సామాజిక దర్పణం ఏ వెలుగులకీ ప్రస్థానం

Mon,August 3, 2015 04:39 AM

తెలుగు నవలా సాహిత్యాన్ని అద్భుత రచనలతో సంపన్నం చేసిన నవలాకారుడు అంపశయ్య నవీన్. ఆయన రాసిన మొదటి రచనతోనే పాఠకుల ఆదరాభిమానాలను చూరగొనడమే కాకుండా ఆ అంపశయ్య అనే నవలే, ఆయనకు ఆధార్‌కార్డులా మారడం సాహిత్య రంగంలో అరుదైన విషయం. నవీన్ ఇప్పటి వరకు 31నవలలు రాశా రు. సామాజిక సమస్యల్ని వస్తువుగా తీసుకొని వాటిని విశ్లేషిస్తూ సమకాలీనానికి సార్వజనీనానికి ప్రాసంగికత ఉండేలా చర్చించడం ఆయన ప్రత్యేకత. నవీన్ అనగానే అంపశయ్య, ముళ్ల పొదలు, అంతస్రవంతి వంటి సీక్వెల్ నవలలతో పాటు కాలరేఖలు, చెదిరిన స్వప్నాలు, బాంధవ్యాలు, తాజాగా వెలువరించిన ఏ వెలుగులకీ ప్రస్థానం కూడా సీక్వెల్ నవలే. ముఖ్యంగా 1944లో భువనగిరిలో జరిగిన పదకొండో ఆంధ్ర మహాసభ నుంచి నేటివరకు తెలంగాణ సామాజిక చిత్రాన్ని విశ్లేషిస్తూ ఆయన ఈ నవలలు రాశారు. నవీన్ రాసిన కాలరేఖలు నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1975లో కేంద్ర ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి, దాని దుష్పరిణామాలను వివరిస్తూ అదేకాలంలో చీకటిరోజులు పేరుతో నవల రాశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నలభై ఏళ్లు అవుతున్న సందర్భంలో ఆ నవలకు ప్రాముఖ్యం ఉందనుకుంటున్నాను. కాగా 1991లో పీవీ నర్సింహారావు ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరళీకృత ఆర్థిక విధానాలు, సంస్కరణల ప్రభావం, ప్రపంచీకరణ పేరుతో అతలాకుతలమవుతున్న సామాజిక జీవితాన్ని సమగ్రంగా, శాస్త్రీయంగా విశ్లేషిస్తూ నవీన్ రాసిన తాజా నవల ఏ వెలుగులకీ ప్రస్థానం.

ఈ నవలలో సగటు మనిషి బతుకు చిత్రపటం ఎలా ఉందో చక్కగా వివరించాడు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో సోషలిస్టు వ్యవస్థ స్థాపనే ధ్యేయంగా సాగిన నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాలు పారిశ్రామికాభివృద్ధి, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణా తీరుతెన్నులు పెట్టుబడిదారీ వర్గ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు వెరసీ క్రమంగా బలహీనపడుతూ, పరుస్తూ కృత్రిమమమైన అనివార్యతను సృష్టించి నూతన ఆర్థిక విధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. మొదట గాలి కోసం కిటికీలను తెరిస్తే ఇప్పుడు తలుపులు బార్లా తెరిచారు. రోట్లో తలపెట్టి రోకటి పోటుకు వెరువగునా? అన్నట్లున్నది ప్రస్తుత పరిస్థితి.

ఈ నేపథ్యంలో నవీన్ రాసిన ఈ నవల ఎన్నో అంశాలను ప్రస్తావిస్తున్నది. భారతదేశం ప్రధానంగా వ్యవసాయిక దేశం. అందునా ఎక్కువగా వర్షాధారమైన వ్యవసాయం. వరి ప్రధాన పంట. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు రైతులకు విత్తనాలు, ఎరువులు మొదలైన అవసరాలకు సబ్సిడీ బ్యాంకుల్లోను లభించేవి. కానీ ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందాల మూలంగా అంతర్జాతీయ లావాదేవీల పేరుతో ఆంక్షలు ఎత్తివేయటం వలన దేశ విదేశాలనుంచి నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, మందులు సరఫరా జరగడం, రైతు పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర లభించకపోవడం, ఉత్పత్తి ఖర్చు మితిమీరడం, ఫలితంగా తెచ్చిన బ్యాంకుల అప్పులు తీర్చలేకపోవడం వల్ల రైతు ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయి. ఈ విషయాలన్నింటిని నవలలోని కథానాయకుడు నరేందర్ పాత్ర ద్వారా చెప్పిస్తాడు. ఒకప్పుడు మధ్య తరగతికి గగన కుసుమంలా తోచే టూ వీలర్స్, టీవీ సెట్స్, సెల్‌ఫోన్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు, కార్లు మొదలైనవి అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకులు భూమిపుత్రులకు లోన్లు ఇవ్వ డం కంటే మధ్యతరగతికి చెందిన ఉద్యోగ వర్గాలను ఆకర్షిస్తూ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ పేరుతో రుణాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి.

దేశంలోని మధ్యతరగతి వర్గమే బహుళజాతి కంపెనీలకు ఆహారం. అవి కల్పించే రాయితీలు, ప్రోత్సాహాకాలు కేవలం ఎర మాత్రమే. మీడియాకు కూడా రాజకీయ, ఆర్థిక, ప్రయోజనాలుండడం వలన వాస్తవా లు తెలిసినా, తెలియజెప్పాల్సిన బాధ్యత ఉన్నా తెలియజెప్పడం లేదు. అందుకే దారిద్య్రరేఖకు దిగువన ముప్ఫై ఐదు శాతం ప్రజలు మగ్గుతున్నా వారి ఊసే లేకుండా చేస్తున్నారు. ప్రపంచీకరణ, అంతర్జాతీయ ఉపాధి అవకాశాల పేరు తో ఎన్నో విద్యా సంస్థలు వచ్చాయి. విద్యా, వైద్య రంగాలు వ్యాపార కేంద్రాలయ్యాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు, ఆస్పత్రులు నామమాత్రమయ్యాయి. ప్రభుత్వరంగంలోని విద్యాసంస్థలలో నియామకాలు లేక చచ్చుబడిపోతున్న తరుణంలోనే మరోవైపు కేజీ నుంచి పీజీ దాకా కార్పొరేటు రంగంలో విద్యాసంస్థలు, వైద్యసంస్థలు వెలిశాయి. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వలన గ్రామీణ పేద రైతాంగం తమకున్న కొద్దోగొప్పో భూమిని అమ్ముకొని తమపిల్లల్ని పట్టణాలలో చదివించాలనుకుంటున్నారు. గ్రామాలలో ఉపాధి అవకాశాలు లేక రైతు లు, వివిధ కులవృత్తుల వారు పట్టణప్రాంతాలకు వలసబాట పట్టారు.

ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు వచ్చాక ఎక్కడ చూసినా కూలిపోయిన ఇండ్లు, గోడలు దర్శనమిస్తున్నాయి. గ్రామాలలో బతుకులేదని, ప్రభు త్వ పాఠశాలల్లో చదువు రాదని, సర్కారు దవాఖానాకు పోతే ప్రాణం నిలవదనే అభిప్రాయం ప్రజల్లో బాగా ప్రబలి ప్రజాస్వామ్యస్ఫూర్తిని ఉనికిని ప్రశ్నిస్తున్నది. ముఖ్యంగా రష్యాలో సోషలిస్టు వ్యవస్థ కుప్పకూలడం వల్ల అమెరికా పెట్టుబడిదారీ విధానానికి సామ్రాజ్యవాదానికి అడ్డూ, అదుపూ లేకుండాపోయిందని, అందుకే మోనార్క్ లా వ్యవహరిస్తుందని రచయిత నరేందర్ పాత్ర ద్వారా చెప్పిస్తాడు. సాంకేతి క విప్లవం కారణంగా వచ్చిన కంప్యూటర్, ఇంటర్నెట్ కారణంగా తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా యువతీ, యువకులు కనీసం ఒకరినొకరు చూసుకోకుండా చాటింగ్‌ల ద్వారా ప్రేమలో పడడం పెళ్లిళ్లు చేయమ ని ఒత్తిడి చేయడం ఆర్థికస్వేచ్ఛ, హద్దుమీరిన విశృంఖలత్వం వల్ల విడిపోవడం, మళ్లీ మరోకొత్త జీవితానికి తెరలేపడం అనేది శ్రీకాంత్-శ్రావ్యల జీవితాల ఆధారంగా రచయిత చిత్రించారు. గొంగట్లో భోంచేస్తూ వెంట్రుకలు వస్తున్నానుకుటే ఎంత పొరపాటో ఆధునికత పేర వెర్రితలలు వేస్తున్న యువత గ్లోబలైజేషన్ పేరుతో ఎన్ని ఆకృత్యాలకు పాల్పడుతున్నారో ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిపై దాని విషపరిణామాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి అరవింద్-రమ్యల జంటల వ్యవహారాన్ని చూస్తే తెలుస్తుంది.

మాతృత్వాన్ని ఒకశాపంగా భావించే తన అక్కకు కొడుకు పుట్టడం చూసి అలాంటి బాబును తాను కనాలని భర్తను ఒత్తడి చేయడం, స్పెర్మ్ లోపం కారణంగా భర్తద్వారా సంతానాన్ని పొందలేనని చెప్పి రమ్య శాడిస్టుగా మారి డోనర్ స్పెర్మ్‌తో కంటాననడం, అనాథ శరణాలయం నుంచి బాబును ఎడాప్షన్ తెచ్చుకుందామని అరవింద్ అనడం చివరకు గృహహింస చట్టంద్వారా అత్తగారి కుటుంబాన్ని రోడ్డుకీడ్చి రాజీ పేరుతో లక్షలాది రూపాయలు పిండుకొని మరొకరితో అమెరికాకు వెళ్లడం.. అంతా వినాశనం. నడమంత్రపుసిరి, నరం మీది పుండు ఒకమానాన ఉండనీయదన్నట్లు ఎల్‌పీజీ ప్రభావం వల్ల మన కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుంది. లివ్ ఇన్ రిలేషన్‌షిప్, వైఫ్ స్వాపింగ్, ఫోర్నోఫిలింస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, సరోగేట్ మదర్స్.. మొదలైనవన్నీ ఈ ప్రపంచీకరణ వికృత శిశువులే. ఇంజినీరింగు పట్టభద్రులకు అవకాశాలు మెరుగవుతున్నాయని చెబుతున్నా, అదొక భ్రమే. విదేశీపెట్టుబడులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సెజ్‌లు తల్లివేరు అయిన వ్యవసాయ రంగాన్ని, రైతాంగ జీవితాలను ఎలా బదాబదలు చేస్తున్నదో వివరించారు.

నరేందర్, రమణమూర్తి ఇద్దరూ ఒకే కాలేజీలో పనిజేసి రిటైరయిన లెక్చరర్లు ఒకరిది వామపక్ష భావజాల నేపథ్యమయితే మరొకరిది ప్రస్తు త ప్రభుత్వాల ఆర్థిక విధానాలను బలపరిచేది. రచయితగా నవీన్ ఈ రెండు పాత్రలను చిత్రించడంలో చక్కని నైపుణ్యాన్ని కనబరిచారు. అందువల్లే దేనివల్ల పూర్తి చెడుగాని, పూర్తి మంచిగాని జరగటం లేదనిపిస్తుంది అంటాడు. నవలలో అక్కడక్కడ సందర్భోచితంగా రాసిన వాక్యాలు భావాలను చిక్కపర్చాయి. ఉదాహరణకు ఎలా సంపాదించావన్నది ముఖ్యం కాదు.. ఎంత వేగంగా సంపాదించటమన్నదే ముఖ్యం. విద్యార్థులకు క్లాసులో కూర్చోవాలని లేదు. మా లెక్చరర్లకు చదువు చెప్పాలని లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరూ ఊహించనంతగా మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నది. కానీ మనిషి అంతరంగాన్ని మాత్రం మూర్చలేకపోతోంది. పేదరికాన్ని తొలగించాలంటే పేదవాడి ఉత్పాదకశక్తిని పెంచాలి. సౌకర్యాల విషయంలో లావుంది. హ్యూమన్ రిలేషన్స్ విషయంలో బాగోలేదు. రాజకీయ నాయకుల రెండు నాల్కల ధోరణి మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు.. అనే మొదలైన వ్యాక్యాలన్నీ సమకాలీన సమాజంలోని వాస్తవాలను వ్యాఖ్యానిస్తున్నవి. నవల సారాంశాన్నంతా నిగ్గుదేలుస్తూ మనిషి అంతరంగాన్ని మార్చే ఆవిష్కరణలన్నీ సైన్స్ ఏనాటికైనా కనిపెడుతుం దా? మనిషిని డబ్బు సంపాదించే యంత్రంగా మార్చేస్తున్న ఈ ఆర్థిక సంస్కరణలు మన సమాజాన్ని ఎక్కడకు తీసుకెళ్తాయి? అందుకు కాల మే సమాధానం చెప్పాలంటూ.. నవలను ముగిస్తాడు. ఎవరి వెలుగు లకీ ప్రస్థానమో తెలియనప్పుడు ఏ వెలుగులకీ ప్రస్థానం అన్న మహాకవి శ్రీశ్రీ మాటల్నే ప్రాసంగికతను కలిగియున్నామని నవీన్ ఈ నవలకు ఔచిత్యమైన పేరు పెట్టాడనిపిస్తుంది. రచయిత అనుభవం, అధ్యయనం, అవగాహన పాఠకులను ఆశ్చర్యపరచడమే గాక ఆలోచింపజేస్తుంది. ఆ ఆలోచన కోసం.. అనుభూతికోసం.. ఈ నవలను చదవాలి.

1192
Tags

More News

VIRAL NEWS