చేపల పెంపకంలో జాగ్రత్తలు

Thu,September 6, 2018 02:01 AM

-తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరిగే వాటిని ఎంపిక చేసుకోవాలి
-రవాణాలో తగిన ఆక్సిజన్‌ను అందిస్తుండాలి
-అలల తాకిడి లేని చోటఒత్తిడికి గురి కాకుండా విడుదల చేయాలి

Fisherman
చేపల సాగు చేపట్టేవారు చేపపిల్లల ఎంపిక నుంచి వాటిని పట్టుబడి చేసేంత వరకు సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో మంచినీటి చెరువులలో చేపల పెంపకం చేపడుతున్నారు. వాటిలో పెంచేందుకు సరైన రకాలు, మంచి లక్షణాలున్న చేపపిల్లల ఎంపిక చేసుకోవడం, వాటి రవాణా, చెరువులలో విడుదల వరకు సరైన జాగ్రత్తలు పాటించినప్పుడే అది సాధ్యపడుతుందని వివరించారు. చేపపిల్లల ఎంపిక నుంచి చెరువులో వాటిని విడుదల చేసే వరకు పాటించవలసిన జాగ్రత్తలను గురించి గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త బూర్గు లవకుమార్ వివరించారు. అదనపు సమాచారం కోసం 9849063796 నెంబర్‌ను సంప్రదించవచ్చు. ఆయన తెలిపిన వివరాలు...

చేపపిల్లల ఎంపికలో జాగ్రత్తలు

-భారతీయ మేజర్ కార్ప్, విదేశీ కార్ప్ చేపపిల్లలను ఎంపిక చేసుకోవడం వల్ల
తక్కువ సమయంలో పెద్దగా పెరుగుతాయి.
-చెరువులలో లభించే సహజ ఆహారాన్ని కాకుండా అనుబంధ ఆహారాన్ని ఇష్టపూర్తిగా తీసుకునే చేపపిల్లల రకాలను ఎంపిక చేసుకోవాలి.
-భిన్నమైన ఆహారపు అలవాట్లతో, ప్రవర్తనతో ఉండే జాతులను ఎంపిక చేయడం వల్ల వివిధ జాతుల మధ్య గల పోటీని నివారించవచ్చు.
-తాత్కాలిక ప్రతికూల పరిస్థితులను తట్టుకునేవిగా ఉండాలి.
-మంచి రుచికర, పోషక విలువలు గల మాంసం కలిగినవై ఉండాలి.
-సహజసిద్ధంగానే కాకుండా కృత్రిమ విధానంలోనూ పిల్లలను ఉత్పత్తి చేయగల చేపల రకాల చేపపిల్లలను ఎంపిక చేసుకోవాలి.
Fisherman1

చేపల రకాలు

1 కట్ల

ఈ రకానికి చెందిన చేపపిల్లలు నీటి పైభాగంలో తిరుగాడుతూ సహజ ఆహారాన్ని ముఖ్యంగా జంతు ప్లవకాలను తీసుకుంటాయి.ఒక సంవత్సర కాలంలో 1.5-2 కిలోల వరకు పెరుగుతాయి.

2 రోహ్లు

ఈ చేపపిల్లలు నీటి మధ్యభాగంలో ఈదుతూ సహజ ఆహారాన్ని తీసుకుని సంవత్సర కాలంలో 1-1.5 కిలోల వరకు పెరుగుతాయి.

3 మ్రిగాల

ఈ చేపపిల్లలు చెరువు అడుగు భాగంలో తిరుగుతూ సహజ ఆహారాన్ని తీసుకుని సంవత్సర కాలం లో 1-1.5 కిలోలు బరువు పెరుగుతాయి.

4 బంగారుతీగ

ఈ చేపపిల్లలు 6-8 నెలల వరకు నీరు నిల్వ ఉండే చిన్న నీటి పారుదల చెరువులలో పెంచడానికి అనుకూలంగా ఉండి ఆరు నెలల్లో ఒక కిలో బరువు పెరుగుతాయి.

5 వెండి చేప

ఈ చేపపిల్లలు నీటి పైభాగంలో ఈదుతూ అక్కడ లభ్యమయ్యే సహజ ఆహారాన్ని (వృక్ష ప్లవకాలు) తీసుకంటూ బాగా పెద్దవిగా పెరుగుతాయి.

6 గడ్డిచేప

ఈ రకం చేపపిల్లలు చెరువులోని గడ్డిని ఆహారంగా తీసుకుంటూ గడ్డిని నియంత్రిస్తాయి. ఒక సంవత్సర కాలంలో 2-3 కిలోల బరువు పెరుగుతాయి.

7 తవ్విన చేపల కుంటలకు మట్టగిడస, కొర్రమట్ట (బొమ్మచేప)లు అనుకూలంగా ఉంటాయి. వీటికి మాంసాహారాన్ని అనుబంధ ఆహారంగా ఇవ్వడం వలన సంవత్సర కాలంలో 750 గ్రాముల నుండి 1 కిలో బరువు పెరుగుతాయి.

నాణ్యత గల చేపపిల్లల ఎంపిక

-చేపపిల్లల కదలికలను బట్టి నాణ్యతను గుర్తించవచ్చు.
-వ్యాధి సోకని చేపపిల్లలు హాపాలో పోసిన వెంటనే ఉత్తేజంతో తిరిగాడుతూనే హాపా అంచుపై ఎక్కువగా కనబడుతాయి.
-చేపపిల్లలు తలతలా మెరుస్తాయి.
-తోక, రెక్క భాగాలు గమనించినైట్లెతే చీలినట్లుగా గానీ, కొరుకుడు లేకుండా గానీ ఉంటే
అవి ఆరోగ్యవంతమైనవిగా పరిగణించాలి.
FISH

చేపపిల్లల రవాణాలో జాగ్రత్తలు

-చేపపిల్లల రవాణా చేయడానికి ముందు 24 గంటల పాటు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వకూడదు. ఎందుకంటే అవి విసర్జించిన ఆహారం నీటిలో కలిసి ఇతర చేపపిల్లలపై ఒత్తిడిని కలిగించి అవి చనిపోవడానికి కారణమవుతుంది.
-చేపపిల్లలను తక్కువ ఉష్ణోగ్రత గత నీటిలో రవాణా చేస్తే వీటి జీవక్రియ రవాణా సమయంలో తక్కువ స్థాయిలో ఉంటుంది.
-వాతావరణం చల్లగా ఉన్న సమయంలో
అంటే సాయత్రం లేదా రాత్రి సమయాల్లో మాత్రమే రవాణా చేయాలి. వాహనంలో
ఆక్సిజన్ సిలిండర్ అందుబాటు ఉంచుకుని
ఆక్సిజన్‌ను అందిస్తూ రవాణా చేయాలి.

ఒత్తిడికి గురికాకుండా..

రవాణా చేయబడిన చేపపిల్లలను చెరువు కొత్తనీటి వాతావరణాన్ని అలవాటు చేయడానికి ఆక్సిమటైజేషన్ చేసి నీడగా ఉండే చల్లని ప్రదేశంలో అలల తాకిడి లేని చోట ఒత్తిడికి గురికాకుండా విడుదల చేయాలి.

-నట్టె కోటేశ్వర్‌రావు
గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా
9989944945

1285
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles