కుక్కతోక వంకర...!!


Wed,November 13, 2019 02:36 AM

పశుధాన్య హిరణ్యసంపదా రాజతే ఇతి రాష్ట్రమ్..అన్నారు పెద్దలు. పశు సంపదతోనూ ధాన్య సంపదతోనూ సువర్ణ సంపదతోనూ ప్రకాశించేదే సురాజ్యం అని దాని అర్థం. ఆ దిశగానే తెలంగాణ బలంగా అడుగులు వేసుకుంటూ వెళుతున్నది. రాజవీధిని వెళుతున్న భద్రగజం శునకాల అరుపులకు చలించదు.. అన్నట్టు ఈ మీడియా కుట్రలు కుతంత్రాలకు తెలంగాణ ఏకాగ్రత భంగం కాజాలదు. ఈ మీడియా ఏనాడూ తెలంగాణ మేలు కోరదు. ఆనాటి కరెంటు సమస్య నుంచి ఈనాటి ఆర్టీసీ సమ్మెదాకా ఇదే వైఖరి.

వీరికి తెలంగాణ మీద కసి. కేసీఆర్ మీద ద్వేషం. తెలంగాణ రావడమే కంటగింపైతే ఎవరో అర్భకుడు కాకుండా కేసీఆర్ సీఎం కావడం ఇప్పటికీ వారికి మింగుడుపడని అంశం. అందుకే మీడియా కనీస విలువలను కూడా పాటించకుండా కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నది. దీనికి మరికొన్ని తెలంగాణ వ్యతిరేక శక్తులు తోడయ్యాయి.

sgv
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేండ్లు దాటింది. దేశంలోనే ప్రథమ స్థానానికి ఎగబాకి తనదైన ముద్ర వేసుకున్నది. అతి తక్కువకాలంలో అనేక అవార్డులు సాధించింది. వ్యవసాయ విధానం కానీ పారిశ్రామిక విధానం కానీ సంక్షేమ విధానం కానీ మరే రాష్ట్రం దరిదాపుల్లో కూడా నిలువని స్థాయి కి చేరుకున్నది. భూసర్వే, రికార్డుల ప్రక్షాళన, నూతన జిల్లాల ఏర్పాటుతో పాలనా వికేంద్రీకరణ.. ఇలా అనేక విషయాల్లో తిరుగులేని విజయాలు సాధించింది. కేంద్ర మంత్రులు, పర్యావరణ వేత్తలు, ఆర్థికవేత్తలు తెలంగాణ పథకాలను ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలూ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతును ప్రతి ఎన్నికల్లో ప్రకటిస్తున్నారు. ఆయుష్యం కలిగిన రోగి హస్తవాసి ఉన్న వైద్యుని చేతిలో పడ్డట్టు.. కేసీఆర్ వంటి నాయకుని చేతిలో తెలంగాణకు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బలంగా విశ్వసిస్తున్నారు. తెలంగాణ రాకుంటే ఇంత అభి వృద్ధి జరిగేదా అని అనుకుంటున్నారు.

కానీ తెలంగాణ వ్యతిరేకత అణువణువునా ఆవహించుకున్న కొన్ని పత్రికలకు, టీవీ చానెల్స్‌కు, సంఘాలకు ఇవేవీ కనిపించడం లేదు. తెలంగాణ సాధించిన ఆర్థిక సామాజిక మార్పును చూడ నిరాకరించడంతో పాటు తెలంగాణ మీద బురదచల్లడమే పనిగా పెట్టుకున్నాయి. కుక్కతోక ఎప్పటికీ వంకరే అన్నట్టు వీరి బుద్ధి మారదు గాక మారదు అన్నది ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉన్నది.తాజాగా రైతు ఆత్మహత్యల మీద నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వెలువరించిన గణాంకాలను మీడియా ప్రచురించిన తీరుతో తెలంగాణ వ్యతిరేకశక్తుల బుద్ధి మరోసారి బట్టబయలైంది. నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో వెల్లడించిన ర్యాంకులకు తెలంగాణ వ్యతిరేక మీడియా ప్రచురించిన ర్యాంకులకు సంబంధమే లేదు. ఒకటి రెండు పత్రికలు కాదు... కూడబలుక్కున్నట్టు అన్ని పత్రికలూ ఇష్టారీతిన ప్రచురించాయి. అధికంగా ఆత్మహత్యలు రికార్డయిన రాష్ర్టాలను వదిలి తెలంగాణలో భారీగా రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయా? అనే భ్రమ కల్పించే యత్నం చేశాయి.

కారణం ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. తెలంగాణలో వ్యవసాయానికే అగ్రతాబూలం ఇస్తున్నారు. రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఆంధ్ర పాలనలో పడ్డ కష్టాలు తీర్చి వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నారు. నాడు ధ్వంసమైన చెరువులను బాగు చేశారు. ప్రాజెక్టులను శరవేగంగా నిర్మిస్తున్నారు. రైతుకు పంట పెట్టుబడి ఇస్తూ ప్రతి రైతుకు బీమా సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. ఎరువులు విత్తనాల కొరత తీర్చడంతో పాటు గోదాముల కెపాసిటీ పెంచారు. ఆరు దశాబ్దాల తర్వాత రైతు తేరుకున్నాడు. ఇది తెలంగాణ వ్యతిరేకశక్తులకు రుచించ లేదు. అందుకే తెలంగాణలో రైతు బాగుపడలేదని పైపెచ్చు ఆత్మహత్య లు పెరిగిపోయాయని చిత్రించడం వీటి లక్ష్యం. తెలంగాణ వచ్చినా రైతు బాధలు పోలేదని, తెలంగాణ సాధించుకున్నా ప్రయోజనం లేదనే ప్రచా రం చేయడం వీరి ఎత్తుగడ.

ఇప్పుడే కాదు.. తెలంగాణ వచ్చీ రాగానే కరెంటు కష్టాలు ఏర్పడినపుడు ఈ మీడియా ముఠా పండుగ చేసుకుంది. ప్రతి ఆత్మహత్యను రైతు కే ముడిపెట్టి మాయ కథనాలు ప్రచురించింది. తర్వాత మిషన్ కాకతీయ విజయవంతమై భూగర్భ జలమట్టాలు పెరిగాయన్న వాస్తవాన్ని అబద్ధం చేయడానికి పడరాని పాట్లు పడింది. ఆఖరుకు జనవరి నుంచి మే నెల మధ్య తగ్గిన భూగర్భ మట్టాలను కూడా పెద్ద ఎత్తున ప్రచురించి మిషన్ కాకతీయ విఫలమైందనే భావన కలిగించేందుకు యత్నించిందో పత్రిక. వాస్తవానికి జనవరి-మే మధ్య వానలుండవు. పైగా వేసవిలో నీటి వాడ కం అధికం కనుక నీటి మట్టాల్లో మార్పులుంటాయి.

24 గంటల కరెంటు విషయంలో దుర్మార్గంగా వ్యవహరించని మీడి యా లేదు. నిరంతర కరెంటు వల్ల తెలంగాణ రైతు స్థిమితపడ్డాడు. కానీ దీనివల్ల బోర్లు ఎండిపోతున్నాయని, మోటార్లు కాలిపోతున్నాయని ప్రచారం చేశాయి. వాస్తవానికి నిరంతర విద్యుత్తు ప్రారంభమైన తర్వాత మోటార్లు ఎండిపోవడం కాదు, మోటార్లు బాగుచేసే దుకాణాలే మూతపడ్డాయి. పంటల విస్తీర్ణం పెరిగింది. రైతుబంధు. రైతుబీమా విషయం లో కౌలుదారులను రెచ్చగొట్టేందుకు మీడియా యత్నించింది.
ప్రాజెక్టుల మీద ఈ శక్తులు చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఒక పత్రి క భారీ కథనాన్ని రాసింది. రెవెన్యూ రికార్డులు ముందుపెట్టి ఏ గట్టు మీద ఎవరి హక్కు ఉందో నిరూపించుకోవాల్సిన స్థితి. తెలంగాణలో కరెంటు కష్టాలు ఎదురైనపుడు జల విద్యుత్ ఉత్పత్తికి పూనుకున్నపుడూ ఇదే రీతి. తెలంగాణకు హక్కు లేదంటూ కథనాలు. ఆంధ్రకు మంచినీటి కటకట వస్తుందంటూ రెచ్చగొట్టే వాదనలు. సాగర్ వాటా పేచీలకు ఈ మీడియా నే ఆజ్యం పోసింది.

తెలంగాణ ప్రభుత్వం సంయమనం పాటించబట్టిగానీ లేకుంటే యుద్ధాలే జరిగి ఉండేవి. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించినప్పుడు తెలంగాణ వ్యతిరేకశక్తుల వికృతరూపం బట్టబయలైంది. భూసేకరణలో వీలున్న ప్రతిచోటా ఆందోళనలకు పురిగొల్పాయి. నాలుగు ఏడుపుగొట్టు సంఘాలను ముందుపెట్టి మహా ఉద్యమాలేవో పుట్టుకు వస్తున్నట్టు వార్తలు రాశాయి. ఏటిగడ్డ కిష్టాపూర్ మీద విచారణ సందర్భంగా ప్రభుత్వానికి కోర్టు కొన్ని సూచనలు చేసింది. నిబంధనల ప్రకా రం పునరావాస పనులను పూర్తిచేసి ప్రాజెక్టు పనులు చేసుకోవాలనేది దాని సారాశం. కానీ ఓ పత్రిక అధికారులు యంత్రాలతో సహా ఆ గ్రామాన్ని ఖాళీ చేయాలని ఆదేశాలిచ్చిందని... ఇక ప్రాజెక్టు ఆగిపోయినట్టేననే రీతిలో కథనాన్ని ప్రచురించింది. సరే.. ఆ ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వం పనులను ముందుకు తీసుకువెళ్లింది.నిజానికి తెలంగాణ రైతు ఇవ్వాళ ఎంతో ధీమాగా ఉన్నాడు. కాలుమీ ద కాలు వేసుకుని కుడిచేతికి నాలుగు ఉంగరాలు, ఎడమ చేతికి నాలుగు ఉంగరాలు పెట్టుకొని మీసం తిప్పుతూ కూర్చున్నారని కాదు. కానీ రైతు బంధు, రైతుబీమా వారిలో భరోసా నింపింది. ఈ సంవత్సరం వానకా లం సమయంలో జూలై చివరి వరకు చినుకు పడకపోయినా రైతుల్లో ఎలాంటి ఆందోళన కనపడకపోవడం దీనికి తార్కాణం.

హైదరాబాద్ నగరం మీద ఈ మీడియా ఎంత విషం కక్కిందో తెలియంది కాదు. నాలుగు చినుకులు పడితే చాలు.. కెమెరాలు గొట్టాలకు పండుగే. ఏదో ప్రళయం వచ్చినట్టు ప్రచారం. ఓ టీవీ హైదరాబాద్‌లో భూ కంపం వస్తే ఏయే ప్రాంతాలు దెబ్బతింటాయో కథనాలు ప్రసారం చేసింది. నిజానికి హైదరాబాద్ పట్టణమే భూకంపం జోన్‌లో లేదని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఇంకో పత్రిక ఇక్కడి ఔషధరంగ పరిశ్రమలన్నీ కర్ణాటకకు తరలిపోతున్నాయా? అంటూ వార్తలు ప్రచురించింది. అక్కడ ఏవో కొన్ని రాయితీలు ఇచ్చారట. అక్కడి రాయితీలకు ఉచిత ప్రచారం చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారా అనిపించే ప్రచారాలు. హైదరాబాద్‌లో నీటికి కటకట ఏర్పడినట్టు వార్తలు ప్రచురించిందో పత్రిక. వాస్తవానికి అంతవరకూ పాలించిన ప్రభుత్వాలు నగర అవసరాలు గమనించకుండా నీటి తరలింపులు చేస్తూ నెట్టుకువచ్చాయి. తెలంగాణ ప్రభు త్వం ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నది. గోదావరి జలాల తరలింపును వేగవంతం చేసి, అడ్డంకులను తొలిగించి నీటి సమస్యను తీర్చింది. దానితో పాటు నగర జలమండలి పరిధిని విస్తరించింది.

చిన్న లోపాలను భూతద్దంలో చూపి బురదచల్లే ఈ మీడియా తెలం గాణ ఏర్పడినంక జరిగిన మంచిని మాత్రం పట్టించుకోదు. ఒకప్పుడు హైదరాబాద్‌లోని నాలాల్లో, మూతలుతీసిన మ్యాన్‌హోల్స్‌లో పడి మర ణించడం జరిగేది. కానీ తెలంగాణ ఏర్పడినంక అవి దాదాపు కనుమరుగయ్యాయి. ఈ విషయాన్ని ఏ మీడియా రాయదు. గతంలో వానపడితే రోజుల తరబడి లోతట్టు ప్రాంతాలు మునిగిఉండేవి. కానీ ఇపుడు గంట ల వ్యవధిలో ఆ ఇబ్బందులు తొలుగుతున్నాయి.
రాష్ట్ర ఆర్థికపరిస్థితి మీద ఈ మీడియా ఎంత బెంగ పెట్టుకుందో. ఎప్పటికప్పుడు పభుత్వం చేతులెత్తేసినట్టే అనేరీతిలో ఎన్ని కథనాలో! ఓ పత్రి క హాస్టళ్లకు మూడు నెలల నుంచి బిల్లులు లేవని, విద్యార్థులకు ఆహారం అందడం లేదని వార్త ప్రచురించింది. వాస్తవానికి అన్ని హాస్టళ్లకు టెండర్ల ద్వారా కాంట్రాక్లర్లకు ఆహార సరఫరా బాధ్యతను అప్పగించారు. మూడు నెలలకోసారి ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. కాంట్రాక్టర్లు ప్రతిపాదనలు పంపితే అధికారులు తనిఖీ చేసి ఆమోదిస్తారు. మరి ఈ కథనానికి అర్థమేమిటో ఆ బిత్తిరి పత్రికకే తెలియాలి. ఓ పత్రిక మిషన్ భగీరథ ఆగిపోయిందంటూ నిర్మాణం నిలిచిపోయిన ఓ నీటి ట్యాంకు ఫొటో ను ప్రచురించింది. ఇంతకూ మిషన్ భగీరథ ట్యాంకులన్నీ ఆరు పిల్లర్ల తో నిర్మిస్తున్నవైతే, పాపం ఆ పత్రిక ఎనిమిది పిల్లర్ల ట్యాంకు తప్పుడు ఫొటో వేసి దొరికిపోయింది.

తెలంగాణ వచ్చిన తర్వాత ఆలయాలకు మహర్దశ వచ్చింది. ఇది తెలంగాణ వ్యతిరేకశక్తులకు కంటగింపైంది. ఒక పత్రిక తీర్థాల్లో వ్యర్థాలు అంటూ వేములవాడ రాజన్న క్షేత్రం ప్రధానంగా తీసుకొని కథనం రాసింది. రాజన్న ఆలయంలోని ధర్మగుండంలో ఎప్పటికప్పుడు నీటిని మారుస్తారు. భక్తుల సంఖ్య పెరిగినపుడు నీరు కలుషితం కాకుండా ఏర్పాట్లున్నాయి. ఏదైనా సమస్య వస్తే భక్తులను అప్రమత్తం చేస్తారు. అయినా ఏదో ఒక నింద వేయాలనే ఆదుర్దా. ఇంతకీ రాజన్న సన్నిధి తీర్థం కాదు. క్షేత్రం. నదీతీరాల్లో ఆలయాలుంటే తీర్థాలుగా పిలుస్తారు. గుట్టల మీద భూమి మీది ఆలయాలను పుణ్యక్షేత్రాలుగా వ్యవహరిస్తా రు. ఈ తేడా తెలియని పత్రిక రాజన్న క్షేత్రాన్ని తీర్థం చేసేసింది.

ప్రజలందరికీ కంటి పరీక్షలు చేసి అద్దాలు పంపిణీ చేసే ఒక గొప్ప పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసింది. ఈ పథకం మీదా మీడియా కు కడుపు మంటే. ఒక పత్రిక ఓ శస్త్రచికిత్స విఫలమైందని కంటి వెలుగుకు ముడిపెట్టి రాసింది. వాస్తవానికి ఈ పథకం కింద అప్పటివరకు శస్త్రచికిత్సలు జరుపనే లేదు. తెలంగాణ ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించుకుంది. ఉచిత చేపపిల్లల పంపిణీతో మత్స్య సంపదను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంది. ఇది కంటగింపైంది ఓ పత్రికకు. చేపల్లో రసాయనాలు వాడుతున్నారంటూ కథనాన్ని ప్రచురించింది. నిజానికి తెలంగాణలో చేపల ఉత్పత్తి వాణిజ్యపరంగా జరుగదు. ఇక్కడ చేపల కోసం తవ్విన చెరువులూ లేవు. రసాయనాలు వేసి కృత్రిమంగా పెంచరు.
దుర్జనం సజ్జనం కర్తుముపాయో నహీ భూతలేః అన్నారు.. దుష్ట బుద్ధికలవారిని బాగుచేసే ఉపాయం ఈ భూతలం మీద లేదు..

అలాగే ఈ మీడియా ఏనాడూ తెలంగాణ మేలు కోరదు. ఆనాటి కరెం టు సమస్య నుంచి ఈనాటి ఆర్టీసీ సమ్మెదాకా ఇదే వైఖరి. వీరికి తెలంగాణ మీద కసి. కేసీఆర్ మీద ద్వేషం. తెలంగాణ రావడమే కంటగింపైతే ఎవరో అర్భకుడు కాకుండా కేసీఆర్ సీఎం కావడం ఇప్పటికీ వారికి మిం గుడుపడని అంశం. అందుకే మీడియా కనీస విలువలను కూడా పాటించకుండా కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నది. దీనికి మరికొన్ని తెలంగాణ వ్యతిరేక శక్తులు తోడయ్యాయి. తాడు చాలకపోతే నుయ్యి పూడ్చమనే స్థాయి సలహాలిచ్చే కొందరు కుహనా మేధావులూ జత కలిశారు. కందెన వేయని బండికి కావలిసినంత సంగీతమని విషయం ఉన్నా లేకున్నా.. వీరి నోళ్లకు ప్రచారం ఎక్కువ. అందుకే వీరి వైఖరిని ఎప్పటికప్పుడు గుర్తించి తిప్పికొట్టడం తెలంగాణ ప్రేమికుల కర్తవ్యం.

762
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles