ప్రజల భవితవ్యాన్ని బలిపెట్టొద్దు


Sat,November 2, 2019 12:49 AM

భారతదేశం ఒకవేళ ఆర్‌సీఈపీపై సంతకం చేసినట్లయితే.., న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి దేశంలోకి పాల ఉత్పత్తులు వెల్లువలా వచ్చిపడుతాయి. మార్కెట్లన్నీ ఆ దేశాల పాలతోనే నిండిపోతాయి. పాల ఉత్పత్తులపై ఆధారపడి జీవించే భారతీయుల పరిస్థితి కుదేలవుతుంది. పాల ఉత్పత్తులపై ఆధారపడేవారు ఉపాధి కోల్పోతారు.

devanoor
ప్రస్తుత ప్రభుత్వ తీరు, చేసుకుంటున్న ఒప్పందాల విధానం చూస్తే గత చరిత్ర గుర్తుకువస్తున్నది. ప్రస్తుత పాలకులకు భిన్నంగా నాడు మన జాతీయోద్యమ నేతలు ఎలా వ్యవహరించారు, ఏం ఆలోచించారో చూస్తే నేటి పాలకుల బాధ్యతా రాహిత్యం అవగతమవుతుంది. జాతీయోద్యమ కాలంలో విదేశీ వస్తు బహిష్కరణ, విదేశీ బట్టల దహనం చేయండనే పిలుపుతో ఇంగ్లండ్‌లోని లంకాషైర్‌లోని బట్టల మిల్లులున్నీ మూతపడ్డాయి. కార్మికులు రోడ్డున పడ్డారు. అదే సమయంలో లండన్‌లో పర్యటనలో ఉన్న గాంధీని లంకాషైర్ కార్మికులు 1931 సెప్టెంబర్ 26 చుట్టుముట్టి గాంధీ పిలుపు కారణం గానే తమ ఉద్యోగాలు పోయాయని వాపోయారు.

లంకాషైర్ కార్మికుల గోడును సావధానంగా విన్న గాంధీ ఈ విధంగా సమాధానమిచ్చారు.. తన పిలుపుతో ఇక్కడ ఇంగ్లండ్‌లో నిరుద్యోగులు కావటం బాధాకరమే. కానీ మీరు దీంతో ఆకలితో పస్తులుండే పరిస్థితి కానీ, ఆకలిచావులు వచ్చే దుస్థితి కానీ లేదు. భారత్‌లో ఈ రెండూ ఉన్నా యి. మీరు భారతీయ గ్రామానికి ఎక్కడికి వెళ్లి చూసినా గ్రామాల్లో తీవ్ర కరువు పరిస్థితులు కనిపిస్తాయి. గ్రామాల్లో మీకు కనిపించేది ప్రాణంతో ఉన్న అస్థిపంజరాలు మాత్రమే. ఒకవేళ మనం వారికి సరైన తిండి పెట్టగలిగితే వారు భారతదేశాన్ని తీర్చిదిద్దటమే కాదు, ప్రపంచానికి కూడా వెన్నుదన్నుగా నిలబడగలరు. ఇవ్వాళ భారత్ శాపగ్రస్తమై ఉన్నది. భారత దేశంలో ఉన్న రాజకీయపార్టీ ఎలా ఉన్నదంటే.. దేశంలోని సగం మంది గురించి ఆలోచించటమే లేదు. లక్షలాదిమంది ఆకలి చావుల పట్ల పట్టింపులేదు. నేననుకుంటాను.. ఒక మానవీయ ధర్మంగా వారికి పనికల్పించి వారి జీవనాలను నిలుపటమే ప్రథమ కర్తవ్యంగా ఎవరికైనా ఉండాలి. వారికి ఉన్న పూరి గుడెసెల్లో ఉండి పని చేసుకునే విధంగా వృత్తిని, జీవనోపాధిని కల్పించాలి. వారు ఉత్పత్తిచేసిన వాటిని సులభంగా అమ్ముకునే పరిస్థితులు కల్పించాలి. ఇది నా ఆలోచనే కాదు, ఇదే ఇప్పుడు లంకాషైర్ లోని కార్మికుల ఆలోచనలు కావాలి. లంకాషైర్ కార్మికులకు గాంధీ ఇచ్చి న సమాధానంలో కొన్ని మాటలే ఉండొచ్చు. ఆ మాటలే ఇప్పుడు నా ఆలోచనల్లో సుడులు తిరుగుతున్నాయి. అదే ఇప్పుడు 57అడుగుల ఎత్తైన గోమటేశ్వర్ విగ్రహమంత పెద్దదిగా నాకు కనిపిస్తున్నది.

ఇక్కడే మనం గాంధీ నాడు చెప్పిన మాటలను మరొక్కసారి మననం చేసుకుందాం. ఇప్పుడు దేశంలో ఏం జరుగుతున్నది? ఎక్కడ చూసినా రైతులు, నిరుద్యోగులు లక్ష్యల సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. పాలకులు మాత్రం వాటిని చూడ నిరాకరిస్తున్నారు. వాటి గురించి కనీసం స్పందించటం కూడా లేదు. ఇలాంటి పరస్థితుల్లోనే గ్లోబల్ వార్మింగ్ కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిని ప్రకృతి ప్రకోపిస్తున్నది. ఒకచో ట వరదలు బీబత్సం సృష్టిస్తుంటే, మరోచోట కరువు తాండవిస్తున్నది. దీంతో భారత ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోతున్నది. నిరుద్యోగం పెరుగుతున్నది. దేశమే కుంగిపోతున్నది. మరోవైపు మోదీ, షాలు ఆశ్రిత పెట్టుబడిదారులతో చేతులు కలిపి దేశం మరింతగా దిగజారటానికి కారణమవుతున్నారు. దేశాన్ని దిగజారుస్తున్నారు. ప్రభుత్వరంగ ఆస్తులను ఇబ్బడిముబ్బడిగా తెగనమ్ముతున్నారు.

ఇక్కడ మరో విషయం గమనించాలె. కేంద్రం 16 దేశాలతో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సీఈపీ)పై సంతకం చేయటానికి సిద్ధంగా ఉన్నది. ఇది ఈ దేశాల మధ్య కుదరనున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఇప్పటికే ఏషియన్(ఎస్‌ఈఏఎన్) దేశాలతో చేసుకున్న ఒప్పందంతో భారత్ తీవ్రంగా నష్టపోతున్నది. జపాన్, దక్షిణకొరియా ఇతర దేశాలతో వర్తక వాణిజ్యంలో పోటీపడలేక చతికిలపడి భారీ మూల్యం చెల్లిస్తున్నది. తీవ్ర ఆర్థిక నష్టాలకు గురవుతున్నది. అయినా భారత్ గుణపాఠాలు తీసుకోవటానికి సిద్ధంగా లేదు. ఆయా దేశాల్లోని ప్రజల సమ్మతి లేకుండానే చట్టసభల ముందుకు తెచ్చి ఒప్పందాలు చేసుకుంటున్నది.
రీజినల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ (ఆర్‌సీఈపీ)తో జరిగే నష్టం ఏమంటే.. ఒక ఉదాహరణ చూద్దాం. భారత్‌లో గ్రామీణ పేదరైతాంగం, ఇతర పేదవర్గాలు తమ ఆదాయ వనరుల కోసం పాల ఉత్పత్తి పైనే ఆధారపడుతారు. ఒకరకంగా వారు పాల ఉత్పత్తితోనే ఉపాధిగా జీవిస్తారు. భారతదేశం ఒకవేళ ఆర్‌సీఈపీపై సంతకం చేసినట్లయితే.., న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి దేశంలోకి పాల ఉత్పత్తులు వెల్లువలా వచ్చిపడుతాయి. మార్కెట్లన్నీ ఆ దేశాల పాలతోనే నిండిపోతాయి. పాల ఉత్పత్తులపై ఆధారపడి జీవించే భారతీయుల పరిస్థితి కుదేలవుతుం ది. పాల ఉత్పత్తులపై ఆధారపడే వారు ఉపాధి కోల్పోతారు.

ప్రభుత్వం ఇలాంటి ఒప్పందాలపై సంతకాలు చేస్తున్నప్పుడు దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిగురించి ఆలోచించాలి. దేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే ఎక్కువగా ఉండటం గమనా ర్హం. ఇక్కడే గాంధీ మాటలు గుర్తుకువస్తున్నాయి. దేశంలో ఉన్న ఒక రాజకీయపార్టీ ఎలా ఉన్నదంటే ప్రజలు చస్తున్నా పట్టింపు లేదు. సగంమంది ఆకలి దప్పులతో చస్తున్నా, ఇంకా సగం మం ది మిగిలే ఉన్నారు కదా అని చూస్తుంది. సరిగ్గా ఆ మాటలు నిజమవుతున్నాయిప్పుడు.ప్రపంచీకరణ తర్వాత దేశం సర్వనాశనమైంది. ఇక్కడే మనం ఇథియోపియా ప్రధాని వైపు చూడాలి. మనకు తెలుసు ఇథియోపియా అంటే ఆకలి దేశం. ఆకలి చావులకు ప్రతీక. అబియ్ అహ్మద్ ఇథియోపియా ప్రధాని అయిన తర్వాత రెండేండ్లలోనే శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతున్నాయి. ప్రతి ఒక్కరికీ పని దొరుకుతున్నది. అంతర్యుద్ధాలు ఆగిపోయాయి. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపక్ష పార్టీలన్నింటితో సమాలోచనలు జరిపారు. టెర్రరిస్టు సంస్థలతో కూడా చర్చించటానికి చొరవ చూపి విజయం సాధించారు. జాతివైరాలు, అంతఃకలహాలతో నిప్పుల గుండంగా ఉన్న ఇథియోపియాలో శాంతిని నెలకొల్పి ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించారు.

అబియ్ అహ్మద్ ఇంటి తలుపులు 24 గం టలు తెరిచే ఉంటాయి. ఆయన మంత్రివర్గంలో సగం మంది మహిళలకు స్థానం కల్పించారు. సుప్రీంకోర్టులో కూడా మహిళా న్యాయమూర్తులకు మెజారిటీ స్థానాలు కట్టబెట్టారు. ఆయన కాలక్షేపం కోసం ఎక్కడా ఎన్నడూ విదేశీ పర్యటనలు చేయలేదు. ద్వేషంతో ఉన్న పొరుగు దేశాలతో శాంతి చర్చ ల కోసం ఆ దేశాల్లో పర్యటించారు. అయినా అక్కడ కూడా ఒక గాడ్సే ఉన్నా డు. అబియ్‌పై ఓ ఆగంతకుడు హత్యయత్నం చేశాడు. హత్యాయత్నం తర్వా త ఇతరులను చంపటమనేది ఓటమికి సంకేతం. మనల్ని విభజించటానికి ప్రయత్నిస్తున్న వారికి నేను చెప్పేది ఒకటే.. మీరెన్నటికీ విజయం సాధించలేరని అని ఉద్ఘాటించారు. ఈ మాటలు స్ఫూర్తిదాయకం. సరిహద్దు సమస్యతో నిత్యకలహాలతో నిప్పుల కుంపటిగా ఉండే ఎరిత్రియాతో చర్చలు చేశా రు. ఆయన వైరి దేశాన్ని ప్రేమతోనే గెలిచారు. అబియ్ అహ్మద్ తనదైన చిత్తశుద్ధి నిబద్ధత గల కార్యాచరణతో మొత్తం ఆఫ్రికా ఖండ అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించాడు. ఇంతకన్నా ఒక నాయకుడు ఏం చేయాలి. దీనికి ఏం కావాలి? 56 ఇంచుల ఛాతి కాదు, హృదయంలో మానవత్వం ఉండా లి. అది పుష్కలంగా ఉన్న అబియ్ అహ్మద్ అందరికీ ఆదర్శం.
(వ్యాసకర్త: కన్నడ రచయిత. దళిత, సామాజిక ఉద్యమకారుడు)
ది వైర్ సౌజన్యంతో...

346
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles