జింబో రెండక్షరాలు

Mon,September 1, 2014 01:07 AM

rendenkalaవృత్తి పరంగా మంగారి రాజేందర్ న్యాయమూర్తి. ప్రవృత్తి మూలంగా జింబో సృజనశీలి! అంతకు మించి స్నేహశీలి. వృత్తికి, ప్రవృత్తికి సమన్యాయం చేయగల విజ్ఞత, సంయమనం ఆయన సొంతం. అందువల్లనే గుండెలోతుల్లోంచి తన్నుకొచ్చే ప్రతిస్పందనల ప్రవాహానికి ఆనకట్టలు వేయగల్గుతున్నడు. లోతుగా పరిశీలిస్తడు గనుకే అలవోకగా కదిలించే కవిత్వాన్ని సృశించగల్గుతున్నడు.

మానవుడు కవిత్వంలాగా వుండేలా జీవించాలని చైనా తాత్వికున్ని ఉదహరిస్తూ సంజీవ్‌దేవ్ అన్నమాటలు జింబోని చూసినపుడు నాకు గుర్తుకు వస్తుంటయి. ఆయనలో హృదయ స్పందనకు-కర్తవ్య నిర్వహణకు సంఘర్షణ మనకు ఎప్పుడూ కనిపించదు. అదీ జింబో! ఆయన కథలు, వ్యాసాలకన్నా కవిత్వం నాకు చాలా ఇష్టం. బాగా తెలిసిన ఒక మంచి మనిషిగా.. ఇంకా ఇంకా ఇష్టం. పుష్కరకాలం కింద ఆయన వెలువరించిన అందమైన రెండక్షరాలు నాకెంతో నచ్చింది.

ఇందులో కాగాడా పెట్టి వెదికినా న్యాయమూర్తి రాజేందర్ మనకు కనిపించడు. ప్రతి అక్షరంలో ఆప్యాయత, అనురాగం మానవ సంబంధాల పట్ల అహరహం తపించే కవి దర్శనమిస్తడు. అందుకే రెండక్షరాలు ఇంత కాలం నన్ను వెంటాడుతూనే వున్నది.

ఇది చాలా నచ్చడానికి మొదటి కారణం-చూడగానే కట్టి పడేసే పుస్తకరూపం. దీంట్లో సైతం కవిత్వం ఉట్టిపడ్తున్నది. అందుకు ఏలె లక్ష్మణ్ చిత్రీకరించిన గ్రామీణ నేపథ్యం. ఇక రెండోది అర్దాంగి శైలజకు దీన్ని అందిస్తూ ఈ రెంక్షరాలు నా స్వప్నం.. నా జీవితం.. నా సమస్తం.. అనడం జింబో ఆంతర్యాన్ని ఆవిష్కరించినట్లు అయ్యింది. ఆమె యేం తక్కువ తిన్నదా? అమ్మ, ఊరు, వాగు, స్నేహం, ప్రేమ, మోహం, పగ, ద్వేషం, దయ, క్షమ, త్యాగం అన్నీ రెండక్షరాలే. ఈ కవిత్వమూ రెండక్షరాలే.. అంటుంది జీవన సారమంతా చిలికిస్తూ! ఇద్దరూ వేరైనా ఆత్మ ఒక్కటే గదా! అందుకే జింబో కవిత్వం అంత గాఢంగా వుంది.

మూడవది- అసలైనదీ ఇందులోని కవిత్వాంశాలు. వ్యక్తీకరించిన తీరు. పదాలగారడీ లేదు. మర్మమాంత్రికతలు లేవు. నిజాయితీగా, సూటిగా, సరళంగా గుండె చప్పుడు వినిపిస్తుంటే.. పాఠకున్ని గొప్ప అనుభూతిలో ఓలలాడిస్తుంది.

రెండక్షరాలు లోపలి పేజీల్లోకి తొంగి చూడగానే అమ్మ గురించిన తలపోత!. అమ్మను గురించి రాయాలంటే అనంత కావ్యమవుతుంది.. కొండను అద్దంలో చూపెడ్తడు జింబో!
ఒక్క నీ ప్రేమ తప్ప, ఒక్క నీ చనుబాల తీపి తప్ప! అన్నీ ఆర్థిక సంబంధాలే అని రాయనా? అమ్మా! అమ్మా!! అమ్మా!!! అంటూ దిగజారుతున్న మానవ సంబంధాల తీరు పట్ల ఆక్రోశిస్తడు. ఆవేదన పడ్తడు. పసివాడై బోరుమంటడు. కాలమాన పరిస్థితుల వలన చాలా మందికి పుట్టిన ఊరు దూరమైపోతున్నది. మా ఊరు-నాకే పరాయిదైపోతుంది అని బాల్యం నెమరు వేసుకుంటూ బాధపడ్తడు. అయినా ప్రతి ఇల్లూ దీప నేత్రమై సేవకు ఎదిరి చూస్తూవుంటదని ఊర్లో దసరాని తలుచుకుని మురిసిపోతడు.

మాట పరమాణువని, మాటలోనే పరమార్థం వుందని మనకే తెలియదని అంటడు కవి. కల్లో తాను ప్రకంపనాలను సృష్టించే ఒక్క మాటతోనే ప్రపంచాన్ని జయించవచ్చునన్న ఆశాభావం ప్రకటిస్తడు. లౌక్యం అవసరాన్ని నర్మ గర్భంగా ప్రస్తావిస్తడు. స్నేహాన్ని గుర్తు చేసుకుని తల్లడిల్లి పోతడు. కల్సినా పలుకరింపుల్లేని అగాథం. అందని దూరం! మన చదువులో మన అంతస్తులో ఏవో మనల్ని బంధిస్తాయి. మన నోటికి ప్లాస్టర్లవుతాయి. మన కళ్లల్లో శుక్లాలవుతాయి అంటాడు ఆర్ద్రంగా, ఆవేదనగా. కవి నిజాయితీ పాఠకుడ్ని కదిలిస్తుంది.

వ్యాపారమయమైన వైద్యవృత్తినీ కడిగేస్తడు. అన్న డాక్టర్ రఘుపతి మరణం గుర్తుకొచ్చి, పేషెంటు బతుకుతాడా? లేదా? అది వేరే సంగతి! గెలుపు ఓటమి కాదు ప్రశ్న! కనీస ప్రయత్నం లేకుండానే జారిపోవడంలోనే వుంది బాధ. కష్టాల్నీ, కన్నీళ్లనీ, సంఘర్షణలనీ కణకణమండించే కవి మన సమకాలీనతకి నా కళ్లు పిడికిళ్లవుతున్నాయి ఓ అద్భుత ప్రయోగం! కండ్లు పిడికిళ్లు కావడం అంటే ఎంత ఆక్రోశం వెలిబుచ్చారో ఆచితూచి వాడిన పదబంధం. ఒక జీవితాన్ని చూసి ఎంత నేర్చుకోవచ్చో, ఒక మరణాన్ని చూసి అంతకన్నా ఎక్కువ నేర్చుకోవచ్చన్న విషయం మరణం తరువాత తెలిసే జీవన సత్యమని నిర్ధారిస్తడు. మనలోతు మనకే తెలియనప్పుడు! ఇతరుల గురించి మనకేం తెలుస్తుంది?, భేషజం లేని మానవ జీవన సారం వడబోసిన చిత్రిక ఇది! తనవూరు, బాల్యం, రక్తసంబంధం అన్నింటిలో వున్న లెక్కలు పూర్తి చేసుకోవడం, అన్నీ పోగొట్టుకోవడమేనంటూ స్వర్గాలు లేవు! మనం కోల్పోయినవే స్వర్గాలు అనడం భావుకతకు పరాకాష్ఠ!

ఏవైనా రెండనుకుంటాం.. విచిత్రం మనకు తెలియదు అవి ఒక్కటని జింబో తాత్వితకు అద్దం పడ్తున్న రెండక్షరాలు విభిన్న జీవన సార్శాలు తడిమే ఉత్తమ కవిత్వం! పది కాలాల పాటు నిలిచే పాఠకులు మెచ్చే కవిత్వం!!

442
Tags

More News

VIRAL NEWS