2019 02:21 PM

తారాగణం: వరుణ్‌తేజ్‌, అధర్వమురళీ, పూజాహెగ్డే, మృణాళిని రవి, తనికెళ్ల భరణి, సత్య, రచ్చ రవి, సుబ్బరాజు తదితరులు..
సినిమాటోగ్రఫీ: ఐనాంకబోస్‌
సంగీతం: మిక్కీ జే మేయర్‌
స్క్రీన్‌ప్లే: మధుశ్రీనివాస్‌, మిథున్‌చైతన్య
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపి ఆచంట
నిర్మాణ సంస్థ: 14రీల్స్‌ప్లస్‌
మాటలు, దర్శకత్వం: హరీష్‌శంకర్‌


కెరీర్‌ ఆరంభం నుంచి కథాంశాల ఎంపికలో కొత్తదనానికి, వైవిధ్యతకు ప్రాధాన్యతనిస్తున్నారు వరుణ్‌తేజ్‌. ‘ఫిదా’‘తొలిప్రేమ’ వంటి ప్రేమకథలు ఆయనలోని రొమాంటిక్‌ పార్శాన్ని ఆవిష్కరించాయి. గత సినిమాలకు భిన్నంగా ‘గద్దలకొండ గణేష్‌' చిత్రం ద్వారా మాస్‌ బాటను ఎంచుకున్నారు వరుణ్‌తేజ్‌. తమిళంలో కమర్షియల్‌గా విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంలందుకున్న ‘జిగర్తాండ’ రీమేక్‌ ఇది. యాక్షన్‌, మాస్‌ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరున్న హరీష్‌శంకర్‌ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడంతో మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. కొన్ని వర్గాల అభ్యంతరం మేరకు ‘వాల్మీకి’గా పేరున్న ఈ సినిమా టైటిల్‌ను చివరి నిమిషంలో ‘గద్దలకొండ గణేష్‌' గా మార్పు చేశారు. తన రెగ్యులర్‌ పంథాకు భిన్నంగా వరుణ్‌తేజ్‌ చేసిన ఈ ప్రయత్నం ఎంత వరకు సత్ఫలితాన్నిచ్చింది? తమిళ రీమేక్‌కు హరీష్‌శంకర్‌ ఎంతవరకు న్యాయం చేశాడు? ‘మాస్‌ సినిమాలు చేయడంలో కిక్కే వేరంటూ..’ ప్రచార సందర్భంలో పదేపదే చెప్పిన వరుణ్‌తేజ్‌ ఈ సినిమాతో తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడా? ఈ విషయాలన్ని తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

కథ గురించి...
అభిలాష్‌ (అధర్వమురళీ) సినీ పరిశ్రమలో సహాయ దర్శకుడిగా పనిచేస్తుంటాడు. గొప్ప దర్శకుడిగా ఎదగాలన్నది అతని కోరిక. ఓ షూటింగ్‌ సందర్భంగా ఎదురైన అవమానంతో నిజజీవితంలో రౌడీ జీవితాన్ని రాసుకొని అదే కథతో సినిమా తీయాలనుకుంటాడు. గద్దలకొండ అనే గ్రామానికి వచ్చి అక్కడ పవర్‌ఫుల్‌డాన్‌గా ఉన్న గద్దలకొండ గణేష్‌ జీవితాన్ని దగ్గరి నుంచి గమనిస్తుంటాడు. అతను చేసే నేరాల గురించి తెలుసుకుంటూ తన సినిమాకు గణేష్‌ జీవితమే కథాంశమని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో గణేష్‌ జీవితం గురించి అభిలాష్‌ తెలుసుకున్న నిజాలేమిటి? భయంకరమైన రౌడీషీటర్‌ గణేష్‌ జీవితంలోకి ప్రవేశించిన అభిలాష్‌ ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు? చివరకు దర్శకుడిగా తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు? అతని సినిమాలో హీరోగా నటించిందెవరు? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానంగా మిగతా చిత్ర కథ నడుస్తుంది..

కథా విశ్లేషణ..
ఓ కరడుగట్టిన డాన్‌ కాలక్రమంలో మనుషుల విలువ, ప్రేమ గొప్పతనం తెలుసుకొని ఎలా మంచివాడుగా పరివర్తనం చెందాడన్నదే ఈ సినిమా ద్వారా చెప్పదలచుకున్న పాయింట్‌. దీనికి ఫక్తు వాణిజ్య అంశాల్ని మేళవించి రౌడీయిజమ్‌, సినిమా అనే ఛట్రంలో కథను అల్లుకోవడం కొత్త ఫీల్‌ను తీసుకొచ్చింది. తమిళ మాతృకను యథాతథంగా తీసుకోకుండా తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేశారు దర్శకుడు హరీష్‌శంకర్‌. ముఖ్యంగా వరుణ్‌తేజ్‌ పాత్ర చిత్రణపై ఎక్కువ దృష్టిపెట్టారు. ప్రథమార్థంలో మంచి వినోదం పండింది. డాన్‌ గణేష్‌ అనుచరుల్ని బుట్టలో వేసుకునే ప్రయత్నంలో అధర్వమురళీ, సత్య పాత్రలు చేసే విన్యాసాలు చక్కటి హాస్యాన్ని పంచాయి.

సినిమా ఆసాంతం గద్దలకొండ గణేష్‌ పాత్రను ఫెరోషియస్‌గా ప్రజెంట్‌ చేశారు. తమిళ మాతృకలో డాన్‌ పాత్రను పోషించిన బాబీసింహాను చివరకు కమెడియన్‌గా చూపిస్తారు. కానీ ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ైక్లెమాక్స్‌లో మార్పులు చేశారు. సెకండాఫ్‌లో మదర్‌సెంటిమెంట్‌ వంటి అంశాలతో ఎమోషనల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. గణేష్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో శ్రీదేవి (పూజాహెగ్డే)తో నడిచిన ప్రేమకథ రెట్రోఫీల్‌తో ఆకట్టుకుంది. ‘దేవత’ సినిమాలో ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ పాటను దాదాపు అదే ఫీల్‌తో పునఃసృష్టించడం గొప్పగా అనిపిస్తుంది. మరోసారి రాఘవేంద్రరావు పాటను చూస్తున్నామనే భావన కలిగేలా ఆ గీతాన్ని అద్భుతంగా దృశ్యమానం చేశారు. ప్రథమార్థంలో వినోదానికి పెద్దపీట వేసిన హరీష్‌శంకర్‌ సెకండాఫ్‌లో కాస్త మోతాదు తగ్గించారనే భావన కలుగుతుంది. ముఖ్యంగా ైక్లెమాక్స్‌ ఘట్టాలు సాగతీసినట్లుగా అనిపిస్తాయి. సినిమా రన్‌టైమ్‌ను కొద్దిగా తగ్గిస్తే బాగుండేది.

మాస్‌ కథాంశాల్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తుంటారు హరీష్‌శంకర్‌. ముఖ్యంగా వినోదాత్మక ఎపిసోడ్స్‌లో ఆయన మార్క్‌ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమాలో కూడా యాక్టింగ్‌ ట్రైయినింగ్‌ పేరుతో బ్రహ్మాజీ గురువుగా పండించిన హాస్యం హైలైట్‌గా అనిపిస్తుంది. ఈ కథలో ‘సినిమాకథ’ ఓ భాగం కాబట్టి పదునైన సంభాషణలతో చిత్రసీమపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు హరీష్‌శంకర్‌. ముఖ్యంగా తనికెళ్ల భరణి పాత్ర ద్వారా సినిమా గొప్పతనాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేశాడు.‘నిలిచేది..నిలెబెట్టేది సినిమానే’ ‘సినిమా డబ్బు, పేరునే కాదు..ప్రేమను తీసుకొస్తుంది’ ‘దీనమ్మ జీవితంలో సుఖంగా బ్రతకాలనుకునేవారు. ఇప్పుడు సుఖంగా చస్తే చాలనుకుంటున్నారు’ వంటి సంభాషణలు హృదయాన్ని తాకుతాయి. తమిళ మాతృకతో పోల్చకుండా చూస్తే ‘గద్దలకొండ గణేష్‌'ను స్ట్రెయిట్‌ సినిమా అనే భావనతో చూస్తే ఫర్వాలేదనిపిస్తుంది. తమిళ మాతృకను తెలుగు ప్రేక్షకుల అభిరుచిరి అనుగుణంగా రీమేక్‌ చేయడంలో దర్శకుడు హరీష్‌శంకర్‌ కృతకృత్యుడయ్యారు. అయితే కథాగమనంలో చాలా లాజిక్‌లు మిస్సయ్యాయనే భావన కలుగుతుంది.

నటీనటుల పర్‌ఫార్మెన్స్‌..
ఈ సినిమాను వరుణ్‌తేజ్‌ వన్‌మెన్‌షోగా అభివర్ణించవొచ్చు. గద్దలకొండ గణేష్‌గా పవర్‌ఫుల్‌ డాన్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం అనిపిస్తుంది. ఆహార్యం మొదలుకొని, డైలాగ్‌ డెలివరీ వరకు ప్రతి అంశంతో వరుణ్‌తేజ్‌ కొత్త కోణంలో కనిపించాడు. తెలంగాణ యాసలో పలికించిన సంభాషణలు అలరించాయి. ఈ సినిమా ఆయనకు మాస్‌ ఇమేజ్‌ను తీసుకురావడమే కాకుండా నటుడిగా మరో మెట్టుఎక్కిస్తుందనడం అతిశయోక్తికాదు. ఇక దర్శకుడిగా అభిరామ్‌ పాత్రకు అధర్వమురళి చక్కగా సరిపోయాడు. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో పూజాహెగ్డే తన అందచందాలతో అలరించింది. ఆమె పాత్ర కొద్దిసేపే అయినా ప్రభావవంతంగా తీర్చిదిద్దారు. మరోనాయిక మృణాళిని ఫర్వాలేదనిపించింది. తనికెళ్లభరణి కొన్ని సీన్లలో కనిపించినా భావోద్వేగంతో హృదయాల్ని స్పృశించారు. సత్య, బ్రహ్మాజీ పాత్రలు మంచి వినోదాన్ని పండించాయి. మిగతా నటీనటులందరూ తమ పరిధుల మేరకు బాగానే నటించారు.
ఇక సాంకేతికంగా అన్ని అంశాల్లో ఉన్నతంగా అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇంప్రెసివ్‌గా ఉంది. ముఖ్యంగా గద్దలకొండ గణేష్‌ కనిపించినప్పుడు వచ్చే సిగ్నేచర్‌ బీజీఎమ్‌ బాగుంది. కెమెరా కథానుగుణంగా డార్క్‌లైటింగ్‌, మూడ్‌తో సరికొత్త ఫీల్‌ను అందించింది. నిర్మాణ విలువలు అగ్రశ్రేణిలో ఉన్నాయి. దర్శకుడు హరీష్‌శంకర్‌ మరోసారి తనదైన మార్క్‌ను ప్రదర్శించారు. దర్శకుడిగానే కాకుండా రచయితగా బలమేమిటో చూపించారు.

వరుణ్‌తేజ్‌ పాత్రను శక్తివంతంగా, కొత్తకోణంలో ఆవిష్కరించడంలో సక్సెస్‌ అయిన దర్శకుడు హరీష్‌శంకర్‌...తమిళ మాతృకలోని ఫీల్‌ని మాత్రం ఎక్కడో మిస్‌ చేశారని అనిపించింది. అయితే వరుణ్‌తేజ్‌ క్యారక్టరైజేషన్‌, చక్కటి వినోదం సినిమాకు బలంగా నిలిచాయి. ‘గద్దలకొండ గణేష్‌' బాక్సాఫీస్‌ రేసులో ఎంతవరకు నిలబడతాడో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వేచిచూడాల్సిందే..

రేటింగ్‌: 2.75/5

11717
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles