కూలిన కలలసౌధం


Wed,November 6, 2019 12:27 AM

అది ఎన్నో కష్టాలకోర్చి అక్షరాలతో నిర్మించుకున్న
ఆమె కలలసౌధం
ఆమె కంటిముందు లక్ష్యాన్ని నిర్దేశిస్తుంటే
కాలంతో పాటు నడువాలనే అనుకుంది
తన పనేదో తాను చేసుకుపోవాలనుకుంది
చేస్తున్న వృత్తి శాపం కాకూడదు
వృత్తిధర్మాన్ని స్వార్థచింతన పతనం చేసింది
పైశాచికత్వం మానవ విలువలు బూడిద చేసింది
మానవమృగం రెచ్చిపోయి
మారణకాండ సృష్టించింది
బతుకుదెరువు కోసం చేస్తున్న కొలువు
నిండు జీవితం బలిగొంది
ఊహించని పరిణామంతో
జనం విస్తుపోయి నిలిచారు
కౌలు రైతుకు భూ యజమానికి మధ్య వివాదంలో
విజయారెడ్డి విగతజీవిగా మిగిలింది
ఒక కన్నతల్లికి కడుపు కోత మిగిల్చింది
అభం శుభం తెలియని
చిన్నారులను అనాథలను చేసింది!!
ఎవరి ప్రోద్బలమో?
అరాచకం అర్రులు చాచిందేమో?
తహసీల్దార్ కార్యాలయం గ్రీవీన్స్ డే నాడే
స్మశానంగా మారింది
స్వార్థం కప్పుకున్న క్రూరమృగం
తనది కాని పనిని
తన పనికాదని అన్నందుకు
పైశాచికత్వం సృష్టించింది
ప్రాణం పోసే శక్తి లేనప్పుడు
ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు?
ఎన్ని ఎకరాల ఆస్తులు సంపాదించినా
ఎన్ని భూములు కబ్జాలు చేసినా
ఎన్ని అంతస్థుల మేడలు కట్టినా
చివరికి ఆరడుగుల నేలనే నీ సొంతమని తెలుసుకో!!
- జయంతి వాసరచెట్ల, 99855 25355

125
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles