ఉస్మానియా బిస్కట్లు

Mon,September 10, 2018 01:02 AM

Te
తుంపురు తంపురు వర్షం
సన్న జాజుల్లా రాలుతోంది
మంద గమనంగా నల్లమబ్బులు
మందలు మందలుగా ఇళ్ళమీద నడుస్తున్నాయి.
అద్దం దగ్గరి చల్లని కిటికీలో
ఒంటరి టేబుల్ వద్ద కూర్చున్నాను
తడిసిన జనాలతో
హోటల్ నిండిపోకముందే
సగం దుస్తులు వెచ్చగా వున్నప్పుడే
సందుల్లో గొందుల్లోంచి బండేసుకొని రారా!
గడియారంలో పొద్దును వెదుకుతూ
అగర్‌బత్తీలు చెక్కిన గోడల్లోని
సువాసనలు చూస్తున్నాను
గుబాళింపు ఎగిరిపోకముందే
వెచ్చనవుదాము రారా!
వేళ్ళకు పుప్పొడి అంటుకొనే
ఉస్మానియా బిస్కెట్లు
మజా దొంతరలున్నాయి
పాన్ బీడాల్లా మడిచి చేసిన
సమోసాల కరకరలు ఉసిగొలుపుతున్నాయి
వేడివేడి మంచు లేచే
మోటా ఇరానీ చాయ్ పొగలు లేస్తోంది
సాసర్లో అలలు వొంపుకొని
ఒక్కొక్క గుక్కను
మ్యూజిక్‌లా చప్పరిస్తూ
వానాకాలం రుచి చూద్దాం రారా!
బయట చినుకులు పడుతుంటే
రిచా శర్మ పాటలా
మనసు మారు మోగుతోంది
అలలు గలగలలు దొర్లినట్టు
ఆమె పాడేటి గజల్ రిథంలా
నీటి బుడగలు పగిలి నేలమీద
తెలియని రాగాలు పలుకుతున్నాయి
ఇంతమంచి ఇంతజాం చేసినట్టున్న
ఇరానీ హోటల్ మర్యాదలోకి
చిరునవ్వుతో సలాంచేసి రారా!
నీరెండ జారినట్టు చాయ్ చల్లారిపోతుందేమో
వీణతీగలు తెగినట్టు వాన ఆగిపోతుందేమో
మెలకువొచ్చి కల ఎగిరిపోయినట్టు
రిచా శర్మ వెళ్లిపోతుందేమో
తడి తడి ముఖాన్ని తుడుచుకోకుండా
తళుకుమనే చినుకులా రారా!
చెట్టుమీద వాలిన పిట్టలా
నేను వచ్చి చాలా సేపయింది
నాకు విసుగురాకముందే రారా!
వానాకాలం చిలిపితనాన్ని చూద్దాం!
- ఆశారాజు, 93923 02245
(చిక్కని ఇరానీ చాయ్‌ని మోటా చాయ్ అంటారు.రిచాశర్మ ఒక సూ ఫీ సింగర్, ఈమె గజల్స్ కూడా అద్భుతంగా పాడుతుంది. విశిష్టమైన గొంతుతో శ్రోతలను కట్టిపడేస్తుంది)

242
Tags

More News

VIRAL NEWS